prajavaani.net
Newspaper Banner
Date of Publish : 14 October 2026, 8:03 am Digital Edition : PRAJA VANI

వీరనారి చాకలి ఐలమ్మ విగ్రహం ధ్వంసం

వీరనారి చాకలి ఐలమ్మ విగ్రహం ధ్వంసం.. దుండగులను కఠినంగా శిక్షించాలి – నాగిళ్ళ శంకర్ డిమాండ్

నల్గొండ జిల్లా ప్రతినిధి ప్రజావాణి

జిల్లా కేంద్రంలో తెలంగాణ వీరనారి, సాయుధ పోరాట యోధురాలు చాకలి ఐలమ్మ విగ్రహాన్ని ధ్వంసం చేసిన ఘటన తీవ్ర ఆగ్రహాన్ని రేకెత్తిస్తోంది. ఈ దుశ్చర్యకు పాల్పడిన దుండగులను వెంటనే గుర్తించి, అరెస్టు చేసి కఠినంగా శిక్షించాలని చాకలి ఐలమ్మ సంఘం తెలంగాణ రాష్ట్ర ఫౌండర్ చైర్మన్ ఐదారి నాగిళ్ళ శంకర్ ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. భూమి కోసం.. భుక్తి కోసం.. వెట్టిచాకిరీ విముక్తి కోసం పోరాడిన వీరనారి చాకలి ఐలమ్మ విగ్రహాన్ని ధ్వంసం చేయడం అత్యంత హేయమైన చర్య అని ఐదారి నాగిళ్ళ శంకర్ ఆగ్రహం వ్యక్తం చేశారు. తెలంగాణ ప్రజల గుండెల్లో చిరస్థాయిగా నిలిచిపోయిన ఐలమ్మ విగ్రహంపై దాడి చేయడం అంటే కేవలం ఒక విగ్రహాన్ని ధ్వంసం చేయడం మాత్రమే కాదని, సబ్బండ వర్గాల ఆత్మగౌరవాన్ని కించపరిచే చర్య అని పేర్కొన్నారు. అణగారిన వర్గాల హక్కుల కోసం ధైర్యంగా పోరాడిన ఐలమ్మ చరిత్రను, ఆమె పోరాట స్ఫూర్తిని ఎవరూ చెరిపివేయలేరని స్పష్టం చేశారు. మెదక్‌లో చాకలి ఐలమ్మ విగ్రహాన్ని ధ్వంసం చేసిన వారిని ప్రభుత్వం వెంటనే గుర్తించి అరెస్టు చేయాలి. నిందితులకు చట్టప్రకారం కఠిన శిక్షలు విధించాలి. ధ్వంసమైన విగ్రహాన్ని వెంటనే పునరుద్ధరించాలి. భవిష్యత్తులో ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా విగ్రహానికి తగిన భద్రత కల్పించాలి. అదేవిధంగా, తెలంగాణ వీరనారి చాకలి ఐలమ్మ చరిత్రకు, ఆమె పోరాట ఆశయాలకు ప్రభుత్వం తగిన గౌరవం కల్పించాలని కోరారు. “నడుస్తున్న చరిత్ర తెలంగాణ తల్లి వీరనారి చాకలి ఐలమ్మ విగ్రహంపై దాడి అంటే ఒక విగ్రహంపై దాడి కాదు.. సబ్బండ వర్గాల ఆత్మగౌరవంపై జరిగిన దాడి! ఐలమ్మ చరిత్రను చెరిపేయడం ఎవరి తరం కాదు. ఆమె పోరాట స్ఫూర్తిని అణచివేయడం అసాధ్యం. ఆమె ఆశయాలే మా పోరాటానికి బలం” అని ఐదారి నాగిళ్ళ శంకర్ స్పష్టం చేశారు. చాకలి సమాజ ఆత్మగౌరవానికి ప్రతీకగా నిలిచిన వీరనారి ఐలమ్మకు అవమానం జరిగితే యావత్ సమాజం ప్రశ్నిస్తుందని, బాధ్యులపై కఠిన చర్యలు తీసుకునే వరకు ప్రజాస్వామ్యబద్ధంగా నిరసన కొనసాగిస్తామని తెలిపారు. వీరనారి చాకలి ఐలమ్మ విగ్రహాన్ని ధ్వంసం చేసిన ఘటనపై ప్రభుత్వం తక్షణమే స్పందించి, బాధ్యులపై చర్యలు తీసుకోవాలని చాకలి ఐలమ్మ సంఘం తెలంగాణ ఫౌండర్ చైర్మన్ ఐదారి నాగిళ్ళ శంకర్ డిమాండ్ చేశారు.