*మంజీరా తీరాన భక్తి పారవశ్యం – చిట్కుల్ చాముండేశ్వరి ఆలయంలో నవరాత్రి ఉత్సవాలు ప్రారంభం*
*9 అడుగుల ఎత్తు, 18 చేతులతో శక్తి స్వరూపిణిగా దర్శనం – 9 రోజుల పాటు ప్రత్యేక పూజలు*
చిలిపిచెడ్, అక్టోబర్ 11 ప్రజావాణి. నర్సాపూర్ నియోజకవర్గ ప్రతినిధి
మెదక్ జిల్లా చిలిపిచెడ్ మండలం చిట్కుల్ శివారులో మంజీరా నది తీరాన వెలసిన ప్రసిద్ధ పుణ్యక్షేత్రం శ్రీ చాముండేశ్వరి దేవి ఆలయం శరన్నవరాత్రి ఉత్సవాలకు ముస్తాబైంది. నేటి నుంచి (Oct 11) 9 రోజుల పాటు ఉత్సవాలు ఘనంగా జరగనున్నాయి.
ఈ ఆలయంలో అమ్మవారు 9 అడుగుల ఎత్తు, 18 చేతులతో శక్తి స్వరూపిణిగా భక్తులకు దర్శనమిస్తున్నారు. కోరిన కోర్కెలు తీర్చే తల్లిగా భక్తుల్లో విశేష నమ్మకం ఉంది. నవరాత్రుల సందర్భంగా ఆలయాన్ని విద్యుత్ దీపాలతో సుందరంగా అలంకరించారు.
ఈ నెల 11 నుంచి 19 వరకు ప్రతిరోజూ అమ్మవారు ఒక్కో అవతారంలో భక్తులకు దర్శనమివ్వనున్నారు. ప్రతిరోజూ ఉదయం సుప్రభాత సేవ, అభిషేకం, కుంకుమార్చన, సహస్రనామార్చన, మధ్యాహ్నం మహా నివేదన, సాయంత్రం లలితా పారాయణం, మహా హారతి, తీర్థ ప్రసాద వితరణ కార్యక్రమాలు నిర్వహించనున్నారు. చివరి రోజున చండీ హోమం, పూర్ణాహుతితో ఉత్సవాలు ముగియనున్నాయి.
ఉత్సవాలకు సంబంధించిన అన్ని ఏర్పాట్లు పూర్తి చేసినట్లు ఆలయ ప్రధాన అర్చకుడు ప్రభాకర్ శర్మ, సేవా సమితి సభ్యులు తెలిపారు. భక్తులకు క్యూ లైన్లు, తాగునీరు, పార్కింగ్ సౌకర్యాలు కల్పించామని, పోలీసుల సహకారంతో భద్రతా ఏర్పాట్లు చేశామన్నారు.
ఈ ఉత్సవాలను తిలకించేందుకు తెలంగాణ రాష్ట్రంతో పాటు కర్ణాటక, మహారాష్ట్ర నుంచి భక్తులు పెద్ద సంఖ్యలో తరలిరానున్నారని, భక్తులందరూ వచ్చి అమ్మవారిని దర్శించుకుని ఉత్సవాలను విజయవంతం చేయాలని కోరారు.