prajavaani.net
Newspaper Banner
Date of Publish : 14 October 2026, 8:09 am Digital Edition : PRAJA VANI

మంత్రి నితిన్ గడ్కరీ తో రాష్ట్ర రోడ్డు, భవనాలు, సినిమాటోగ్రఫీ శాఖ మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి భేటీ

మంత్రి నితిన్ గడ్కరీ తో రాష్ట్ర రోడ్డు, భవనాలు, సినిమాటోగ్రఫీ శాఖ మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి భేటీ

నల్గొండ జిల్లా ప్రతినిధి ప్రజావాణి

డిల్లీలో కేంద్ర రోడ్డు రవాణా, జాతీయ రహదారుల శాఖ మంత్రి నితిన్ గడ్కరీ తో రాష్ట్ర రోడ్లు, భవనాలు, సినిమాటోగ్రఫీ శాఖ మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి ప్రత్యేకంగా భేటీ అయ్యారు. ఈ సందర్భంగా తెలంగాణలో చేపట్టాల్సిన కీలక రహదారులు, వంతెనలు, ఎలివేటెడ్ కారిడార్లు, రోప్‌వేలతో పాటు పలు మౌలిక వసతుల ప్రాజెక్టులపై చర్చించారు. ఈ భేటీలో పలు ప్రాజెక్టులకు కేంద్ర మంత్రి సానుకూలంగా స్పందించడంతో పాటు కీలక ఆమోదాలు తెలిపారు.

**భేటీలోని ముఖ్యాంశాలు:**

– ఎల్బీనగర్–హయత్‌నగర్ డబుల్ డెక్కర్ ఎలివేటెడ్ కారిడార్‌కు ఆమోదం.
– కృష్ణా నదిపై ఐకానిక్ కేబుల్ బ్రిడ్జి నిర్మాణానికి సంబంధించిన శంకుస్థాపన ప్రతిపాదనకు ఆమోదం. ఈ వంతెన ద్వారా NH-167K మీదుగా తెలంగాణ–ఆంధ్రప్రదేశ్ మధ్య అనుసంధానం మెరుగుపడి, రవాణా, పర్యాటక రంగాలకు ఊతం లభించనుంది.
– హైదరాబాద్–శ్రీశైలం NH-765 పై ఎలివేటెడ్ కారిడార్ నిర్మాణ ప్రతిపాదనకు సంబంధించి నూతన డీపీఆర్ సిద్ధం చేయాలని అధికారులకు ఆదేశాలు.
– NH-65 హైదరాబాద్ – విజయవాడ – మచిలీపట్నం రహదారి విస్తరణ పనుల్లో వేగం పెంచుతామని హామీ
– పర్వతమాల పథకం కింద తెలంగాణలో ఐదు రోప్‌వేల ఏర్పాటుకు ఆమోదం.
– హైదరాబాద్–అమరావతి గ్రీన్‌ఫీల్డ్ హైవే ప్రతిపాదనపై సానుకూల స్పందన.
– సేతు బంధన్ పథకం కింద మూడు రైల్వే ఓవర్ బ్రిడ్జిల (ROBలు) నిర్మాణానికి ఆమోదం.
– తెలంగాణలో 34 పనులకు CRIF నిధులు మంజూరు చేయాలని మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి కోరగా, సంబంధిత అధికారులకు కేంద్ర మంత్రి ఆదేశాలు.
పుల్లూరు–అలంపూర్–జట్రపోలు–పెంట్లవెల్లి–కొల్లాపూర్–లింగాల–అచ్చంపేట–డిండి–దేవరకొండ–మల్లేపల్లి–నల్గొండ రాష్ట్ర రహదారులను జాతీయ రహదారులుగా అప్‌గ్రేడ్ చేయాలన్న ప్రతిపాదనపై సానుకూల స్పందన.

అలాగే, హైదరాబాద్‌లో నవంబర్ 19 నుంచి 22 వరకు జరగనున్న ఇండియన్ రోడ్ కాంగ్రెస్ (IRC) కార్యక్రమానికి మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీ ని ఆహ్వానించగా, ఆయన సానుకూలంగా స్పందించి హాజరవుతానని తెలిపారు. తెలంగాణలో రహదారి కనెక్టివిటీని మెరుగుపరచడం, ప్రయాణ సమయాన్ని తగ్గించడం, రవాణా సౌకర్యాలను విస్తరించడం, పర్యాటక అభివృద్ధికి ఊతమివ్వడం లక్ష్యంగా రాష్ట్ర ప్రభుత్వం చేస్తున్న ప్రయత్నాల్లో ఈ భేటీ కీలక ముందడుగుగా నిలిచింది. ఈ భేటీలో మంత్రి జూపల్లి కృష్ణారావు, రాష్ట్రనికి సంబడించిన పలువురు ప్రజా ప్రతినిధులు, అధికారులు పాల్గొన్నారు.