prajavaani.net
Newspaper Banner
Date of Publish : 01 October 2026, 6:47 pm Digital Edition : PRAJA VANI

వివాహేతర సంబంధానికి అడ్డొచ్చాడని భర్త హత్య

వివాహేతర సంబంధానికి అడ్డొచ్చాడని భర్త హత్య

ఆత్మహత్యగా చిత్రీకరించేందుకు యత్నం

భార్య, ప్రియుడు సహా ముగ్గురి అరెస్ట్‌

14 రోజుల జ్యుడీషియల్‌ రిమాండ్‌

ప్రజావాణి. గణపురం: వివాహేతర సంబంధానికి అడ్డుగా ఉన్నాడనే కక్షతో భర్తను హత్య చేసి, ఆత్మహత్యగా చిత్రీకరించేందుకు ప్రయత్నించిన ఘటన జయశంకర్‌ భూపాలపల్లి జిల్లా గణపురం మండలం బుద్ధారం గ్రామంలో వెలుగుచూసింది. ఈ కేసులో మృతుడి భార్యతో పాటు ఆమె ప్రియుడు, మరో వ్యక్తిని పోలీసులు అరెస్ట్‌ చేసి కోర్టులో హాజరుపరచగా 14 రోజుల జ్యుడీషియల్‌ రిమాండ్‌ విధించారు. కేసు వివరాలను భూపాలపల్లి డీఎస్పీ సంపత్‌రావు, సీఐ కరుణాకర్‌రావు, ఎస్సై అశోక్‌ గురువారం వెల్లడించారు.

గొల్లపల్లి గ్రామానికి చెందిన పెండెల సంపత్‌ (32) ప్లంబర్‌గా పనిచేస్తూ బుద్ధారంలోని అత్తగారింట్లో భార్య సుమలత (26)తో కలిసి ఉంటున్నాడు. కొంతకాలంగా సుమలతకు అదే గ్రామానికి చెందిన ఉమ్మల శ్రీకాంత్‌ (36)తో వివాహేతర సంబంధం కొనసాగుతున్నట్లు పోలీసులు తెలిపారు. ఈ విషయం తెలుసుకున్న సంపత్‌ శ్రీకాంత్‌ను పలుమార్లు హెచ్చరించడంతో భార్యాభర్తల మధ్య తరచూ గొడవలు జరిగేవి.

రూ.లక్షకు ఒప్పందం

సంపత్‌ తమ సంబంధానికి అడ్డుగా ఉన్నాడని భావించిన సుమలత, శ్రీకాంత్‌ అతడిని హత్య చేసేందుకు పథకం వేశారు. హత్యకు సహకరించేందుకు అదే గ్రామానికి చెందిన పోలుదాసరి తరుణ్‌ (23)తో రూ.లక్షకు ఒప్పందం చేసుకున్నట్లు పోలీసులు తెలిపారు.

పథకం ప్రకారం సెప్టెంబర్‌ 17న రాత్రి శ్రీకాంత్‌, తరుణ్‌లు సంపత్‌ను మద్యం తాగుదామని నమ్మించి బుద్ధారం జడ్పీహెచ్‌ఎస్‌ పాఠశాల మైదానానికి తీసుకెళ్లారు. అక్కడ మద్యంలో పురుగుల మందు కలిపి సంపత్‌తో తాగించగా తీవ్ర అస్వస్థతకు గురై మృతి చెందినట్లు పోలీసులు వెల్లడించారు.

ఆత్మహత్యగా నమ్మించే ప్రయత్నం

సంపత్‌ మృతి అనంతరం అతడి మృతదేహాన్ని పల్సర్‌ బైక్‌పై ఇంటికి తీసుకొచ్చారు. అతడు పురుగుల మందు తాగి ఆత్మహత్య చేసుకున్నట్లు నమ్మించేందుకు మృతదేహం నోటిపై, దుస్తులపై, ఇంటి నేలపై పురుగుల మందు పోసి అక్కడి నుంచి వెళ్లిపోయినట్లు పోలీసులు తెలిపారు.

మృతుడి కుటుంబ సభ్యుల ఫిర్యాదుతో తొలుత అనుమానాస్పద మృతిగా కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు ముమ్మరం చేశారు. సాంకేతిక ఆధారాలు, సాక్షుల విచారణతో ఇది పథకం ప్రకారం జరిగిన హత్యగా నిర్ధారించారు. పోలీసుల దర్యాప్తు వేగవంతం కావడంతో నిందితులు గ్రామ పెద్దల సమక్షంలో పోలీసుల ఎదుట లొంగిపోయినట్లు తెలిపారు.

నిందితుల నుంచి పల్సర్‌ బైక్‌, మూడు సెల్‌ఫోన్లు, రూ.500 నగదు, పురుగుల మందు కలిపిన మద్యం బాటిల్‌, పురుగుల మందు సీసాను స్వాధీనం చేసుకున్నారు. అనంతరం సుమలత, శ్రీకాంత్‌, తరుణ్‌లను అరెస్ట్‌ చేసి కోర్టులో హాజరుపరచగా 14 రోజుల జ్యుడీషియల్‌ రిమాండ్‌ విధించినట్లు డీఎస్పీ సంపత్‌రావు తెలిపారు.