భూ-భారతి రీ-సర్వేతో భూ వివాదాలకు చెక్
ఖచ్చితమైన హద్దులు.. సమగ్ర భూ రికార్డులు.. భూధార్ కార్డులు
రీ-సర్వేలో రైతులు పూర్తి సహకారం అందించాలి: కలెక్టర్ కోయ శ్రీహర్ష
ఓదెల: భూ-భారతి సమగ్ర రీ-సర్వే ద్వారా క్షేత్రస్థాయిలో ప్రతి భూమి హద్దులను ఖచ్చితంగా నిర్ధారించి, భవిష్యత్‌లో భూ వివాదాలకు తావులేకుండా సమగ్ర భూ రికార్డులను రూపొందించనున్నట్లు పెద్దపల్లి జిల్లా కలెక్టర్ కోయ శ్రీహర్ష తెలిపారు. రీ-సర్వే ప్రక్రియ విజయవంతంగా పూర్తయ్యేందుకు రైతులు, ప్రజలు సర్వే అధికారులకు పూర్తి సహకారం అందించాలని ఆయన కోరారు.
మంగళవారం ఓదెల మండలం ఇందుర్తి గ్రామంలో నిర్వహించిన భూ-భారతి రీ-సర్వే అవగాహన సమావేశంలో కలెక్టర్ కోయ శ్రీహర్ష పాల్గొని, రీ-సర్వే ఉద్దేశ్యం, చేపట్టనున్న ప్రక్రియ, ప్రజల భాగస్వామ్యం, అభ్యంతరాల స్వీకరణ తదితర అంశాలను గ్రామస్థులకు వివరించారు.
ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ తెలంగాణ ప్రాంతంలో చివరిసారిగా 1937లో భూ సర్వే జరిగిందని, అనేక సంవత్సరాల అనంతరం ప్రస్తుతం రాష్ట్ర ప్రభుత్వం అన్ని గ్రామాల్లో సమగ్ర రీ-సర్వే చేపట్టేందుకు చర్యలు తీసుకుంటోందని తెలిపారు.
భూముల హద్దుల సమస్యలకు శాశ్వత పరిష్కారం
గతంలో ఒక సర్వే నంబర్‌లోని భూమి ఒకే వ్యక్తి పేరుతో ఉండేదని,

కాలక్రమేణా కొనుగోళ్లు, అమ్మకాలు, వారసత్వ బదలాయింపులు తదితర కారణాలతో భూములు అనేక చేతులు మారాయని కలెక్టర్ వివరించారు. పట్టాదారు పాస్‌పుస్తకాల్లో మార్పులు జరిగినప్పటికీ క్షేత్రస్థాయిలో ప్రతి భూమికి సంబంధించిన ఖచ్చితమైన మ్యాప్ అందుబాటులో లేకపోవడం వల్ల విస్తీర్ణంలో తేడాలు, హద్దుల వివాదాలు వంటి సమస్యలు ఉత్పన్నమవుతున్నాయని తెలిపారు.
ఈ సమస్యలకు శాశ్వత పరిష్కారం చూపడంతో పాటు భవిష్యత్ తరాల్లో భూ వివాదాలకు అవకాశం లేకుండా చేయడమే సమగ్ర రీ-సర్వే ప్రధాన లక్ష్యమని పేర్కొన్నారు. ఆధునిక సాంకేతిక పరిజ్ఞానాన్ని వినియోగించి ప్రతి భూమిని క్షేత్రస్థాయిలో సర్వే చేసి ఖచ్చితమైన హద్దులను నిర్ధారించనున్నట్లు వెల్లడించారు.
*పెద్దపల్లి జిల్లాలో తొలి దశలో 70 గ్రామాలు*
పెద్దపల్లి జిల్లాలో మొత్తం 190 రెవెన్యూ గ్రామాలు ఉండగా, తొలి దశలో 70 గ్రామాలను రీ-సర్వేకు ఎంపిక చేసినట్లు కలెక్టర్ తెలిపారు. ఇందులో ఓదెల మండలంలోని ఇందుర్తి గ్రామం కూడా ఉందన్నారు.
ముందుగా గ్రామ సరిహద్దులను నిర్ధారించి, అనంతరం ఇళ్లు, ప్రభుత్వ ఆస్తులు, వ్యవసాయ భూములను ఆధునిక సర్వే పరికరాలు, సాంకేతిక పరిజ్ఞానంతో సర్వే చేయనున్నట్లు తెలిపారు. ప్రతి భూమికి సంబంధించిన హద్దులు, విస్తీర్ణం తదితర వివరాలను ఖచ్చితంగా నమోదు చేసి సమగ్ర భూ రికార్డులను రూపొందిస్తామని చెప్పారు.
