prajavaani.net
Newspaper Banner
Date of Publish : 13 October 2026, 9:46 pm Digital Edition : PRAJA VANI

రాయికల్ మండలంలో ప్రతి గ్రామంలో యథేచ్ఛగా బెల్ట్ షాపులు – చోద్యం చూస్తున్న ఆబ్కారీ శాఖ

*రాయికల్ మండలంలో ప్రతి గ్రామంలో యథేచ్ఛగా బెల్ట్ షాపులు – చోద్యం చూస్తున్న ఆబ్కారీ శాఖ?*

*రాయికల్, అక్టోబర్ 13 (ప్రజావాణి):*

రాయికల్ మండలంలో బెల్ట్ షాపుల దందా హద్దు దాటింది. మండలంలోని ఏ గ్రామానికి వెళ్లినా కిరాణా దుకాణాలు, టీ స్టాళ్లలో సైతం విచ్చలవిడిగా మద్యం ఏరులై పారుతోంది. అక్రమ మద్యాన్ని అరికట్టాల్సిన ఆబ్కారీ శాఖ అధికారులు మాత్రం చూసీచూడనట్లు వ్యవహరిస్తుండటంపై ప్రజల్లో తీవ్ర ఆగ్రహం వ్యక్తమవుతోంది.మండలంలోని అన్ని గ్రామాల్లో అధికారిక అనుమతి లేకుండా బెల్ట్ షాపులు యథేచ్ఛగా కొనసాగుతున్నాయి. ఉదయం నుంచి అర్ధరాత్రి వరకు ఎంఆర్పీ ధర కంటే రూ.20 నుంచి రూ.50 అదనంగా వసూలు చేస్తూ మద్యం విక్రయిస్తున్నారు. కిరాణా దుకాణాల్లో బియ్యం, పప్పులతో పాటు బీర్లు, మద్యం బాటిళ్లు బహిరంగంగా అమ్ముతుండటం సర్వసాధారణమైంది. దీంతో గ్రామాల్లో మహిళలు, విద్యార్థులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. గ్రామ కూడళ్లలోనే మద్యం తాగి రోడ్లపై పడిపోవడం, గొడవలకు దిగడం నిత్యకృత్యంగా మారింది.ఆబ్కారీ శాఖ అధికారులు మండలానికి చుట్టం చూపుగా వచ్చి వెళ్తున్నారే తప్ప పకడ్బందీగా తనిఖీలు చేయడం లేదనే ఆరోపణలు బలంగా వినిపిస్తున్నాయి. ఎప్పుడైనా దాడులు చేసినా నామమాత్రంగా ఒకటి, రెండు కేసులు నమోదు చేసి చేతులు దులుపుకుంటున్నారని, అసలు బెల్ట్ షాపుల వెనుక ఉన్న సిండికేట్ పై దృష్టి పెట్టడం లేదని గ్రామస్తులు మండిపడుతున్నారు. నెలవారీ మామూళ్ల మత్తులోనే అధికారులు అక్రమాలను పట్టించుకోవడం లేదని ప్రజలు బహిరంగంగానే చర్చించుకుంటున్నారు.నిబంధనల ప్రకారం గ్రామాల్లో మద్యం విక్రయించకూడదు. లైసెన్స్ ఉన్న వైన్స్ ల నుంచే గ్రామాల్లోని బెల్ట్ షాపులకు మద్యం తరలిపోతుండటం వెనుక భారీ మామూళ్ల వ్యవహారం నడుస్తోందని ప్రజలు ఆరోపిస్తున్నారు. ఈ అక్రమ దందా వల్ల ప్రభుత్వ ఖజానాకు గండి పడటంతో పాటు గ్రామాల్లో శాంతిభద్రతలకు తీవ్ర విఘాతం కలుగుతోంది. యువత మద్యానికి బానిసలుగా మారుతున్నారు.ముందు విజయదశమి, బతుకమ్మ పండుగల నేపథ్యంలో గ్రామాల్లో పిచ్చలవిడిగా ఉన్న బెల్ట్ షాపులతో యువత, మద్యం ప్రియులు మరింత రెచ్చిపోయే ప్రమాదం ఉందని ప్రజలు భయాందోళన చెందుతున్నారు. ఇప్పటికైనా జిల్లా ఉన్నతాధికారులు స్పందించి ప్రతి గ్రామంలో ఆకస్మిక తనిఖీలు నిర్వహించి బెల్ట్ షాపులను పూర్తిగా అరికట్టాలని, అక్రమ మద్యం సరఫరా చేస్తున్న వైన్స్ లపై కఠిన చర్యలు తీసుకొని ప్రజల ఆరోగ్యానికి బాటలు వేయాలని ప్రజలు డిమాండ్ చేస్తున్నారు.