prajavaani.net
Newspaper Banner
Date of Publish : 03 October 2026, 8:43 pm Digital Edition : RUPAVATHRAMESH HUZURNAGARR

మోటార్ సైకిళ్ల దొంగతనాలకు పాల్పడుతున్న ముగ్గురు నిందితుల అరెస్ట్.

మోటార్ సైకిళ్ల దొంగతనాలకు పాల్పడుతున్న ముగ్గురు నిందితుల అరెస్ట్.

రూ.3 లక్షల విలువైన 9 మోటార్ సైకిళ్లు స్వాధీనం.

 

హుజూర్నగర్ అక్టోబర్ 3 (ప్రజావాణి)

 

సూర్యాపేట జిల్లా హుజూర్నగర్ నియోజకవర్గం గరిడేపల్లి పోలీస్ స్టేషన్ పరిధిలో మోటార్ సైకిళ్ల దొంగతనాలకు పాల్పడుతున్న ముగ్గురు నిందితులను పోలీసులు అరెస్ట్ చేసి, వారి వద్ద నుంచి సుమారు రూ.3 లక్షల విలువైన 9 మోటార్ సైకిళ్లను స్వాధీనం చేసుకున్నారు.

ఈ కేసుకు సంబంధించిన వివరాలను హుజూర్‌నగర్ సర్కిల్ ఇన్‌స్పెక్టర్ చరమందరాజు గరిడేపల్లి పోలీస్ స్టేషన్‌లో నిర్వహించిన విలేకరుల సమావేశంలో వెల్లడించారు. ఈ సమావేశంలో గరిడేపల్లి ఎస్సై బి. శ్రీకాంత్ గౌడ్, పోలీస్ సిబ్బంది పాల్గొన్నారు.

 

కేసు వివరాలు :

 

తేదీ 29-09-2026 రాత్రి కలకోవా గ్రామానికి చెందిన మండవ శివశంకర్ తన టీఎస్05 ఈఏ1171 నంబర్ గల హెచ్ఎఫ్ డీలక్స్ మోటార్ సైకిల్‌పై కీతవారిగూడెం గ్రామంలోని తన మామ ఇంటికి వచ్చి, రాత్రి సమయంలో ఇంటి ముందు బైక్‌ను నిలిపి నిద్రించాడు. ఉదయం చూడగా గుర్తుతెలియని వ్యక్తులు బైక్‌ను దొంగిలించినట్లు గుర్తించి గరిడేపల్లి పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేశాడు. ఫిర్యాదు మేరకు గరిడేపల్లి పోలీసులు సి ఆర్. నంబర్.188/2026, యు/ఎస్ 305(బి) బి.ఎన్.ఎస్ కింద కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. దర్యాప్తులో భాగంగా 03-10-2026 ఉదయం సుమారు 9:00 గంటలకు గరిడేపల్లి మండలంలోని కల్మల్చెరువు ఎక్స్ రోడ్ వద్ద ఎస్సై బి. శ్రీకాంత్ గౌడ్ మరియు సిబ్బంది వాహన తనిఖీలు నిర్వహిస్తుండగా, ఇద్దరు యువకులు ఒక మోటార్ సైకిల్‌పై మిర్యాలగూడ వైపు వెళ్తూ పోలీసులను చూసి తప్పించుకునేందుకు ప్రయత్నించారు. పోలీసులు వారిని అదుపులోకి తీసుకుని విచారించగా మోటార్ సైకిల్ దొంగతనాలకు సంబంధించిన కీలక విషయాలు వెలుగులోకి వచ్చాయి.

 

*అరెస్టయిన నిందితులు.*

 

ఏ-1. తోకల మధు, వయస్సు: 22 సంవత్సరాలు, వృత్తి: కార్ మెకానిక్, నివాసం: గరిడేపల్లి గ్రామం, మండలం.

ఏ-2. కేమ ముగేష్ కుమార్, వయస్సు: 26 సంవత్సరాలు, వృత్తి: కూలీ, స్వస్థలం: గణేశపురం కాలనీ, మడతకులం గ్రామం & మండలం, తిరుప్పూర్ జిల్లా, తమిళనాడు. ప్రస్తుతం గరిడేపల్లిలో నివాసం.

