*విధుల్లో నిర్లక్ష్యం వహిస్తే సహించేది లేదు: కలెక్టర్ స్నేహ శబరీష్ !*
* మహబూబాబాద్ జిల్లాలో 337 మంది ఉపాధ్యాయులకు షోకాజ్ నోటీసులు!
* ఎఫ్ ఆర్ ఎస్ హాజరుపై కలెక్టర్ ప్రత్యేక నిఘా.. నివేదిక కోరిన అధికారులు!
కేసముద్రం అక్టోబర్ 07,ప్రజావాణి.
విద్యాశాఖలో జవాబుదారీతనాన్ని పెంచేందుకు ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా అమలు చేస్తున్న ఫేషియల్ రికగ్నిషన్ సిస్టమ్ (ఎఫ్ఆర్ఎస్ ) హాజరు నమోదుపై మహబూబాబాద్ జిల్లా కలెక్టర్ స్నేహ శబరీష్ కొరడా విధులకు , హాజరు నమోదులో నిర్లక్ష్యం వహిస్తున్న 337 మంది ప్రభుత్వ ఉపాధ్యాయులకు కలెక్టర్ షోకాజ్ నోటీసులు జారీ చేశారు. ఈ నిబంధనల ఉల్లంఘనపై ఆగ్రహం వ్యక్తం చేసిన ఆమె, తక్షణమే పూర్తి వివరాలతో వివరణ ఇవ్వాలని సంబంధిత మండల విద్యాధికారులను ఆదేశించారు.
*ఆకస్మిక తనిఖీలతో బట్టబయలు..!*
జిల్లాలోని పలు ప్రభుత్వ పాఠశాలల్లో ఉపాధ్యాయుల సమయపాలన, విద్యాబోధన తీరుపై కలెక్టర్ ప్రత్యేకంగా నిఘా పెట్టారు. ఎఫ్ ఆర్ఎస్, యాప్ ద్వారా ప్రతిరోజూ ఉపాధ్యాయులు హాజరు నమోదు చేయాల్సి ఉన్నప్పటికీ, వందలాది మంది దీనిని బేఖాతరు చేస్తున్నట్లు ఉన్నతాధికారుల తనిఖీల్లో తేలింది. సాంకేతిక కారణాలు చెప్పి తప్పించుకునే ప్రయత్నం చేస్తున్న వారిపై, కావాలనే హాజరు వేయని వారిపై కలెక్టర్ సీరియస్ అయ్యారు. పాఠశాలల పర్యవేక్షణలో విఫలమైనందుకు ఎంఈఓలపై కూడా ఆమె అసంతృప్తి వ్యక్తం చేసినట్లు సమాచారం.
*నిర్లక్ష్యం వహిస్తే కఠిన చర్యలు తప్పవు!*
భవిష్యత్తులో హాజరు విషయంలో ఎలాంటి అలసత్వాన్ని సహించేది లేదని కలెక్టర్ స్నేహ శబరీష్ స్పష్టం చేశారు. ప్రతి ఒక్కరూ ఖచ్చితంగా ఎఫ్ ఆర్ ఎస్ విధానాన్ని పాటించాల్సిందేనని, విధులకు ఎగనామం పెడితే శాఖాపరమైన కఠిన చర్యలు ఉంటాయని హెచ్చరించారు. విద్యార్థుల భవిష్యత్తుతో ముడిపడి ఉన్న ప్రభుత్వ పాఠశాలల్లో జవాబుదారీతనం తీసుకురావడమే లక్ష్యంగా ఈ ప్రత్యేక చర్యలు చేపట్టినట్లు అధికారులు తెలిపారు. నోటీసులు అందుకున్న ఉపాధ్యాయుల వివరణ ఆధారంగా తదుపరి చర్యలు ఉంటాయని విద్యాశాఖ వర్గాలు వెల్లడించాయి.