prajavaani.net
Newspaper Banner
Date of Publish : 16 October 2026, 1:26 pm Digital Edition : PRAJA VANI

మతసామరస్యానికి నిలువెత్తు నిదర్శనం.. ముస్లిం దంపతులు.

మతసామరస్యానికి నిలువెత్తు నిదర్శనం.. ముస్లిం దంపతులు.

అమ్మవారి విగ్రహం అందజేత.. కుంకుమ పూజకు సొంత ఖర్చులతో పూజా సామగ్రి.

ముదిగొండ, అక్టోబర్ 16 ప్రజావాణి ప్రతినిధి

మతాలకు అతీతంగా మానవత్వమే మిన్న అని చాటుతూ ముదిగొండ మండలం ఎడవల్లి గ్రామానికి చెందిన ముస్లిం దంపతులు ఎస్‌.కె. షాన్ పాషా, యాకోబి సోదరభావానికి ఆదర్శంగా నిలిచారు. గ్రామంలోని అమ్మవారి విగ్రహాన్ని అందజేయడంతో పాటు, అమ్మవారి కుంకుమ పూజ కార్యక్రమానికి అవసరమైన పూజా సామగ్రిని తమ సొంత ఖర్చులతో సమకూర్చి మతసామరస్యానికి ప్రతీకగా నిలిచారు.గ్రామంలో నిర్వహించిన కుంకుమ పూజ కార్యక్రమానికి అవసరమైన కలశం, ప్లేటు, గాజులు, జాకెట్ ముక్క, కొబ్బరికాయ తదితర పూజా సామగ్రిని దంపతులు స్వయంగా అందజేశారు. అమ్మవారి విగ్రహాన్ని అందించడంతో పాటు పూజా కార్యక్రమానికి కూడా సహకరించడం వారి విశాల హృదయానికి, సేవాభావానికి నిదర్శనంగా నిలిచింది.ప్రస్తుత సమాజంలో కులమతాలకు అతీతంగా పరస్పర గౌరవం, సోదరభావం ఎంతో అవసరమని ఈ దంపతుల సేవ చాటిచెబుతోంది. మతాలు వేరైనా మానవత్వం ఒక్కటేనని, పండుగలు, పూజలు సామాజిక ఐక్యతకు వారధులుగా నిలుస్తాయని వారి ఔదార్యం నిరూపిస్తోంది. ఎడవల్లి గ్రామంలో మతసామరస్యాన్ని చాటిన షాన్ పాషా, యాకోబి దంపతుల సేవలను గ్రామస్థులు అభినందిస్తున్నారు. ఇలాంటి మంచి పనులు సమాజంలో ఐక్యతను పెంపొందించడంతో పాటు భావితరాలకు స్ఫూర్తిగా నిలుస్తాయని పలువురు పేర్కొంటున్నారు.