prajavaani.net
Newspaper Banner
Date of Publish : 30 October 2026, 7:29 pm Digital Edition : PRAJA VANI

యాసంగిలో వరి, మొక్కజొన్న సాగు వద్దు

యాసంగిలో వరి, మొక్కజొన్న సాగు వద్దు
తక్కువ నీటితో పండే ప్రత్యామ్నాయ పంటల వైపు రైతులు మొగ్గు చూపాలి
ఎల్‌నినో ప్రభావంతో భూగర్భ జలమట్టం తగ్గే అవకాశం
కూసుమంచి, అక్టోబర్ 30: యాసంగి సీజన్‌లో రైతులు వరి, మొక్కజొన్న వంటి అధిక నీటి అవసరమయ్యే పంటలను సాగు చేయవద్దని క్లస్టర్ ఏఈఓ జానీ సూచించారు. శుక్రవారం కూసుమంచి గ్రామపంచాయతీ కార్యాలయంలో నిర్వహించిన రైతుల అవగాహన సమావేశంలో ఆయన మాట్లాడారు. అనంతరం రైతులకు పంటల మార్పిడిపై అవగాహన కల్పిస్తూ ర్యాలీ నిర్వహించారు.
ఈ సందర్భంగా ఏఈఓ జానీ మాట్లాడుతూ ఎల్‌నినో ప్రభావం దృష్ట్యా భూగర్భ జలమట్టం తగ్గే అవకాశం ఉందని, నీటి లభ్యతను దృష్టిలో పెట్టుకొని రైతులు పంటల ఎంపిక చేసుకోవాలని సూచించారు. యాసంగిలో వరి, మొక్కజొన్న సాగుకు బదులుగా తక్కువ నీటితో పండే పెసర, మినుము, వేరుశనగ, జొన్న వంటి స్వల్పకాలిక పంటలను సాగు చేయాలని కోరారు.
అనంతరం ఇరిగేషన్ శాఖ అధికారులు యాసంగి సీజన్‌లో నీటి లభ్యత, నీటి కొరత పరిస్థితులు, రైతులకు అందించగల నీటి వివరాలు, సాగులో తీసుకోవాల్సిన జాగ్రత్తలపై అవగాహన కల్పించారు. నీటి వనరులను పొదుపుగా వినియోగించుకుంటూ ప్రత్యామ్నాయ పంటల సాగుకు రైతులు ప్రాధాన్యత ఇవ్వాలని సూచించారు.
ఈ కార్యక్రమంలో గ్రామ సర్పంచ్ కృష్ణవేణి, ఉపసర్పంచ్ చెన్ను వెంకటరమణ, పంచాయతీ కార్యదర్శి, విద్యుత్ శాఖ సిబ్బంది, జీపీఓ వసంతరావు, గ్రామ రైతులు తదితరులు పాల్గొన్నారు.