prajavaani.net
Newspaper Banner
Date of Publish : 31 October 2026, 8:28 pm Digital Edition : PRAJA VANI

మాదకద్రవ్య రహిత జిల్లాగా తీర్చిదిద్దేందుకు సమష్టిగా కృషి చేయాలి

మాదకద్రవ్య రహిత జిల్లాగా తీర్చిదిద్దేందుకు సమష్టిగా కృషి చేయాలి

మాదకద్రవ్యాల నిర్మూలనకు పటిష్టమైన చర్యలు చేపట్టాలి

యువత, విద్యార్థులకు మత్తు పదార్థాల దుష్ప్రభావాలపై విస్తృత అవగాహన కల్పించాలి

జిల్లా కలెక్టర్ సందీప్ కుమార్ ఝా

జనగామ జిల్లా ప్రతినిధి జె.ఉపేందర్, అక్టోబర్ 31(ప్రజావాణి): జిల్లాను మాదకద్రవ్య రహిత జిల్లాగా తీర్చిదిద్దేందుకు సంబంధిత శాఖల అధికారులు సమన్వయంతో పనిచేస్తూ, మాదకద్రవ్యాల నిర్మూలనకు పటిష్టమైన చర్యలు చేపట్టాలని జిల్లా కలెక్టర్ సందీప్ కుమార్ ఝా ఆదేశించారు.

శనివారం, జిల్లా సమీకృత కలెక్టర్ కార్యాలయంలోని మినీ కాన్ఫరెన్స్ హాల్లో మాదకద్రవ్యాల నిర్మూలనకు చేపట్టవలసిన చర్యలపై సంబంధిత శాఖల అధికారులతో డీసీపీ రాజమహేంద్ర నాయక్‌తో కలిసి జిల్లా కలెక్టర్ సందీప్ కుమార్ ఝా సమీక్షా సమావేశం నిర్వహించారు.

ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ జిల్లాలో మాదకద్రవ్యాలు, గంజాయి, ఇతర మత్తు పదార్థాల వినియోగం, అక్రమ రవాణా వంటి కార్యకలాపాలను పూర్తిస్థాయిలో అరికట్టేందుకు సంబంధిత శాఖల అధికారులు పక్కా కార్యాచరణ ప్రణాళికలు సిద్ధం చేసుకుని సమన్వయంతో పని చేయాలని ఆదేశించారు.

మత్తు పదార్థాల వినియోగం వల్ల కలిగే శారీరక, మానసిక, సామాజిక అనర్థాలపై విద్యార్థులకు అవగాహన కల్పించేందుకు ప్రత్యేక కార్యక్రమాలు నిర్వహించాలని తెలిపారు.

ప్రభుత్వ పాఠశాలలు, కళాశాలల్లో అవగాహన కార్యక్రమాలు చేపట్టి విద్యార్థులను చైతన్యవంతం చేయాలని సూచించారు. పాఠశాలలు, కళాశాలలకు తరచూ గైర్హాజరవుతున్న విద్యార్థులపై ఉపాధ్యాయులు ప్రత్యేక దృష్టి సారించాలని, వారు గైర్హాజరు కావడానికి గల కారణాలను తెలుసుకుని అవసరమైన మార్గదర్శకత్వం అందించాలన్నారు.

విద్యార్థుల ప్రవర్తనలో వచ్చే మార్పులను ఉపాధ్యాయులు, విద్యాసంస్థల యాజమాన్యాలు ఎప్పటికప్పుడు గుర్తిస్తూ, అవసరమైన చర్యలు తీసుకోవాలని సూచించారు. డ్రగ్స్ వినియోగం, మాదకద్రవ్యాల అక్రమ కార్యకలాపాల నియంత్రణకు పోలీస్, విద్యా, ఎక్సైజ్, వైద్య ఆరోగ్య శాఖల అధికారులు, విద్యాసంస్థల ప్రతినిధులు సమన్వయ బృందంగా పని చేయాలని తెలిపారు.

విద్యార్థుల ఉజ్వల భవిష్యత్తును కాపాడటంతో పాటు, యువత మత్తు పదార్థాల బారిన పడకుండా చూడటం ప్రతి ఒక్కరి బాధ్యత అని పేర్కొన్నారు. మాదకద్రవ్య రహిత సమాజ నిర్మాణానికి సమష్టిగా కృషి చేయాలని పిలుపునిచ్చారు.

ఈ సమావేశంలో వైద్య ఆరోగ్య శాఖ, పోలీస్, విద్యా శాఖ, ఎక్సైజ్ శాఖల అధికారులు, కళాశాలల ప్రిన్సిపాళ్లు, సంబంధిత శాఖల అధికారులు, తదితరులు పాల్గొన్నారు.