*సర్వే అనంతరం 21 రోజులు అభ్యంతరాల స్వీకరణ*
రీ-సర్వే పూర్తయిన అనంతరం గ్రామాల్లో భూ వివరాలను ప్రజల పరిశీలనకు అందుబాటులో ఉంచుతామని కలెక్టర్ తెలిపారు. భూ వివరాలపై అభ్యంతరాలు ఉంటే 21 రోజులలోపు తెలియజేసే అవకాశం కల్పిస్తామని చెప్పారు. అందిన అభ్యంతరాలను పరిశీలించి, నిబంధనల ప్రకారం పరిష్కరించిన అనంతరం తుది భూ వివరాలను ఆన్‌లైన్‌లో నమోదు చేస్తామని తెలిపారు.
అనంతరం భూమికి ప్రత్యేక గుర్తింపుగా భూధార్ కార్డులు జారీ చేయనున్నట్లు వెల్లడించారు. భవిష్యత్‌లో భూ హక్కులకు భద్రత కల్పించడంతో పాటు భూములకు సంబంధించిన వివరాలను సులభంగా గుర్తించేందుకు ఈ ప్రక్రియ ఎంతో ఉపయోగపడుతుందని పేర్కొన్నారు.
పైలెట్ ప్రాజెక్టులో 99 శాతం సమస్యలకు పరిష్కారం
రాష్ట్రంలో పైలెట్ ప్రాజెక్టు కింద ఐదు గ్రామాల్లో నిర్వహించిన రీ-సర్వే ద్వారా సుమారు 99 శాతం భూ సమస్యలను పరిష్కరించగలిగామని కలెక్టర్ తెలిపారు. భూముల విస్తీర్ణం, హద్దులు, ఇతర భూ సంబంధిత సమస్యలకు రీ-సర్వే ద్వారా శాశ్వత పరిష్కారం లభించే అవకాశం ఉందన్నారు.
ప్రభుత్వం ప్రవేశపెట్టిన భూ-భారతి పోర్టల్ ద్వారా ఇప్పటికే అనేక భూ సమస్యలను పరిష్కరిస్తున్నామని, రీ-సర్వే ద్వారా రూపొందించే ఖచ్చితమైన భూ రికార్డులు భూ-భారతి వ్యవస్థను మరింత బలోపేతం చేస్తాయని తెలిపారు.
*రోజుకు 40 నుంచి 50 ఎకరాల వరకు సర్వే*
రీ-సర్వేలో భాగంగా రోజుకు సుమారు 40 నుంచి 50 ఎకరాల వరకు సర్వే నిర్వహించే అవకాశం ఉందని కలెక్టర్ తెలిపారు. ఏ భూములను, ఏ సమయంలో సర్వే చేయనున్నారనే సమాచారాన్ని ముందుగానే సంబంధిత రైతులకు తెలియజేస్తామని చెప్పారు.
రైతులు తమ భూముల వద్ద నిర్దేశిత సమయంలో అందుబాటులో ఉండి సర్వే సిబ్బందికి సహకరించాలని సూచించారు. భూములకు సంబంధించిన పత్రాలు, ఇతర వివరాలతో రైతులు అందుబాటులో ఉంటే సర్వే ప్రక్రియ మరింత వేగంగా, సులభంగా పూర్తవుతుందని తెలిపారు.
*60–70 ఏళ్లకు ఉపయోగపడేలా రికార్డులు*
రీ-సర్వే ద్వారా రూపొందించే భూ వివరాలు రాబోయే 60 నుంచి 70 సంవత్సరాల వరకు ఉపయోగపడేలా పకడ్బందీగా రూపొందించనున్నట్లు కలెక్టర్ తెలిపారు. ఆధార్ తరహాలో భూమికి ప్రత్యేక గుర్తింపుగా భూధార్ కార్డుల జారీకి ఈ రీ-సర్వే కీలకమని పేర్కొన్నారు.
భవిష్యత్ తరాలకు ఉపయోగపడేలా ఖచ్చితమైన భూ రికార్డుల రూపకల్పనకు ప్రభుత్వం చేపట్టిన ఈ కార్యక్రమంలో ప్రతి ఒక్కరూ భాగస్వాములు కావాలని ఆయన కోరారు. రీ-సర్వే సమయంలో రైతులు, ప్రజలు అధికారులు, సర్వే సిబ్బందికి పూర్తి సహకారం అందించాలని, భూ వివరాలకు సంబంధించి ఏవైనా సందేహాలు లేదా అభ్యంతరాలు ఉంటే నిర్దేశిత సమయంలో అధికారుల దృష్టికి తీసుకురావాలని సూచించారు.
ఈ కార్యక్రమంలో తహసీల్దార్ వనజ, సంబంధిత రెవెన్యూ అధికారులు, సర్వే సిబ్బంది, ప్రజాప్రతినిధులు, రైతులు, గ్రామస్థులు తదితరులు పాల్గొన్నారు.