*శంకరంపేట బస్టాండ్ లో అపస్మారక స్థితిలో లభ్యమైన వ్యక్తి మృతి – గుర్తుతెలియని మృతుడి ఆచూకీ కోసం పోలీసుల విజ్ఞప్తి*
ప్రజావాణి న్యూస్ ప్రతినిధి పెద్ద శంకరంపేట
పెద్ద శంకరంపేట బస్టాండ్ లో గుర్తుతెలియని స్థితిలో లభ్యమైన వ్యక్తి ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మృతి చెందిన విషాద ఘటన శంకరంపేట మండలంలో చోటుచేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం…
ఈ నెల 12-10-2026వ తేదీన ఉదయం సమయంలో శంకరంపేట బస్టాండ్ ఆవరణలో సుమారు 34 సంవత్సరాల వయస్సు గల గుర్తుతెలియని మగ వ్యక్తి స్పృహ తప్పి నేలపై పడి ఉన్నాడు. బస్టాండ్ లోని ప్రయాణికులు, ఆటో డ్రైవర్లు దీనిని గమనించి వెంటనే 108 అంబులెన్స్ కు మరియు పోలీసులకు సమాచారం అందించారు.
సమాచారం అందుకున్న వెంటనే 108 సిబ్బంది హుటాహుటిన ఘటనా స్థలానికి చేరుకుని, స్పృహ లేని స్థితిలో ఉన్న ఆ వ్యక్తిని ప్రాథమిక చికిత్స నిమిత్తం జోగిపేట్ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. అక్కడ వైద్యులు ప్రాథమిక చికిత్స అందించి, అతని ఆరోగ్య పరిస్థితి విషమంగా ఉండటంతో మెరుగైన చికిత్స కోసం అదే రోజు సంగారెడ్డి జిల్లా ప్రభుత్వ ప్రధాన ఆసుపత్రికి తరలించారు.
సంగారెడ్డి ప్రభుత్వ ఆసుపత్రిలో వైద్యులు నాలుగు రోజుల పాటు అతనికి అత్యవసర చికిత్స అందించారు. అయితే అతని ఆరోగ్య పరిస్థితి మెరుగుపడకపోవడంతో, చికిత్స పొందుతూ 16-10-2026వ తేదీన అతడు తుదిశ్వాస విడిచినట్లు ఆసుపత్రి వర్గాలు తెలిపాయి. అతని వద్ద ఎటువంటి గుర్తింపు కార్డులు, సెల్ ఫోన్ లేదా ఇతర ఆధారాలు లభ్యం కాలేదని, దీంతో అతని వివరాలు తెలియరాలేదని పోలీసులు పేర్కొన్నారు.
*మృతుడి ఆనవాళ్లు ఇలా ఉన్నాయి:*
మృతుడు సుమారు 34 సంవత్సరాల వయస్సు గల మగ వ్యక్తి. ఎత్తు సుమారు 5.5 అడుగులు ఉంటుంది. మరణించే సమయంలో అతడు బూడిద రంగు స్వెటర్, లోపల తెల్ల రంగు బనియన్, బ్లూ కలర్ జీన్స్ ప్యాంటు ధరించి ఉన్నాడు. మధ్యస్థ శరీరాకృతి కలిగి ఉన్నాడు.
ప్రస్తుతం మృతదేహాన్ని సంగారెడ్డి ప్రభుత్వ ఆసుపత్రి మార్చురీలో భద్రపరచడం జరిగింది. మృతదేహానికి పోస్టుమార్టం నిర్వహించిన అనంతరం కూడా ఎవరూ గుర్తించకపోవడంతో పోలీసులు మార్చురీలోనే ఉంచారు.
ఈ క్రమంలో శంకరంపేట పోలీసులు ప్రజలకు విజ్ఞప్తి చేస్తున్నారు. ఇటీవల కాలంలో అనగా 12వ తేదీ నుండి ఎవరైనా 34 సంవత్సరాల వయస్సు గల వ్యక్తి తప్పిపోయినా, ఇంటి నుండి వెళ్లి తిరిగి రాకపోయినా, పై ఆనవాళ్లు, దుస్తుల ఆధారంగా గుర్తించి వెంటనే శంకరంపేట పోలీస్ స్టేషన్ ను ఫోన్ నంబర్లు: 8712657884, 8712657924. సంప్రదించగలరని కోరుతున్నారు. బంధువులు, కుటుంబ సభ్యులు ఎవరైనా ఉంటే వారికి సమాచారం అందించి, మృతదేహాన్ని అప్పగించేందుకు పోలీసులు సిద్ధంగా ఉన్నామని తెలిపారు.