పోచారం అక్టోబర్ 10 (ప్రజావాణి):తెలంగాణ సంస్కృతి, సంప్రదాయాలకు ప్రతీకగా నిలిచే బతుకమ్మ పండుగను పురస్కరించుకుని వైష్ణవి నగర్ ఓనర్స్ కాలనీలో మొదటి రోజు బతుకమ్మ వేడుకలను మహిళలు అత్యంత వైభవంగా నిర్వహించారు. వైష్ణవి నగర్ ఓనర్స్ వెల్ఫేర్ అసోసియేషన్ ఆధ్వర్యంలో జరిగిన ఈ వేడుకల్లో కాలనీ మహిళలు పెద్ద సంఖ్యలో పాల్గొని రంగురంగుల పూలతో బతుకమ్మలను అందంగా పేర్చి భక్తిశ్రద్ధలతో పూజలు నిర్వహించారు.
అనంతరం సంప్రదాయ బతుకమ్మ పాటలు పాడుతూ, చప్పట్లతో లయబద్ధంగా బతుకమ్మ ఆటలు ఆడి సందడి చేశారు. మహిళల ఉత్సాహం, పూల బతుకమ్మల అందాలతో కాలనీ అంతా పండుగ శోభను సంతరించుకుంది. చిన్నా పెద్దా తేడా లేకుండా మహిళలంతా కలిసికట్టుగా పాల్గొని ఆనందోత్సాహాల మధ్య వేడుకలను జరుపుకున్నారు.
బతుకమ్మ పండుగ తెలంగాణ ఆడపడుచుల ఆత్మీయతకు, ప్రకృతి ప్రేమకు, మహిళల ఐక్యతకు ప్రతీకగా నిలుస్తుందని ఈ సందర్భంగా పలువురు పేర్కొన్నారు. ఇలాంటి సంప్రదాయ వేడుకల నిర్వహణతో భావితరాలకు మన సంస్కృతి, సంప్రదాయాలను పరిచయం చేయడంతో పాటు కాలనీవాసుల మధ్య స్నేహభావం, ఐకమత్యం మరింత బలపడుతుందని తెలిపారు. వైష్ణవి నగర్ ఓనర్స్ వెల్ఫేర్ అసోసియేషన్ ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ వేడుకలు ఉత్సాహభరిత వాతావరణంలో కొనసాగాయి.