ఏ-3. షేక్ జానీపాషా, వయస్సు: 23 సంవత్సరాలు, వృత్తి: బైక్ మెకానిక్, నివాసం: పొనుగోడు గ్రామం, గరిడేపల్లి మండలం.

 

*దొంగతనాల విధానం.*

 

పోలీసుల విచారణలో నిందితులు గతంలో కూడా మోటార్ సైకిళ్ల దొంగతనాలకు పాల్పడినట్లు వెల్లడైంది. 2024లో మధు, ముగేష్ కుమార్ కలిసి కోదాడ పట్టణంలో ఒక సిబిజెడ్ మోటార్ సైకిల్‌ను దొంగిలించి వినియోగించినట్లు తెలిపారు. అనంతరం ఈ ఏడాది జూన్ నెల నుంచి మధు, ముగేష్ కుమార్, ఒక మైనర్ బాలుడు కలిసి సూర్యాపేట, మిర్యాలగూడ, దామరచర్ల, రామన్నపేట, నార్కట్‌పల్లి, కీతవారిగూడెం తదితర ప్రాంతాల్లో మోటార్ సైకిళ్లను దొంగిలించినట్లు పోలీసుల విచారణలో వెల్లడైంది. దొంగిలించిన బైక్‌లలో 6 మోటార్ సైకిళ్లను జానీపాషాకు అప్పగించి, వాటిని మరమ్మతులు చేసి విక్రయించేందుకు ప్రయత్నించినట్లు పోలీసులు తెలిపారు. మరిన్ని మోటార్ సైకిళ్లు దొంగిలించి తీసుకురావాలని జానీపాషా నిందితులకు రూ.5,000 అడ్వాన్స్‌గా ఇచ్చినట్లు విచారణలో వెల్లడైంది. దొంగిలించిన మోటార్ సైకిళ్లను విక్రయించి, వచ్చిన డబ్బును అందరూ కలిసి పంచుకోవాలని నిందితులు పథకం వేసుకున్నట్లు పోలీసులు తెలిపారు.

 

*నిందితుల పట్టివేత..*

 

03-10-2026 ఉదయం మధు, ముగేష్ కుమార్ ఇద్దరూ కీతవారిగూడెం గ్రామంలో దొంగిలించిన ఒక మోటార్ సైకిల్‌ను పొనుగోడు గ్రామంలో విక్రయించేందుకు ప్రయత్నించారు. అయితే కొనుగోలుదారులు ఎవరూ ముందుకు రాకపోవడంతో ఆ బైక్‌ను మధు కార్ షెడ్‌లో దాచేందుకు తీసుకెళ్తుండగా కల్మల్ చెరువు ఎక్స్ రోడ్ వద్ద పోలీసుల వాహన తనిఖీల్లో పట్టుబడ్డారు. వారి విచారణ ఆధారంగా ఇతర దొంగతనాలకు సంబంధించిన వివరాలను పోలీసులు సేకరించి, జానీపాషాను కూడా అదుపులోకి తీసుకున్నారు. కేసులో మరింత దర్యాప్తు కొనసాగుతున్నది. దొంగతనాలకు సంబంధించిన ఇతర వివరాలు, వాహనాల యజమానులను గుర్తించే ప్రక్రియ కొనసాగుతున్నట్లు పోలీసులు తెలిపారు.

 

ప్రజలు తమ వాహనాలను సురక్షితంగా పార్క్ చేసుకోవాలని, వాహనాలకు తప్పనిసరిగా లాక్ వేసుకోవడంతో పాటు వీలైనంత వరకు సీసీ కెమెరాల పరిధిలో నిలిపి ఉంచాలని పోలీసులు సూచించారు. పోలీసుల అప్రమత్తతతో మోటార్ సైకిల్ దొంగతనాల కేసులో నిందితులను త్వరితగతిన గుర్తించి అరెస్ట్ చేయడంలో సహకరించిన గరిడేపల్లి పోలీస్ సిబ్బందిని అధికారులు అభినందించారు.