prajavaani.net
Newspaper Banner
Date of Publish : 09 October 2026, 4:02 pm Digital Edition : PRAJA VANI

రాంసాగర్ గ్రామంలో విద్యుత్ సమస్య పరిష్కారానికి చర్యలు

రాంసాగర్ గ్రామంలో విద్యుత్ సమస్య పరిష్కారానికి చర్యలు..

సర్పంచ్ రాజ్యలక్ష్మి మల్లారెడ్డి చొరవ*

జనగామ జిల్లా ప్రతినిధి జె.ఉపేందర్, అక్టోబర్ 9 (ప్రజావాణి): జనగామ నియోజకవర్గం, కొమురవెల్లి మండలం, రాంసాగర్ గ్రామంలో తరచూ ఏర్పడుతున్న విద్యుత్ సమస్య పరిష్కారానికి గ్రామ సర్పంచ్ అక్కెనపల్లి రాజ్యలక్ష్మి మల్లారెడ్డి ప్రత్యేక చొరవ తీసుకున్నారు.

గ్రామంలో గతంలో 16 కేవీ సామర్థ్యం గల మూడు ట్రాన్స్‌ఫార్మర్లు ఉండగా, విద్యుత్ లోడ్ పెరగడంతో తరచూ ట్రిప్పింగ్ సమస్యలు ఎదురవుతున్నాయి. ఈ విషయాన్ని గుర్తించిన సర్పంచ్ రాజ్యలక్ష్మి మల్లారెడ్డి, పాలకవర్గ సభ్యులతో కలిసి కొమురవెల్లి మండల విద్యుత్ శాఖ ఏఈ మధు ని కలిసి ట్రాన్స్‌ఫార్మర్ల సామర్థ్యాన్ని పెంచాలని విజ్ఞప్తి చేశారు. ఇందుకు సంబంధించి డీడీ చెల్లించాలని అధికారులు సూచించగా, గ్రామ పంచాయతీ తరఫున సర్పంచ్ రూ. 8,400 డీడీ చెల్లించారు.

దీంతో స్పందించిన విద్యుత్ శాఖ అధికారులు ఇప్పటివరకు రెండు 25 కేవీ ట్రాన్స్‌ఫార్మర్లతో పాటు 14 విద్యుత్ స్తంభాలను మంజూరు చేసి ఏర్పాటు ప్రక్రియ చేపట్టారు. మిగిలిన మరో ట్రాన్స్‌ఫార్మర్‌ను కూడా మరికొద్ది రోజుల్లో ఏర్పాటు చేస్తామని అధికారులు హామీ ఇచ్చారు.

అలాగే బతుకమ్మ పండుగ సందర్భంగా చెరువు సమీపంలో రెండు విద్యుత్ స్తంభాలను ఏర్పాటు చేయించడంతో పాటు, సరిగా లేని విద్యుత్ వైర్లకు మరమ్మతులు చేయించేందుకు సర్పంచ్ ప్రత్యేక చొరవ తీసుకున్నారు.

గ్రామంలో విద్యుత్ సమస్యల పరిష్కారానికి సహకరిస్తున్న విద్యుత్ శాఖ ఏఈ మధు కి, త్వరితగతిన పనులు పూర్తి చేసిన ఆర్టిజన్ (లైన్మెన్) శ్రీధర్‌కు గ్రామస్తులు కృతజ్ఞతలు తెలిపారు. గ్రామ ప్రజలకు మెరుగైన విద్యుత్ సరఫరా అందించేందుకు కృషి చేస్తున్న సర్పంచ్ అక్కెనపల్లి రాజ్యలక్ష్మి మల్లారెడ్డి, గ్రామపంచాయతీ పాలకవర్గానికి గ్రామస్తులు అభినందనలు తెలియజేశారు.