సంస్కృతీ సంప్రదాయాల కాంతి.. సిద్ధార్థలో ముందస్తు బతుకమ్మ సంబరాలు!
ఆకట్టుకున్న కన్నులపండువ వేడుకలు
ఆటపాటలతో హోరెత్తించిన పాఠశాల ప్రాంగణం
భావితరాలకు సంస్కృతిని అందించాలి: కంది గోపాల్ రెడ్డి, వీరమల్ల మాధవరెడ్డి
చెన్నారావుపేట అక్టోబర్ 08 ప్రజావాణి
రంగురంగుల పూల ఘుమఘుమలు.. చిన్నారుల చేతి గాజుల సవ్వడులు.. లయబద్ధమైన కోలాటాల నడుమ దసరా నవరాత్రులను పురస్కరించుకుని చెన్నారావుపేట మండల కేంద్రంలోని సిద్ధార్థ హైస్కూల్లో గురువారం ముందస్తు బతుకమ్మ సంబరాలు అంబరాన్నంటాయి. తెలంగాణ ఆత్మగౌరవానికి, ప్రకృతి సౌందర్యానికి ప్రతీకైన ఈ పండుగను పాఠశాల ప్రాంగణంలో శోభాకరంగా నిర్వహించారు.ఈ వేడుకలను సిద్ధార్థ విద్యాసంస్థల చైర్మన్ కంది గోపాల్ రెడ్డి, డైరెక్టర్ వీరమల్ల మాధవరెడ్డిలు విద్యార్థులతో కలసి సంప్రదాయబద్ధంగా ప్రారంభించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ…తెలంగాణ నేల సమృద్ధికి, ప్రకృతి విశిష్టతకు బతుకమ్మ పండుగే ప్రత్యక్ష నిదర్శనం. మన పూర్వీకుల నుంచి వారసత్వంగా వచ్చిన సాంస్కృతిక వైభవాన్ని కాపాడుకుంటూ, మన సంప్రదాయాల విశిష్టతను భావితరాలకు సగర్వంగా అందించాల్సిన బాధ్యత అందరిపైనా ఉంది” అని ఉద్ఘాటించారు.సాంప్రదాయ వస్త్రధారణలో వచ్చిన విద్యార్థినులు, ఉపాధ్యాయినులు తంగేడు, గునుగు, బంతి, చామంతి పూలతో అంబరమంటేలా బతుకమ్మలను పేర్చారు. “బతుకమ్మ బతుకమ్మ ఉయ్యాలో..”ఒక్కేసి పువ్వేసి చందమామ..” అంటూ ఆడుతూ పాడుతూ, కోలాటాలతో అలరించారు. పాఠశాల ప్రాంగణమంతా పండుగ వాతావరణం నెలకొంది.ఈ కార్యక్రమంలో పాఠశాల ప్రిన్సిపాల్ కరుణాకర్ రెడ్డి, మేడి రమేష్ గౌడ్, ఉపాధ్యాయినులు ముదురు పద్మ, నామాల సృజన, కుండె రోజా రాణి, బొజ్జ స్వప్న, దివ్య జ్యోతి, రమాదేవి, స్రవంతి, జ్యోతి, రజిత, శైలజ, శ్రావణి, రోజా, కాచవరపు సంధ్య, అఖిల, స్వాతి,విద్యార్థి విద్యార్థినీలు తదితరులు పాల్గొన్నారు.