*వరి సాగును తగ్గించి, ఆరుతడి పంటలను ప్రోత్సహించాలి*
* *మన ప్రజావాణి* *మందమర్రి*:-
యాసంగి సీజన్ లో అందుబాటులో ఉన్న నీటి వనరులకు అనుగుణంగా వరి సాగును తగ్గించి, ఆరుతడి పంటలను ప్రోత్సహించాలని మండల వ్యవసాయ అధికారి జి కిరణ్మయి రైతులకు సూచించారు. బుధవారం మండలంలోని అందుగులపేట గ్రామ పంచాయతీ కార్యాలయంలో వ్యవసాయ శాఖ ఆధ్వర్యంలో రైతులకు ఖేత్ బచావో అభియాన్ కార్యక్రమం నిర్వహించారు.ఈ సందర్భంగా మండల వ్యవసాయ అధికారి జి కిరణ్మయి మాట్లాడుతూ, యాసంగిలో సహజ ఎరువుల వినియోగాన్ని ప్రోత్సహించాలన్నారు. నేల ఆరోగ్యాన్ని మెరుగుపరచాలని, నీరు, ఇతర వనరులను పరిరక్షించాలని, సుస్థిర పోషక యాజమాన్యాన్ని వేగవంతం చేయాలని, సహజ వ్యవసాయాన్ని అవలంబించాలని రైతులను కోరారు. నూనె గింజలు, పప్పుధాన్యాలు, ఉద్యాన పంటల ద్వారా పంటల వైవిధ్యీకరణను ప్రోత్సహించాలని సూచించారు. వరి కోత అనంతరం ఖాళీగా ఉండే భూముల సమర్థ వినియోగం, పంట అవశేషాల సుస్థిర నిర్వహణ, పంట వ్యర్థాల దహనాన్ని నిరుత్సాహపరచాలని కోరారు. ఈ కార్యక్రమంలో వ్యవసాయ విస్తరణ అధికారి ఎస్ కనకరాజు, గ్రామ సర్పంచ్ ముత్యం రమ, గ్రామ పంచాయితీ కార్యదర్శి వీరేందర్, రైతులు పాల్గొన్నారు.