prajavaani.net
Newspaper Banner
Date of Publish : 27 October 2026, 9:25 pm Digital Edition : PRAJA VANI

సత్తుపల్లి మ్యూల్ అకౌంట్ల కేసులో ముగ్గురు అరెస్ట్

*సత్తుపల్లి మ్యూల్ అకౌంట్ల కేసులో ముగ్గురు అరెస్ట్!*

*రూ.వందల కోట్ల సైబర్ లావాదేవీల కేసులో టిజి సిఎస్బి స్పెషల్ టీం దర్యాప్తు..*

*కొత్తగూడెంలో ఇద్దరు.. ఖమ్మంలో ఒకరి పట్టివేత…*

కొత్తగూడెం, అక్టోబర్ 27 (మన ప్రజావాణి): తెలుగు రాష్ట్రాల్లో సంచలనం సృష్టించిన ఖమ్మం జిల్లా సత్తుపల్లి, పెనుబల్లి మ్యూల్ అకౌంట్ల కేసులో తెలంగాణ సైబర్ సెక్యూరిటీ బ్యూరో (టిజి సిఎస్బి) స్పెషల్ ఇన్వెస్టిగేషన్ టీం కీలక చర్యలు చేపట్టింది. ఖమ్మం, కొత్తగూడెం సైబర్ క్రైమ్ పోలీసుల సహకారంతో ముగ్గురు అనుమానితులను అరెస్ట్ చేసింది. వీరిలో ఇద్దరిని కొత్తగూడెంలో, మరొకరిని ఖమ్మంలో అదుపులోకి తీసుకున్నట్లు సమాచారం. అనంతరం వారిని హైదరాబాద్‌లోని అబిడ్స్ సైబర్ క్రైమ్ పోలీస్ స్టేషన్‌కు తరలించినట్లు తెలిసింది.

*రూ.5 కోట్ల జమతో వెలుగులోకి..*

2022లో కొత్తగూడెంకు చెందిన ఓ వ్యక్తి బ్యాంకు ఖాతాలో ఏకంగా రూ.5 కోట్లు జమ కావడం ఈ వ్యవహారంలో కీలక అంశంగా తెలుస్తోంది. సత్తుపల్లి, పెనుబల్లి మ్యూల్ అకౌంట్ల కేసుల దర్యాప్తులో భాగంగా ఈ ఖాతాల లావాదేవీలపై పోలీసులు దృష్టి సారించినట్లు సమాచారం. కొత్తగూడెం వన్‌టౌన్ పరిధిలో ఇద్దరిని అదుపులోకి తీసుకున్నట్లు తెలుస్తుండగా, ఖమ్మంలో మరో వ్యక్తిని పట్టుకున్నారు.

*వందల కోట్ల లావాదేవీలపై దర్యాప్తు…*

ఈ కేసుల్లో మ్యూల్ అకౌంట్ల ద్వారా భారీ మొత్తంలో నగదు లావాదేవీలు జరిగినట్లు గతంలో దర్యాప్తులో వెల్లడైంది. ఇతరుల బ్యాంకు ఖాతాలను వినియోగించుకుని సైబర్ మోసాల ద్వారా వచ్చిన సొమ్మును బదిలీ చేసిన వ్యవహారంపై అధికారులు విచారణ కొనసాగిస్తున్నారు. అంతర్జాతీయ సైబర్ నేరగాళ్లతో సంబంధాలున్నాయనే కోణంలోనూ దర్యాప్తు సాగుతున్నట్లు తెలుస్తోంది.

టిజి సిఎస్బి స్పెషల్ ఇన్వెస్టిగేషన్ టీం ఆధ్వర్యంలో ఖమ్మం, కొత్తగూడెం సైబర్ క్రైమ్ విభాగాలు సంయుక్తంగా ఈ చర్యలు చేపట్టినట్లు సమాచారం. ఖమ్మం సైబర్ క్రైమ్ డిఎస్పీలు ప్రసాద్, ఫణిందర్ తో పాటు కొత్తగూడెం సైబర్ క్రైమ్ సీఐ నరేష్ ఆధ్వర్యంలో కూడా దాడులు నిర్వహించినట్లు తెలుస్తోంది. తాజాగా అరెస్టయిన ముగ్గురి పాత్ర, వారి బ్యాంకు ఖాతాల ద్వారా జరిగిన లావాదేవీలు, ఇతర నిందితులతో ఉన్న సంబంధాలపై పోలీసులు మరింత లోతుగా విచారణ చేపట్టనున్నట్లు సమాచారం.

*మ్యూల్ అకౌంట్లు అమ్ముకోవద్దు : జిల్లా ఎస్పీ రోహిత్ రాజు*

జిల్లాలో ఎవరైనా సరే తమ మ్యూల్ అకౌంట్లను అమ్ముకోవద్దని జిల్లా ఎస్పీ రోహిత్ రాజు సూచించారు. ఎవరైనా సరే తమ అకౌంట్లోను విక్రయించినట్లు తెలిసిన, సైబర్ నేరాలకు పాల్పడేవారికి సహకరిస్తున్నట్లు తెలిసిన చర్యలు కఠినంగా ఉంటాయని హెచ్చరించారు.