prajavaani.net
Newspaper Banner
Date of Publish : 03 October 2026, 3:15 pm Digital Edition : MAHESH MEDCHAL

రైతాంగ సమస్యల పరిష్కారమే లక్ష్యం కొండం ఆంజనేయులు ముదిరాజ్

రైతాంగ సమస్యల పరిష్కారమే లక్ష్యo

తెలంగాణ బీజేపీ కిసాన్ మోర్చా కార్యవర్గ సభ్యుడు కొండం ఆంజనేయులు ముదిరాజ్

మేడ్చల్: తెలంగాణ రాష్ట్ర బీజేపీ కిసాన్ మోర్చా కార్యవర్గ సభ్యుడిగా కొండం ఆంజనేయులు ముదిరాజ్ నియమితులయ్యారు. రాష్ట్ర కిసాన్ మోర్చా అధ్యక్షుడు బస్వాపురం లక్ష్మీ నర్సయ్య జారీ చేసిన నియామక పత్రాన్ని బీజేపీ రాష్ట్ర మాజీ ఉపాధ్యక్షుడు కొంపల్లి మోహన్ రెడ్డి శనివారం ఆయనకు అందజేశారు.

గ్రామస్థాయి కార్యకర్తగా రాజకీయ ప్రస్థానాన్ని ప్రారంభించిన ఆంజనేయులు ముదిరాజ్ అంచెలంచెలుగా ఎదుగుతూ రాష్ట్ర స్థాయి బాధ్యతలు చేపట్టడం పార్టీ శ్రేణుల్లో చర్చనీయాంశంగా మారింది. గ్రామ శాఖ అధ్యక్షుడిగా ప్రారంభమైన ఆయన ప్రస్థానం యువ మోర్చా మండల కార్యదర్శి, జిల్లా కార్యదర్శి బాధ్యతల వరకు సాగింది. 2020 నుంచి 2024 వరకు మేడ్చల్ మున్సిపాలిటీ బీజేపీ అధ్యక్షుడిగా పనిచేశారు.

ఈ కాలంలో పార్టీ బలోపేతంతో పాటు ప్రజా సమస్యల పరిష్కారం కోసం పలు కార్యక్రమాలు, పోరాటాల్లో ఆయన చురుకుగా పాల్గొన్నారు. అసెంబ్లీ, పార్లమెంట్ ఎన్నికల సమయంలో పార్టీ శ్రేణులను సమన్వయం చేస్తూ క్షేత్రస్థాయిలో విస్తృతంగా పనిచేశారు. గిర్మాపూర్ ప్రాంతంలో రైతు సహకార సంఘం డైరెక్టర్ల ఎన్నికలు, గ్రామ పంచాయతీ ఎన్నికల్లో పార్టీ అభ్యర్థుల విజయానికి కృషి చేశారు. వార్డు సభ్యులు, ఉప సర్పంచ్, కౌన్సిలర్ ఎన్నికల్లో పార్టీ తరఫున ప్రచారం, సమన్వయ బాధ్యతలు నిర్వహించారు.

ఈ సందర్భంగా కొండం ఆంజనేయులు ముదిరాజ్ మాట్లాడుతూ, తనకు అప్పగించిన బాధ్యతను పదవిగా కాకుండా రైతాంగానికి సేవ చేసే అవకాశంగా భావిస్తున్నానన్నారు. రాష్ట్రవ్యాప్తంగా రైతులు ఎదుర్కొంటున్న సమస్యలను క్షేత్రస్థాయిలో గుర్తించి, వాటి పరిష్కారం కోసం పార్టీ వేదికగా నిరంతరం కృషి చేస్తానని తెలిపారు.

రైతులకు కేంద్ర ప్రభుత్వ పథకాలు, వ్యవసాయ రంగ సంక్షేమ కార్యక్రమాలను మరింత చేరువ చేయడంతో పాటు రైతుల హక్కులు, ప్రయోజనాల పరిరక్షణకు కృషి చేస్తానన్నారు. రైతుల సమస్యలపై నిరంతరం అందుబాటులో ఉంటూ, రైతాంగాన్ని సంఘటితం చేసి బీజేపీ కిసాన్ మోర్చాను మరింత బలోపేతం చేసేందుకు పనిచేస్తానని పేర్కొన్నారు.

తనపై నమ్మకంతో రాష్ట్ర కిసాన్ మోర్చా కార్యవర్గ సభ్యుడిగా బాధ్యతలు అప్పగించిన బస్వాపురం లక్ష్మీ నర్సయ్యకు, తన రాజకీయ ప్రస్థానంలో ప్రోత్సాహం అందించిన కొంపల్లి మోహన్ రెడ్డికి ఆయన ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు. గ్రామస్థాయి కార్యకర్తగా ప్రారంభమైన తన ప్రయాణానికి రాష్ట్ర స్థాయి బాధ్యత లభించడం కార్యకర్తల కష్టానికి దక్కిన గౌరవంగా భావిస్తున్నానని ఆంజనేయులు ముదిరాజ్ అన్నారు.