బోయకొండలో అమ్మవారికి పట్టు వస్త్రాలు సమర్పించిన మధుసూదన్ నాయుడు
తొలిరోజు బాలా త్రిపుర సుందరీ దేవిగా దర్శనమిచ్చిన గంగమ్మ తల్లి
ప్రజావాణి, చౌడేపల్లి:
పుంగనూరు నియోజకవర్గంలోని ప్రముఖ పుణ్యక్షేత్రమైన బోయకొండ శ్రీ గంగమ్మ దేవస్థానంలో దసరా శరన్నవరాత్రి ఉత్సవాలు భక్తిశ్రద్ధలతో ప్రారంభమయ్యాయి. ఉత్సవాల్లో భాగంగా తెలుగుదేశం పార్టీ పుంగనూరు నియోజకవర్గ ఇన్‌చార్జి మధుసూదన్ నాయుడు కుటుంబ సమేతంగా అమ్మవారిని దర్శించుకుని పట్టు వస్త్రాలు సమర్పించారు.
ఈ సందర్భంగా ఆలయ ఉప కమిషనర్, కార్యనిర్వహణాధికారి ఏకాంబరం ఆలయ మర్యాదలతో మధుసూదన్ నాయుడుకు స్వాగతం పలికారు. అమ్మవారికి పట్టు వస్త్రాలు సమర్పించేందుకు అవసరమైన ఏర్పాట్లు చేశారు.

నవరాత్రి ఉత్సవాల తొలిరోజు సందర్భంగా బోయకొండ గంగమ్మ తల్లిని బాలా త్రిపుర సుందరీ దేవిగా వివిధ రకాల పుష్పాలతో సర్వాంగ సుందరంగా అలంకరించారు. ఆలయాన్ని ప్రత్యేక అలంకరణలతో తీర్చిదిద్దడంతో పుణ్యక్షేత్రంలో ఆధ్యాత్మిక శోభ వెల్లివిరిసింది. అమ్మవారి దర్శనం కోసం భక్తులు పెద్ద సంఖ్యలో తరలివచ్చారు. భక్తుల రాకతో ఆలయ పరిసరాలు సందడిగా మారాయి. నవరాత్రి ఉత్సవాల్లో భాగంగా ఆలయంలో ప్రత్యేక పూజా కార్యక్రమాలు నిర్వహించారు.