పోరుమామిళ్ల, అక్టోబర్ 03 ప్రజావాణి “ప్రజాస్వామ్యబద్ధంగా గెలవలేక. పోలీసు బలగాలతో, అధికారుల అండతో విద్యా కమిటీ ఎన్నికలను ఏకపక్షంగా మార్చడం సిగ్గుచేటు.ప్రజలు వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ వైపే ఉన్నారని తెలిసి,ఓటమి భయంతోనే తెలుగుదేశం పార్టీ ఈ దొడ్డిదారి రాజకీయాలకు తెరలేపింది
పోతిరెడ్డి నాగార్జున రెడ్డి, మాజీ ప్రభుత్వ సలహాదారు.
రాష్ట్రంలో జరుగుతున్న పాఠశాల విద్యా కమిటీ ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ ఘోరమైన అధికార దుర్వినియోగానికి పాల్పడుతోందని వైఎస్సార్‌సీపీ నేత, మాజీ ప్రభుత్వ సలహాదారు పోతిరెడ్డి నాగార్జున రెడ్డి తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు.శనివారం ఆయన మీడియాతో మాట్లాడుతూ,గ్రామాల్లో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీకే స్పష్టమైన మెజారిటీ ఉన్నప్పటికీ.ప్రజాస్వామ్య పద్ధతిలో ఎన్నికలు నిర్వహించకుండా కూటమి ప్రభుత్వం అడ్డుకుంటోందని ఆవేదన వ్యక్తం చేశారు. టిడిపికి ఆధిక్యం లేని చోట ఎన్నికలను కావాలనే వాయిదా వేయిస్తూ, అధికారులు మరియు పోలీసు యంత్రాంగాన్ని అడ్డం పెట్టుకుని ‘బలవంతపు రాజీ’ పేరుతో ఏకగ్రీవాలు చేసుకుంటున్నారని ఆయన మండిపడ్డారు.పోరుమామిళ్ల మండలం ముసలిరెడ్డిపల్లి పంచాయతీ పరిధిలోని సిద్ధన కిచ్చాయిపల్లి (కొత్తూరు) గ్రామంలో శనివారం విద్యా కమిటీ ఎన్నిక జరగాల్సి ఉంది.అక్కడ వైఎస్సార్‌సీపీ స్పష్టమైన మెజారిటీతో విజయం సాధించే అవకాశం ఉండటంతో, తెలుగుదేశం పార్టీ నాయకులు కుట్రలకు తెరలేపారు. ఉదయమే జిల్లా విద్యాశాఖాధికారి ఆదేశాల మేరకు ఎన్నికను వాయిదా వేస్తున్నట్లు మండల విద్యాశాఖాధికారి ప్రకటించడంపై నాగార్జున రెడ్డి తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు.గత సంవత్సరం కూడా ఇదే విధంగా కుంటిసాకులు చెప్తూ,వాయిదాల పర్వంతో అక్కడ విద్యా కమిటీ ఎన్నికలు జరగకుండా అడ్డుకున్నారని ఆయన గుర్తు చేశారు.
బద్వేలు నియోజకవర్గంలో శృతిమించుతున్న అక్రమాలు:
కేవలం పోరుమామిళ్ల మండలంలోనే కాకుండా, బద్వేలు నియోజకవర్గవ్యాప్తంగా అనేక ప్రాంతాల్లో ఇదే విధమైన అప్రజాస్వామిక వాతావరణం నెలకొందని నాగార్జున రెడ్డి విమర్శించారు. వైఎస్సార్‌సీపీ సానుభూతిపరులకు పూర్తి మెజారిటీ ఉన్న పాఠశాలల్లో ఎన్నికలు సక్రమంగా జరగనివ్వడం లేదన్నారు. ప్రభుత్వ అధికారులపై తీవ్ర ఒత్తిళ్లు తీసుకువచ్చి, పోలీసులతో బెదిరింపులకు గురిచేస్తూ.’రాజీ’ పేరుతో తెలుగుదేశం పార్టీ అభ్యర్థులను బలవంతంగా ఎన్నుకునేలా చేస్తున్నారని ఆరోపించారు. గ్రామీణ ప్రాంతాల్లో ప్రజలు వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ వైపే ఉన్నారని, అధికార పార్టీ వేధింపులను, అక్రమాలను ప్రజలు గమనిస్తున్నారని ఆయన హెచ్చరించారు. ఎన్నికల నిర్వహణలో నిష్పక్షపాతంగా వ్యవహరించాల్సిన అధికారులు పాలకుల ఒత్తిళ్లకు లొంగిపోవడం భావ్యం కాదని ఆయన హితవు పలికారు.