బెజ్జంకి మండలానికి 100 శాతం సబ్సిడీపై వేరుశనగ విత్తనాలు
యాసంగి సాగుకు 200 ఎకరాల్లో విత్తనాల పంపిణీకి ఏర్పాట్లు..
శుక్రవారం నుంచి అందుబాటులోకి గిరినార్-4 రకం
బెజ్జంకి, అక్టోబర్ 29 (ప్రజావాణి):
జాతీయ వంట నూనెలు–నూనెగింజల మిషన్ (ఎన్‌ఎంఈఓ–ఓఎస్) పథకంలో భాగంగా యాసంగి సీజన్‌లో వేరుశనగ సాగును ప్రోత్సహించేందుకు సిద్దిపేట జిల్లా వ్యవసాయ శాఖ బెజ్జంకి మండలానికి 100 శాతం సబ్సిడీపై విత్తనాలను కేటాయించింది. మండల పరిధిలో 200 ఎకరాల్లో వేరుశనగ సాగు చేపట్టేందుకు అవసరమైన విత్తనాలను కేటాయించినట్లు మండల వ్యవసాయ అధికారి తెలిపారు.ఈ పథకం కింద గిరినార్-4 రకం వేరుశనగ విత్తనాలను రైతులకు పంపిణీ చేయనున్నారు. ఈ రకం పంట కాలం 110 నుంచి 115 రోజులు కాగా, ఒక్కో బ్యాగులో 20 కిలోల విత్తనాలు ఉంటాయి. విత్తనాల పంపిణీ శుక్రవారం నుంచి ప్రారంభం కానుంది.వేరుశనగ సాగు చేయాలనుకునే రైతులు తమ భూమి పట్టాదారు పాస్‌బుక్ జిరాక్స్, ఆధార్ కార్డు జిరాక్స్‌తో సంబంధిత గ్రామ వ్యవసాయ విస్తరణ అధికారిని (ఏఈఓ) సంప్రదించాలని సూచించారు. అర్హులైన రైతులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకొని యాసంగి సీజన్‌లో వేరుశనగ సాగు చేపట్టాలని వ్యవసాయ శాఖ అధికారులు కోరారు.