prajavaani.net
Newspaper Banner
Date of Publish : 18 October 2026, 11:51 am Digital Edition : MAHESH MEDCHAL

శ్రమదానంతో వీరారెడ్డిపల్లిని ఆదర్శ గ్రామంగా తీర్చిదిద్దుదాం సర్పంచ్ దుర్గా నర్సింగరావు

*శ్రమదానంతో వీరారెడ్డిపల్లిని ఆదర్శ గ్రామంగా తీర్చిదిద్దుదాం*

*గ్రామ యువత వారానికి ఒక్కసారైనా శ్రమదానంలో పాల్గొనాలి: సర్పంచ్ దుర్గా నర్సింగరావు

గుమ్మడిదల: గ్రామ అభివృద్ధితో పాటు పరిశుభ్రతకు ప్రతి ఒక్కరూ ప్రాధాన్యతనిస్తూ, తమ వంతు బాధ్యతగా శ్రమదాన కార్యక్రమాల్లో పాల్గొనాలని వీరారెడ్డిపల్లి గ్రామ సర్పంచ్ దుర్గా నర్సింగరావు పిలుపునిచ్చారు. గ్రామాన్ని పరిశుభ్రంగా, సుందరంగా తీర్చిదిద్ది ఆదర్శంగా నిలపాలనే లక్ష్యంతో ఆదివారం గ్రామంలో శ్రమదాన కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా సర్పంచ్ దుర్గా నర్సింగరావు మాట్లాడుతూ.. గ్రామ అభివృద్ధి అనేది కేవలం ప్రజాప్రతినిధులు, అధికారుల బాధ్యత మాత్రమే కాదని, ప్రతి గ్రామస్థుడి భాగస్వామ్యంతోనే సాధ్యమవుతుందని పేర్కొన్నారు. ముఖ్యంగా యువత గ్రామ అభివృద్ధిలో చురుకైన పాత్ర పోషించాలని, అందరూ ముందుకు వచ్చి వారానికి కనీసం ఒక్కసారైనా శ్రమదాన కార్యక్రమంలో పాల్గొనాలని కోరారు.
గ్రామంలోని వీధులు, బహిరంగ ప్రదేశాలు పరిశుభ్రంగా ఉండేలా ప్రతి ఒక్కరూ సహకరించాలని సూచించారు. ఎక్కడపడితే అక్కడ చెత్తాచెదారం వేయడం వల్ల పరిసరాలు అపరిశుభ్రంగా మారడమే కాకుండా ప్రజలకు ఇబ్బందులు ఎదురయ్యే అవకాశం ఉందన్నారు. అందువల్ల బహిరంగ ప్రదేశాల్లో చెత్త వేయకుండా, పరిసరాల పరిశుభ్రతను కాపాడేందుకు ప్రతి ఒక్కరూ బాధ్యతాయుతంగా వ్యవహరించాలని పిలుపునిచ్చారు. శ్రమదానం ద్వారా గ్రామంలో పరిశుభ్రతపై ప్రజలకు అవగాహన పెరుగుతుందని, అందరూ ఐక్యంగా కృషి చేస్తే గ్రామాన్ని మరింత అభివృద్ధి పథంలో నడిపించవచ్చని అన్నారు. గ్రామస్థులు, యువత స్వచ్ఛందంగా ముందుకు వచ్చి ఇలాంటి కార్యక్రమాల్లో భాగస్వాములు కావాలని కోరారు. వీరారెడ్డిపల్లిని పరిశుభ్రతలో ఆదర్శ గ్రామంగా తీర్చిదిద్దేందుకు ప్రతి ఒక్కరూ సహకరించాలని సర్పంచ్ దుర్గా నర్సింగరావు విజ్ఞప్తి చేశారు.