prajavaani.net
Newspaper Banner
Date of Publish : 26 October 2026, 1:20 pm Digital Edition : PRAJA VANI

రైతులు నీటి లభ్యతను బట్టి ఆరుతడి పంటల సాగుపై మొగ్గు చూపాలి

రైతులు నీటి లభ్యతను బట్టి ఆరుతడి పంటల సాగుపై మొగ్గు చూపాలి

బెజ్జంకి మండల వ్యవసాయ అధికారి సంతోష్ సూచన

బెజ్జంకి, అక్టోబర్ 26 (ప్రజావాణి):

సిద్దిపేట జిల్లా బెజ్జంకి మండల రైతులు యాసంగి పంటల సాగులో నీటి లభ్యతను దృష్టిలో ఉంచుకుని ఆరుతడి పంటల సాగుపై మొగ్గు చూపాలని మండల వ్యవసాయ అధికారి సంతోష్ సూచించారు. రానున్న వేసవిలో ఎల్‌నినో ప్రభావం, ఉష్ణోగ్రతల పెరుగుదలతో నీటి ఎద్దడి ఏర్పడే అవకాశం ఉన్నందున నీటి వినియోగం అధికంగా ఉండే వరి, మొక్కజొన్న పంటల సాగుపై రైతులు పునరాలోచించాలని కోరారు.ఉష్ణోగ్రతలు పెరగడం వల్ల భూగర్భ జలాల మట్టాలు తగ్గి బోర్లలో నీటి లభ్యత తగ్గే ప్రమాదం ఉందని తెలిపారు. ప్రాజెక్టుల్లో నీటి నిల్వలు తగ్గితే సాగునీటి సరఫరాకు ఇబ్బందులు ఎదురయ్యే అవకాశం ఉందన్నారు. జలాశయాల్లో నీరు తగ్గడం వల్ల జలవిద్యుత్ ఉత్పత్తిపైనా ప్రభావం పడే అవకాశం ఉండటంతో బోర్ల ద్వారా పంటలకు నీరు అందించడం కష్టమవుతుందని వివరించారు.ఈ పరిస్థితులను దృష్టిలో ఉంచుకుని రైతులు తమ వద్ద అందుబాటులో ఉన్న నీటి వనరులను అంచనా వేసుకుని పంటలను ఎంపిక చేసుకోవాలని ఏవో సంతోష్ సూచించారు. వ్యవసాయ శాఖ అధికారుల సలహాలు తీసుకుంటూ నీటి వినియోగం తక్కువగా ఉండే ఆరుతడి పంటల సాగుకు ప్రాధాన్యం ఇవ్వాలని కోరారు. ముందస్తు జాగ్రత్తలు పాటిస్తూ నీటి వనరులను పొదుపుగా వినియోగించుకోవాలని, తద్వారా యాసంగి సాగులో ఎదురయ్యే నష్టాలను తగ్గించుకోవాలని రైతులకు సూచించారు.