prajavaani.net
Newspaper Banner
Date of Publish : 16 October 2026, 1:33 pm Digital Edition : PRAJA VANI

సద్దుల బతుకమ్మ ఏర్పాట్లపై కాంగ్రెస్ నేత గొర్రె కిరణ్ కుమార్ పరిశీలన

సద్దుల బతుకమ్మ ఏర్పాట్లపై కాంగ్రెస్ నేత గొర్రె కిరణ్ కుమార్ పరిశీలన!

పెద్ద చెరువు బతుకమ్మ ఆటస్థలం, చెన్నంగి చెరువు కట్ట వద్ద ఏర్పాట్ల తనిఖీ

హసన్‌పర్తి, అక్టోబర్ 16 (మన ప్రజావాణి):

సద్దుల బతుకమ్మ పండుగను పురస్కరించుకుని హసన్‌పర్తి 66వ డివిజన్‌లో మహిళలు, ఆడపడుచులు ఎలాంటి ఇబ్బందులు లేకుండా బతుకమ్మ సంబరాలు నిర్వహించుకునేలా అవసరమైన ఏర్పాట్లను కాంగ్రెస్ పార్టీ డివిజన్ అధ్యక్షుడు గొర్రె కిరణ్ కుమార్ అధికారులతో కలిసి పరిశీలించారు.

వర్ధన్నపేట శాసనసభ్యులు, విశ్రాంత ఐపీఎస్ అధికారి కేఆర్ నాగరాజు ఆదేశాల మేరకు గ్రేటర్ వరంగల్ పరిధిలోని హసన్‌పర్తి 66వ డివిజన్‌లో ఉన్న పెద్ద చెరువు బతుకమ్మ ఆటస్థలాన్ని, చెన్నంగి చెరువు కట్టను ఆయన సందర్శించారు. బతుకమ్మ ఆడుకునే ప్రదేశాల్లో లైటింగ్ సదుపాయాలు, గుంతలమయంగా ఉన్న రహదారులు, రహదారుల పక్కన పెరిగిన చెట్ల పొదలను పరిశీలించారు.

పండుగ సందర్భంగా మహిళలు పెద్ద సంఖ్యలో తరలివచ్చే అవకాశం ఉండటంతో ఆటస్థలాల వద్ద తగిన వెలుతురు, రహదారుల సౌకర్యం, పరిసరాల పరిశుభ్రతకు ప్రాధాన్యత ఇవ్వాలని అధికారుల దృష్టికి తీసుకెళ్లారు. ప్రజలకు ఇబ్బందులు కలగకుండా అవసరమైన ఏర్పాట్లు చేపట్టాలని సూచించారు.

సద్దుల బతుకమ్మను హసన్‌పర్తి ప్రజలు, మహిళలు, ఆడపడుచులు ఆనందోత్సాహాల మధ్య సంతోషంగా జరుపుకునేలా ఏర్పాట్లను సమన్వయం చేయడమే లక్ష్యంగా ఈ పర్యటన చేపట్టినట్లు తెలిపారు.