prajavaani.net
Newspaper Banner
Date of Publish : 29 October 2026, 4:58 pm Digital Edition : PRAJA VANI

ముదిగొండ మట్టికి గర్వకారణం

*ముదిగొండ మట్టికి గర్వకారణం*

*మహిళా రైతు కొమ్మూరి స్వాతికి కిసాన్ మహారాజ్ పురస్కారం*

*హైదరాబాద్‌లో ప్రఖ్యాత రైతు శాస్త్రవేత్త, పద్మశ్రీ, డాక్టర్ చింతల వెంకటరెడ్డి చేతుల మీదుగా పురస్కారం అందుకున్న స్వాతి*

*మన ప్రజావాణి మధిర ఆర్ సి అక్టోబర్ 29*

ఖమ్మం జిల్లా ముదిగొండకు చెందిన మహిళా రైతు కొమ్మూరి స్వాతి వ్యవసాయ రంగంలో అందిస్తున్న విశేష సేవలకు గుర్తింపు లభించింది. గురువారం హైదరాబాద్ మాదాపూర్‌లోని హైటెక్స్ సిటీ శిల్పకళా వేదికలో వైస్ టీవీ & మై విలేజ్ఆధ్వర్యంలో జరిగిన కార్యక్రమంలో తన భర్త కొమ్మూరి రమేష్‌తో కలిసి ప్రతిష్ఠాత్మక కిషన్ మహారాజ్ పురస్కారం అందుకుంది. ప్రముఖ అంతర్జాతీయ స్వతంత్ర వ్యవసాయ శాస్త్రవేత్త, పద్మశ్రీ పురస్కార గ్రహీత డాక్టర్ చింతల వెంకటరెడ్డి చేతుల మీదుగా కిసాన్ మహారాజ్ అవార్డుతోపాటు 5 వేల రూపాయల నగదు పురస్కారం అందజేశారు. ఈ కార్యక్రమానికి బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు రామచంద్రరావు, బీఆర్‌ఎస్ నేత, మాజీ మంత్రులు తన్నీరు హరీశ్‌రావు, సింగిరెడ్డి నిరంజన్‌రెడ్డి, ఎమ్మెల్యే రాకేష్‌రెడ్డి, ఎమ్మెల్సీ అంజిరెడ్డి, మాజీ ఎంపీలు విజయసాయి రెడ్డి, రంజిత్‌రెడ్డి, ప్రఖ్యాత రైతు శాస్త్రవేత్త చింతల వెంకటరెడ్డి, తెలంగాణ కమ్మ సంక్షేమ కార్పొరేషన్ ఛైర్మన్ బండి రమేష్ తదితరులు హాజరయ్యారు. ముఖ్యంగా సహజ వ్యవసాయంలో తనదైన ముద్ర వేస్తూ నేలతల్లిని కాపాడుతూ ప్రకృతితో మమేకమై సేద్యం సాగిస్తున్న స్వాతి ప్రస్థానం ఎందరో మహిళా రైతులకు స్ఫూర్తిదాయకం. రైతు చెమట చుక్కే ప్రపంచానికి అన్నం పెట్టే అమృతధార. రైతు పండించే ప్రతి గింజలో శ్రమ ఉంది… త్యాగం ఉంది… కోట్లాది ప్రజల ఆకలి తీర్చే మహోన్నత సేవ ఉంది. అందుకే ప్రపంచానికి ఆహారమందించే రైతులే నిజమైన మహారాజులు. ముదిగొండ కీర్తిని మరింత ఇనుమడింపజేస్తూ మహిళా రైతుల ఆత్మగౌరవానికి ప్రతీకగా నిలుస్తున్న కొమ్మూరి స్వాతికి ఈ పురస్కారం మరిన్ని విజయాలకు నాంది కావాలని మనస్ఫూర్తిగా ఆకాంక్షిస్తున్నాం. భాగ్యనగరం వేదికగా కిషన్ మహారాజా ఉత్తమ రైతు మహిళా పురస్కారం అందుకోవడం చాలా సంతోషంగా ఉందని స్వాతి సంతోషం వ్యక్తం చేశారు. భవిష్యత్తులో కూడా తన వంతు వ్యవసాయ రంగంలో యువతకు శిక్షణ, తర్ఫీదు వంటి అంశాల్లో కృషి చేస్తానని ఆమె భరోసా ఇచ్చారు.