*భూ భారతి, రీ-సర్వే, ఓటరు జాబితా సవరణ పనులను వేగవంతం చేయాలి*
*జిల్లా కలెక్టర్ కుమార్ దీపక్*
* *మన ప్రజావాణి* *మంచిర్యాల జిల్లా ప్రతినిధి:-*
భూ భారతి, రీ-సర్వే, ఓటరు జాబితా సవరణ పనులను వేగవంతం చేయాలని జిల్లా కలెక్టర్ కుమార్ దీపక్ తెలిపారు.
జిల్లాలోని నస్పూర్ మండల తహశీల్దార్ కార్యాలయాన్ని సందర్శించి, తహశీల్దార్ సంతోష్ కుమార్ తో కలిసి ఉద్యోగులు, సిబ్బంది హాజరు పట్టికను పరిశీలించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ కుమార్ దీపక్ మాట్లాడుతూ, అధికారులు, సిబ్బంది విధుల పట్ల బాధ్యతాయుతంగా వ్యవహరిస్తూ, ప్రజలకు అందుబాటులో ఉండాలని, కార్యాలయానికి వచ్చే ప్రజల సమస్యలను సత్వరమే పరిష్కరించాలని తెలిపారు. సాదా బైనామా, భూ భారతి దరఖాస్తుల పరిశీలన, రీ-సర్వే ప్రక్రియ, ఓటరు జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ (ఎస్‌ఐఆర్) పనుల పురోగతిపై సమీక్షించారు. పనులను నిర్దేశిత గడువులోగా పూర్తి చేసేలా చర్యలు తీసుకోవాలని, దరఖాస్తులను క్షుణ్ణంగా పరిశీలించి పెండింగ్‌లో ఉన్న సమస్యలను పరిష్కరించాలని అధికారులకు సూచించారు. అదేవిధంగా హాజీపూర్ మండల పరిధిలోని వేంపల్లి గ్రామంలో మండల తహశీల్దార్ పుష్పలత తో కలిసి భూ భారతి, రీ-సర్వే, ఓటరు జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ పనులను క్షేత్రస్థాయిలో పరిశీలించారు. సంబంధిత రికార్డులను సక్రమంగా నిర్వహిస్తూ, క్షేత్రస్థాయిలో ఎదురయ్యే సమస్యలను గుర్తించి పరిష్కరించాలని అధికారులకు సూచించారు. ప్రజలకు ప్రభుత్వ సేవలు పారదర్శకంగా, సమర్థవంతంగా అందేలా చర్యలు తీసుకోవాలని తెలిపారు. అదేవిధంగా మండలంలోని గుడిపేట గ్రామ రైతు వేదికలో రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు వీడియో కాన్ఫరెన్స్ ద్వారా నిర్వహించిన వ్యవసాయ మార్కెటింగ్, పత్తి మార్కెటింగ్, మద్దతు ధరలపై అవగాహన కార్యక్రమంలో జిల్లా వ్యవసాయ అధికారి సురేఖ, ఇతర అధికారులతో కలిసి పాల్గొన్నారు. రైతులకు వ్యవసాయ ఉత్పత్తుల మార్కెటింగ్ విధానాలు, పత్తి విక్రయాలు, మద్దతు ధరలకు సంబంధించిన అంశాలపై అవగాహన కల్పించేందుకు తీసుకోవాల్సిన చర్యలపై రాష్ట్ర మంత్రి పలు సూచనలు చేశారు. రైతులకు ప్రభుత్వ మార్గదర్శకాలు, మార్కెటింగ్ సంబంధిత సమాచారాన్ని చేరవేయాలని అధికారులకు సూచించారు. అనంతరం నిర్వహించిన ఖేత్ బచావో అభియాన్ కార్యక్రమంలో నేల ఆరోగ్యాన్ని కాపాడుకోవడం, భూసారాన్ని పునరుద్ధరించడం, రసాయన ఎరువులు, పురుగుమందుల అధిక వినియోగాన్ని తగ్గించడం వంటి అంశాలపై రైతులకు అవగాహన కల్పించాల్సిన అవసరాన్ని వివరించారు. రైతులు రసాయన ఎరువులు, పురుగుమందుల వినియోగాన్ని శాస్త్రీయ పద్ధతులలో నియంత్రిస్తూ, ప్రకృతి వ్యవసాయం, సేంద్రీయ వ్యవసాయ పద్ధతులను క్రమంగా అవలంబించేలా ప్రోత్సహించాలని సూచించారు. సాగు ఖర్చులను తగ్గించి, రైతులకు మెరుగైన ఆదాయం వచ్చేలా కృషి చేయవచ్చని తెలిపారు. పంట మార్పిడి విధానాన్ని అనుసరించడం, భూసార పరీక్షలు నిర్వహించి వాటి ఆధారంగా ఎరువులను వినియోగించడం, పంట వ్యర్థాలను సక్రమంగా నిర్వహించడం వంటి పద్ధతులపై రైతులకు అవగాహన కల్పించాలని సంబంధిత అధికారులకు సూచించారు. నేల ఆరోగ్యాన్ని పరిరక్షిస్తూ, వ్యవసాయ ఉత్పాదకతను పెంపొందించేందుకు రైతులకు అవసరమైన సాంకేతిక మార్గదర్శకాలు అందించాలని, స్థిరమైన వ్యవసాయ పద్ధతుల అమలుకు సమన్వయంతో పని చేయాలని తెలిపారు. ఈ కార్యక్రమంలో సంబంధిత అధికారులు పాల్గొన్నారు.