బోయకొండ గంగమ్మకు పెద్దిరెడ్డి పట్టు వస్త్రాలు!
సరస్వతీ దేవి అలంకారంలో అమ్మవారి దర్శనం.. అర్చకుల ప్రత్యేక మర్యాదలు
కుటుంబ సమేతంగా ఎంపీ మిథున్‌రెడ్డి.. ఎమ్మెల్యే ద్వారకనాథరెడ్డి హాజరు
మనప్రజావాణి
చౌడేపల్లి:
అన్నమయ్య జిల్లా పుంగనూరు నియోజకవర్గంలోని ప్రముఖ శక్తి క్షేత్రం శ్రీ బోయకొండ గంగమ్మ అమ్మవారి సన్నిధిలో దసరా నవరాత్రి ఉత్సవాలు భక్తిశ్రద్ధలతో కొనసాగుతున్నాయి. ఈ సందర్భంగా పుంగనూరు శాసనసభ్యులు, మాజీ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి అమ్మవారిని దర్శించుకుని పట్టు వస్త్రాలు సమర్పించారు. సరస్వతీ దేవి అలంకారంలో కొలువుదీరిన అమ్మవారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు.
ఆలయానికి చేరుకున్న పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డికి అర్చకులు ఆలయ మర్యాదలతో ఘన స్వాగతం పలికారు. అనంతరం అమ్మవారిని దర్శించుకున్న ఆయనకు అర్చకులు తీర్థప్రసాదాలు అందజేశారు.
కుటుంబ సమేతంగా ఎంపీ మిథున్‌రెడ్డి
రాజంపేట పార్లమెంటు సభ్యులు పెద్దిరెడ్డి వెంకట మిథున్‌రెడ్డి కుటుంబ సమేతంగా అమ్మవారిని దర్శించుకున్నారు. తంబళ్లపల్లె నియోజకవర్గ శాసనసభ్యులు ద్వారకనాథరెడ్డి సైతం బోయకొండ గంగమ్మను దర్శించుకుని పూజల్లో పాల్గొన్నారు.

ఈ కార్యక్రమంలో చౌడేపల్లి మండలానికి చెందిన పలువురు నాయకులు, కార్యకర్తలు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. దసరా నవరాత్రి ఉత్సవాల సందర్భంగా ఆలయంలో నిర్వహిస్తున్న ప్రత్యేక పూజలు, అమ్మవారి అలంకారాలు భక్తులను ఆకట్టుకుంటున్నాయి. భక్తుల రాకతో బోయకొండ ఆలయ ప్రాంగణం ఆధ్యాత్మిక శోభను సంతరించుకుంది.