*విద్యుత్ ఛార్జీల పెంపు ఆలోచనను తక్షణమే ఉపసంహరించుకోవాలి – సిపిఎం చిల్పూర్ మండల కార్యదర్శి సాదం రమేష్ డిమాండ్*
జనగామ జిల్లా ప్రతినిధి జె.ఉపేందర్, అక్టోబర్ 06(ప్రజావాణి): విద్యుత్ ఛార్జీలను పెంచడానికి కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు చేస్తున్న ఆలోచనను తక్షణమే విరమించుకోవాలని భారత కమ్యూనిస్టు పార్టీ (మార్క్సిస్ట్) చిల్పూర్ మండల కార్యదర్శి సాదం రమేష్ మంగళవారం ఒక ప్రకటన లో డిమాండ్ చేశారు.
తెలంగాణ విద్యుత్ నియంత్రణ మండలి (ERC) చైర్మన్ ‘ట్రూ-అప్’ పేరిట రాబోయే నవంబర్ నుండి యూనిట్‌కు 30 పైసల నుండి 50 పైసల వరకు విద్యుత్ ధరలు పెంచేందుకు సమాయత్తమవుతున్నట్లు వస్తున్న వార్తలపై ఆయన తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. విద్యుత్ ఛార్జీల పెంపు వల్ల పేద ప్రజలపై దాదాపు ₹2,215 కోట్లకు పైగా అదనపు భారం పడుతుందని, ఈ భారాన్ని ప్రజలపై వేయకుండా ప్రభుత్వమే పూర్తిగా భరించాలని స్పష్టం చేశారు.
ఇప్పటికే దేశంలో, రాష్ట్రంలో తీవ్ర ఆర్థిక సంక్షోభం నెలకొని ఉందని, రైతులు, రైతు కూలీలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. రైతులు పండించిన పంటలకు మద్దతు ధర, గిట్టుబాటు ధరలు కల్పించడంలో విఫలమైన ప్రభుత్వాలు.. ఉచిత పథకాల పేరుతో ఆశచూపి ప్రజలను మోసం చేస్తున్నాయని విమర్శించారు. తక్షణమే నిత్యావసరాల ధరలు, విద్యుత్ భారాలు తగ్గించి ప్రజలను ఆదుకోవాలని కోరారు.
గతంలో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో తెలుగుదేశం పార్టీ అధికారంలో ఉన్నప్పుడు విద్యుత్ రంగాన్ని ప్రైవేటీకరించేందుకు కుట్రలు చేస్తే, సిపిఎం ఎర్రజెండాలు పట్టుకొని ప్రాణాలకు తెగించి పోరాటం చేసిందని గుర్తుచేశారు. ఆ విద్యుత్ ఉద్యమంలో ముగ్గురు ప్రాణాలు కోల్పోయారని, ప్రజా ఆగ్రహానికి గురైన నాటి టిడిపి ప్రభుత్వం కాలగర్భంలో కలసిపోయిందని హెచ్చరించారు. ఇప్పుడు అధికారంలో ఉన్న కాంగ్రెస్ ప్రభుత్వం కూడా ప్రజలపై విద్యుత్ భారాలు మోపాలని చూస్తే ప్రజలే తగిన బుద్ధి చెబుతారని అన్నారు.
ప్రభుత్వం ప్రతిపాదిత విద్యుత్ ఛార్జీల పెంపు నిర్ణయాన్ని వెంటనే ఉపసంహరించుకోకపోతే, సిపిఎం ఎర్రజెండా నాయకత్వంలో ప్రజలను సమీకరించి పెద్దఎత్తున పోరాటాలు, ఉద్యమాలు నిర్వహిస్తామని పిలుపునిచ్చారు.