prajavaani.net
Newspaper Banner
Date of Publish : 16 October 2026, 7:25 pm Digital Edition : PRAJA VANI

యాసంగిలో ఆరుతడి పంటలే మేలు

యాసంగిలో ఆరుతడి పంటలే మేలు
ముదిగొండ మండల వ్యవసాయ అధికారి వి. నాగేశ్వరరావు

ముదిగొండ అక్టోబర్16 ప్రజావాణి
ప్రస్తుతం ‘ఎల్ నినో’ ప్రభావంతో వర్షాలు సరిగా పడటం లేదని, కాబట్టి రాబోయే యాసంగి సీజన్‌లో రైతులు వరి, మొక్కజొన్న లాంటి ఎక్కువ నీళ్లు అవసరమయ్యే పంటలు వేయవద్దని ముదిగొండ మండల వ్యవసాయ అధికారి (ఏవో) వి. నాగేశ్వరరావు విజ్ఞప్తి చేశారు. వర్షాలు లేకపోవడం వల్ల భూగర్భ జలాలు తగ్గి, విద్యుత్ సరఫరాలో కూడా ఇబ్బందులు వచ్చే అవకాశం ఉందన్నారు. కాబట్టి బోరు బావులు ఉన్న రైతులు కూడా ఆరుతడి పంటలు, పెసర, కుసుమ లాంటి అపరాలు మాత్రమే సాగు చేయాలని సూచించారు.రైతులకు ఈ విషయాలపై పూర్తి అవగాహన కల్పించేందుకు శుక్రవారం మండలంలోని ఎడవల్లి, మేడేపల్లి, న్యూ లక్ష్మీపురం, ముత్తారం, ఖానాపురం గ్రామాలలో రైతులకు అవగాహన సదస్సులు నిర్వహించారు.ఈ సందర్భంగా ఏవో నాగేశ్వరరావు మాట్లాడుతూ… ప్రస్తుతం వర్షాలు లేక పంటలు ఎండిపోయే పరిస్థితి ఉందన్నారు. దీనిని దృష్టిలో ఉంచుకుని రైతులు ఆరుతడి పంటల వైపు మొగ్గు చూపాలని కోరారు. ప్రస్తుతం మన మండలంలో పెసర, కుసుమ విత్తనాలు రైతులకు అందుబాటులో ఉన్నాయని, ఆసక్తి ఉన్న రైతులు వెంటనే విత్తనాలను తీసుకెళ్లాలని సూచించారు.ఈ అవగాహన కార్యక్రమాల్లో మండల వ్యవసాయ అధికారి వి. నాగేశ్వరరావుతో పాటు ఏఈఓలు , సంబంధిత గ్రామాల సర్పంచులు మరియు పెద్ద సంఖ్యలో రైతులు పాల్గొన్నారు.