prajavaani.net
Newspaper Banner
Date of Publish : 13 October 2026, 9:50 pm Digital Edition : PRAJA VANI

మానసిక వైకల్యం కలిగిన మహిళపై అత్యాచారం కేసులో నిందితుడికి పదేళ్ల కఠిన కారాగార శిక్ష

మానసిక వైకల్యం కలిగిన మహిళపై అత్యాచారం కేసులో నిందితుడికి పదేళ్ల కఠిన కారాగార శిక్ష

నేరం రుజువు.. రూ.3 వేల జరిమానా విధించిన భూపాలపల్లి న్యాయస్థానం

భూపాలపల్లి అక్టోబర్ 13 మన ప్రజావాణి: మానసిక వైకల్యం కలిగిన మహిళపై అత్యాచారానికి పాల్పడిన కేసులో నేరం రుజువు కావడంతో నిందితుడికి పదేళ్ల కఠిన కారాగార శిక్షతో పాటు రూ.3,000 జరిమానా విధిస్తూ భూపాలపల్లి ప్రధాన న్యాయమూర్తి జె. జీవన్ కుమార్ తీర్పు వెలువరించారు.

కేసు నేపథ్యం

2021 నవంబర్ 28న టేకుమట్ల మండలం మండలవారిపేట గ్రామానికి చెందిన 40 ఏళ్ల మహిళ ఇంట్లో ఒంటరిగా ఉన్న సమయంలో, అదే గ్రామానికి చెందిన బండి శంకర్ (55) ఇంట్లోకి అక్రమంగా ప్రవేశించి ఆమెపై అత్యాచారానికి పాల్పడ్డాడు. అదే సమయంలో బాధితురాలి తల్లి అక్కడికి రావడంతో నిందితుడు అక్కడి నుంచి పారిపోయాడు.

పకడ్బందీగా దర్యాప్తు

బాధితురాలి తల్లి ఫిర్యాదు మేరకు అప్పటి టేకుమట్ల ఎస్‌హెచ్‌ఓ ఎస్‌ఐ కె. రమణారెడ్డి కేసు నమోదు చేశారు. అప్పటి చిట్యాల సర్కిల్ ఇన్‌స్పెక్టర్ పి. వెంకట్ దర్యాప్తు చేపట్టి నిందితుడిని అరెస్టు చేసి రిమాండ్‌కు తరలించారు. అనంతరం కేసుకు సంబంధించిన సాక్ష్యాధారాలను సేకరించి న్యాయస్థానంలో చార్జ్‌షీట్ దాఖలు చేశారు.

సమర్థవంతమైన న్యాయవాదనలు

ఈ కేసులో పబ్లిక్ ప్రాసిక్యూటర్ ఎదులాపురం శ్రీనివాస్ న్యాయస్థానంలో వాదనలు వినిపించారు. కోర్టు మానిటరింగ్ ఆఫీసర్ పీసీఆర్ ఇన్‌స్పెక్టర్ బి. రాజు పర్యవేక్షణలో కోర్టు లైజనింగ్ ఆఫీసర్ ఏఎస్ఐ జి. వెంకన్న, కోర్టు కానిస్టేబుళ్లు సీహెచ్. జ్యోతి, పి. శ్వేత విచారణ ప్రక్రియలో సహకరించారు. భరోసా లీగల్ సపోర్ట్ ఆఫీసర్ జి. రజిత బాధితురాలికి అవసరమైన న్యాయపరమైన సహకారం అందించారు.

పోలీసు అధికారులకు ఎస్పీ అభినందనలు

ఈ కేసులో నిందితుడికి శిక్ష పడేలా సమర్థవంతంగా పనిచేసిన దర్యాప్తు అధికారులు, ప్రస్తుత భూపాలపల్లి డీఎస్పీ ఏ. సంపత్ రావు, ప్రస్తుత చిట్యాల సీఐ సతీష్, టేకుమట్ల ఎస్‌ఐ అమూల్య, కోర్టు మానిటరింగ్ ఆఫీసర్ పీసీఆర్ ఇన్‌స్పెక్టర్ బి. రాజు, కోర్టు లైజనింగ్ ఆఫీసర్ ఏఎస్ఐ జి. వెంకన్న, కోర్టు కానిస్టేబుళ్లు సీహెచ్. జ్యోతి, పి. శ్వేత, భరోసా లీగల్ సపోర్ట్ ఆఫీసర్ జి. రజితలను జిల్లా ఎస్పీ సిరిశెట్టి సంకీర్త్, ఐపీఎస్ ప్రత్యేకంగా అభినందించారు.

మహిళలపై నేరాల విషయంలో కఠిన వైఖరి

మహిళలు, బాలికలపై నేరాలకు పాల్పడే వారిపై చట్టప్రకారం కఠిన చర్యలు తీసుకుంటామని జిల్లా పోలీసులు స్పష్టం చేశారు. బాధితులకు న్యాయం జరిగేలా దర్యాప్తు నుంచి న్యాయస్థానంలో విచారణ వరకు సమన్వయంతో పనిచేస్తామని తెలిపారు. నేరస్తులకు శిక్ష పడేలా పటిష్టమైన సాక్ష్యాధారాల సేకరణ, సమర్థవంతమైన దర్యాప్తు, కోర్టు విచారణలో తగిన సమన్వయానికి ప్రాధాన్యత ఇస్తామని పేర్కొన్నారు.