ప్రజావాణి,నంగునూరు, అక్టోబరు 27:
మండల అద్ధి, ప్రజా సమస్యల పరిష్కారానికి వేదిక కావాల్సిన సర్వసభ్య సమావేశానికి పలు శాఖల అధికారులు గైర్హాజరయ్యారు. ప్రజాప్రతినిధులు లేవనెత్తే సమస్యలకు సమాధానాలు ఇవ్వాల్సిన అధికారులే సమావేశానికి రాకపోవడంతో సమీక్ష లక్ష్యం ప్రశ్నార్థకంగా మారింది. సిద్ధిపేట జిల్లా నంగునూరు మండల ప్రజా పరిషత్ కార్యాలయంలో మంగళవారం ఎంపీడీవో శ్రీనివాస్ ఆధ్వర్యంలో నిర్వహించిన సమావేశంలో ఈ పరిస్థితి కనిపించింది. మండల ప్రత్యేక అధికారి శివరాణి సమావేశానికి హాజరయ్యారు.
వ్యవసాయ, రెవెన్యూ, పశుసంవర్ధక, వైద్య ఆరోగ్య, విద్య, పంచాయతీరాజ్, స్త్రీ శిశు సంక్షేమ, విద్యుత్, మిషన్ భగీరథ, నీటిపారుదల, ఐకేపీ, ఉపాధి హామీ, ఆర్‌అండ్‌బీ, గృహ నిర్మాణ శాఖల అధికారులు పాల్గొన్నారు. ఆర్టీసీ, అటవీ, ఉద్యానవన, ఎక్సైజ్, మత్స్య, పట్టు పరిశ్రమ శాఖల అధికారులు హాజరుకాలేదు. వివిధ శాఖల పరిధిలోని సమస్యలు, పెండింగ్ పనులు, ప్రభుత్వ పథకాల అమలుపై సమగ్ర సమాచారం అందించాల్సిన అధికారులు గైర్హాజరు కావడం చర్చనీయాంశం అయింది.
*ప్రజా సమస్యలపై చర్యలేవీ?*
గ్రామాల్లో తాగునీరు, రహదారులు, పారిశుద్ధ్యం, విద్యుత్ సరఫరా, సాగునీరు, విద్య, వైద్యం, గృహ నిర్మాణాలు, సంక్షేమ పథకాల అమలుపై సమీక్షించడం సమావేశాల ప్రధాన ఉద్దేశం. గత సమావేశాల్లో ప్రస్తావించిన సమస్యల పరిష్కార పురోగతి, పెండింగ్ పనుల స్థితి, వాటి పూర్తికి నిర్ణయించిన గడువుపై సమీక్ష జరగాలి. శాఖల అధికారులు లేకపోవడంతో ఆయా అంశాలపై సమగ్ర చర్చకు అవకాశం ఎలా లభిస్తుందని పలువురు సభ్యులు వాపోయారు.
అధికారులు నిర్ణీత సమయానికి సమావేశాలకు హాజరై తమ శాఖల వివరాలను వెల్లడించాలి. ప్రజాప్రతినిధులు లేవనెత్తిన సమస్యలకు పరిష్కార మార్గాలు చూపాలి. గైర్హాజరైన అధికారుల నుంచి వివరణ తీసుకుని, భవిష్యత్తులో ఇలాంటి పరిస్థితులు పునరావృతం కాకుండా చర్యలు చేపట్టాలని పలువురు సభ్యులు అభిప్రాయపడ్డారు.
*ఎల్ నినో పై రైతులకు అవగాహన కల్పించాలి*
సమావేశంలో నంగునూరు వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్ దేవులపల్లి యాదగిరి మాట్లాడుతూ, ఎల్ నినో ప్రభావంతో వ్యవసాయ రంగానికి ఎదురయ్యే ముప్పును వివరించడం ద్వారా రైతులకు అవగాహన కల్పించాలని అధికారులు, ప్రజా ప్రతినిధులను కోరారు. వాతావరణ మార్పులకు అనుగుణంగా పంటల సాగు, నీటి వినియోగం, వ్యవసాయ నిర్వహణపై రైతులకు శాస్త్రీయ సూచనలు అందించాలని చెప్పారు. వ్యవసాయ శాఖ అధికారులు గ్రామస్థాయిలో విస్తృతంగా అవగాహన కార్యక్రమాలు నిర్వహించాలని తెలిపారు.
వాతావరణ పరిస్థితులపై ముందస్తు సమాచారం అందితే రైతులు తగిన జాగ్రత్తలు తీసుకునేందుకు అవకాశం ఉంటుందన్నారు గ్రామ పంచాయతీలు, సర్పంచులు, వ్యవసాయ శాఖ అధికారులు సమన్వయంతో పనిచేయాలని సూచించారు.
*అభివృద్ధి సమావేశాలు ఆచరణలో ఫలించాలిసర్వసభ్య సమావేశాలు కేవలం హాజరు నమోదు, చర్చలకే పరిమితం కాకుండా ప్రజా సమస్యల పరిష్కారానికి దోహద పడాలని సభ్యులు కోరారు. ప్రతి శాఖ అధికారి హాజరై సమస్యలపై స్పష్టత ఇవ్వాలన్నారు. సమస్యల పరిష్కారానికి గడువు నిర్ణయించి, తదుపరి సమావేశంలో పురోగతిని సమీక్షించాలని చెప్పారు. అప్పుడే సమావేశాల నిర్వహణకు సార్థకత చేకూరుతుందన్నారు. ఈ సమావేశంలో పీఏసీఎస్ చైర్మన్లు కోల రమేశ్ గౌడ్, ఎల్లంకి మహిపాల్ రెడ్డి, వివిధ గ్రామాల సర్పంచులు పాల్గొన్నారు