prajavaani.net
Newspaper Banner
Date of Publish : 05 October 2026, 9:25 am Digital Edition : NNARSINGARAO GATKESKAR

వలస కార్మికుల పిల్లలకు ‘ప్రేరణ’ ఆధ్వర్యంలో ఆటల పోటీలు

ఉప్పల్, అక్టోబర్ 4 (ప్రజావాణి): గాంధీ జయంతిని పురస్కరించుకుని ఉప్పల్ సాయిబాబా కాలనీలో వలస కార్మికుల పిల్లలకు ‘ప్రేరణ’ బాలల వేదిక ఆధ్వర్యంలో వివిధ ఆటల పోటీలు నిర్వహించారు. ప్రేరణ బాలల వేదిక అధ్యక్షుడు డాక్టర్ అక్కెనపల్లి లక్ష్మణాచారి ఆధ్వర్యంలో కబడ్డీ, పరుగు పందెం, స్కిప్పింగ్, మ్యూజికల్ చైర్, పాటల పోటీలు నిర్వహించారు.

ఈ సందర్భంగా లక్ష్మణాచారి మాట్లాడుతూ ఉప్పల్ ప్రాంతంలో బడికి వెళ్లని పిల్లలను గుర్తించి, వారిని పాఠశాలల్లో చేర్పించేందుకు ప్రోత్సహిస్తున్నామని తెలిపారు. బడి మానేసిన పిల్లలను తిరిగి విద్య వైపు మళ్లించడమే ‘ప్రేరణ’ ప్రధాన లక్ష్యమన్నారు. ఈ కార్యక్రమాలకు ప్రభుత్వ సహకారం అందించాలని కోరారు.

ఈ కార్యక్రమానికి హాజరైన స్థానిక నాయకుడు మేకల మధుసూదన్ రెడ్డి మాట్లాడుతూ ఉపాధ్యాయుడిగా సేవలందించి పదవీ విరమణ చేసిన అనంతరం కూడా సమాజంపై మక్కువతో వలస కార్మికుల పిల్లలకు విద్య అందించేందుకు కృషి చేస్తున్న డాక్టర్ లక్ష్మణాచారిని అభినందించారు.

అనంతరం వివిధ పోటీల్లో విజేతలకు బహుమతులు అందజేశారు. కార్యక్రమంలో ప్రేరణ ప్రతినిధులు, తల్లిదండ్రులు, స్థానికులు, బాలబాలికలు పాల్గొన్నారు.