prajavaani.net
Newspaper Banner
Date of Publish : 07 October 2026, 7:33 pm Digital Edition : MADHUBABU ANDRAPRADESH

బ్యాంకింగ్ రంగ సంస్కరణలపై విద్యార్థులు అవగాహన కలిగి ఉండాలి: కెనరా బ్యాంక్ డివిజనల్ మేనేజర్

పోరుమామిళ్ల:అక్టోబర్ 7ప్రజావాణి:మారుతున్న కాలానికి అనుగుణంగా బ్యాంకింగ్ రంగంలో వస్తున్న ఆధునిక సంస్కరణలపై విద్యార్థులు సమగ్రమైన అవగాహన కలిగి ఉండాలని కెనరా బ్యాంక్ డివిజనల్ మేనేజర్ రమేష్ కుమార్ (రమణ కుమార్) పిలుపునిచ్చారు.బుధవారం పోరుమామిళ్లలోని స్థానిక ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో వాణిజ్య శాస్త్ర విభాగం ఆధ్వర్యంలో “బ్యాంకింగ్ రంగంలో సంస్కరణలు -అవగాహన”అనే అంశంపై ఒక ప్రత్యేక సదస్సు నిర్వహించారు.కళాశాల ప్రిన్సిపాల్ డాక్టర్ శామ్యూల్ డేవిడ్ రాజ్ అధ్యక్షతన జరిగిన ఈ కార్యక్రమానికి కెనరా బ్యాంక్ డివిజనల్ మేనేజర్ రమేష్ కుమార్,పోరుమామిళ్ల కెనరా బ్యాంక్ శాఖ మేనేజర్ వెంకట రమణలు ముఖ్య అతిథులుగా హాజరయ్యారు.ఈ సందర్భంగా డివిజనల్ మేనేజర్ మాట్లాడుతూ,ప్రస్తుత డిజిటల్ యుగంలో బ్యాంకింగ్ వ్యవస్థ పూర్తిగా రూపాంతరం చెందిందని, నగదు రహిత లావాదేవీలు (క్యాష్‌లెస్ ట్రాన్సాక్షన్స్) ప్రజల జీవితాల్లో భాగమయ్యాయని తెలిపారు. సాంకేతికత పెరిగిన కొద్దీ బ్యాంకింగ్ సేవలు సులభతరమైనప్పటికీ,అదే స్థాయిలో సైబర్ నేరాలు కూడా పెరిగిపోతున్నాయని ఆయన ఆందోళన వ్యక్తం చేశారు.ముఖ్యంగా ఈ మధ్య కాలంలో విపరీతంగా వినబడుతున్న”డిజిటల్ అరెస్టులు”,వివిధ రకాల ఆన్‌లైన్ మోసాల పట్ల విద్యార్థులు అత్యంత జాగ్రత్తగా ఉండాలని హెచ్చరించారు.అపరిచిత వ్యక్తుల నుంచి వచ్చే ఫోన్ కాల్స్,మెసేజ్‌లు,మరియు లింకుల పట్ల అప్రమత్తంగా ఉండాలని సూచించారు.బ్యాంకులు ఎప్పుడూ వ్యక్తిగత వివరాలను,ఓటీపీలను ఫోన్ ద్వారా అడగవనే విషయాన్ని విద్యార్థులు గమనించాలన్నారు. యువతగా విద్యార్థులు ఈ సైబర్ భద్రతా నియమాలను తెలుసుకోవడమే కాకుండా,తమ తల్లిదండ్రులకు,గ్రామీణ ప్రాంతాల్లోని అమాయక ప్రజలకు వివరించి వారిని మోసాల బారి నుంచి రక్షించాలని కోరారు.మరొక ముఖ్య అతిథి,పోరుమామిళ్ల కెనరా బ్యాంక్ మేనేజర్ వెంకట రమణ మాట్లాడుతూ,విద్యార్థుల ఉన్నత చదువుల కోసం బ్యాంకులు అందిస్తున్న వివిధ రకాల విద్యా రుణాలు (ఎడ్యుకేషన్ లోన్స్),ప్రభుత్వ భీమా పథకాలు మరియు ఆర్థిక సేవల గురించి వివరించారు.అర్హులైన ప్రతి విద్యార్థి బ్యాంకు సేవలని సద్వినియోగం చేసుకుని ఉన్నత శిఖరాలను అధిరోహించాలని ఆకాంక్షించారు.కళాశాల ప్రిన్సిపాల్ డాక్టర్ శామ్యూల్ డేవిడ్ రాజ్ తన అధ్యక్షోపన్యాసంలో మాట్లాడుతూ,విద్యార్థులకు కేవలం పుస్తక జ్ఞానమే కాకుండా సమాజంలో జరుగుతున్న ఇలాంటి సమకాలీన అంశాలపై అవగాహన కల్పించడం ఎంతో అవసరమని,ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసిన వాణిజ్య శాస్త్ర విభాగాన్ని అభినందించారు.ఈ అవగాహన సదస్సులో కళాశాల వైస్ ప్రిన్సిపల్ ప్రకాశ్ రావు,వాణిజ్య శాస్త్ర అధ్యాపకులు పి.చెన్న రాయుడు,యంబడి ఈశ్వరయ్య, కెనరా బ్యాంకు సిబ్బంది,మరియు పెద్ద సంఖ్యలో విద్యార్థిని విద్యార్థులు పాల్గొని తమ సందేహాలను నివృత్తి చేసుకున్నారు.