*వీడీసీకి అధికారం ఇచ్చింది ఎవరు? ఇటిక్యాల వాగులో రూ.15 లక్షల ఇసుక దందా!*
*రాయికల్, అక్టోబర్ 14 (ప్రజావాణి):*
రాయికల్ మండలం ఇటిక్యాల గ్రామ శివారు వాగులో ఇసుక తవ్వకాలకు గ్రామాభివృద్ధి కమిటీ (వీడీసీ) ఆధ్వర్యంలో అనధికారికంగా నిర్వహించిన బహిరంగ వేలం పాట ఏకంగా రూ.15 లక్షలకు పలికినట్లు విశ్వసనీయ సమాచారం. గ్రామంలోనే రహస్యంగా నిర్వహించిన ఈ వేలం పాటలో పాల్గొనడానికి ముందే ఒక్కొక్కరి నుంచి రూ.20,000 చొప్పున డిపాజిట్ వసూలు చేసినట్లు తెలుస్తోంది. పలువురు గుత్తేదారులు పోటీపడగా, చివరకు ఒక గుత్తేదారుడు రూ.15 లక్షలకు దక్కించుకున్నట్లు గ్రామస్తులు చెబుతున్నారు. అయితే దీనిపై వీడీసీ నుంచి ఇంతవరకు ఎలాంటి అధికారిక ప్రకటన వెలువడలేదు.అసలు చట్టబద్ధతే లేని వీడీసీకి ఇన్ని హక్కులు ఎక్కడివి అనే అంశంపై గ్రామంలో తీవ్ర చర్చ జరుగుతోంది. ప్రభుత్వ గుర్తింపు లేని, ఎలాంటి చట్టపరమైన అధికారాలు లేని వీడీసీకి వాగులో ఇసుక తవ్వకాలకు టెండర్లు వేసే అధికారం, డిపాజిట్లు వసూలు చేసే అధికారం ఎవరు ఇచ్చారని పలువురు ప్రశ్నిస్తున్నారు. ప్రభుత్వ నిబంధనల ప్రకారం ఇసుక తవ్వకాలకు మైనింగ్ శాఖ అనుమతి, పర్యావరణ అనుమతులు, సీనరేజ్ చెల్లింపు తప్పనిసరి. అలాంటిది ఎలాంటి అధికారిక టెండర్ ప్రక్రియ లేకుండా వీడీసీ టెండర్ వేయడం, డబ్బులు వసూలు చేయడం పూర్తిగా అక్రమమని ఆరోపణలు వినిపిస్తున్నాయి.చట్టబద్ధత లేని కమిటీనే 6 నెలల అనుమతి అని, నిబంధనలు అతిక్రమిస్తే టెండర్ రద్దు చేస్తామని చెప్పడం విడ్డూరంగా మారిందని విమర్శిస్తున్నారు. ఈ టెండర్ ద్వారా వచ్చే రూ.15 లక్షలు, డిపాజిట్ రూపంలో వసూలు చేసిన లక్షల రూపాయలు గ్రామ పంచాయతీ ఖజానాకు జమ అవుతాయా లేక వ్యక్తిగత జేబుల్లోకి వెళ్తాయా అనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. దీనిపై రెవెన్యూ, మైనింగ్ శాఖ ఉన్నతాధికారులు జోక్యం చేసుకొని విచారణ జరిపి అక్రమ ఇసుక దందాను అరికట్టాలని పలువురు డిమాండ్ చేస్తున్నారు.