బీసీ-ఏలో 57 కులాల హక్కులను కాపాడాలి.. ముదిరాజ్‌ల చేరికపై ప్రభుత్వ నిర్ణయాన్ని ఉపసంహరించుకోవాలి
రిజర్వేషన్ల ప్రయోజనాలు తగ్గే ప్రమాదం ఉంది..
బీసీ-ఏలో కొత్త కులాల చేరికతో పాత కులాలకు అన్యాయం చేయొద్దు
నాయి బ్రాహ్మణ సేవా సంఘం ధూళిమిట్ట మండల అధ్యక్షుడు కొండూరు సతీష్ కుమార్ డిమాండ్
మద్దూరు అక్టోబర్25, ప్రజా వాణి,
ఇప్పటికే సామాజికంగా, ఆర్థికంగా వెనుకబడిన బీసీ-ఏ వర్గాల హక్కులకు భంగం కలగకుండా ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని నాయి బ్రాహ్మణ సేవా సంఘం ధూళిమిట్ట మండల అధ్యక్షుడు కొండూరు సతీష్ కుమార్ డిమాండ్ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ బీసీ-ఏ జాబితాలో ముదిరాజ్ కులస్తులను చేర్చే ప్రకటనపై ఆయన అభ్యంతరం వ్యక్తం చేస్తూ, ప్రభుత్వ నిర్ణయాన్ని పునఃసమీక్షించాలని కోరారు. ధూళిమిట్ట మండల కేంద్రంలో నిర్వహించిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. బీసీ-ఏ జాబితాలో ఇప్పటికే ఉన్న 57 కులాల్లో అధికశాతం చేతివృత్తులపై ఆధారపడి జీవిస్తున్న వెనుకబడిన వర్గాలేనని పేర్కొన్నారు. ఆర్థికంగా, సామాజికంగా ఎన్నో ఇబ్బందులు ఎదుర్కొంటున్న ఈ వర్గాల పిల్లలకు విద్య, ఉద్యోగ అవకాశాలు కల్పించడంలో రిజర్వేషన్లు కీలక పాత్ర పోషిస్తున్నాయని తెలిపారు. పరిమితంగా ఉన్న రిజర్వేషన్ ప్రయోజనాల్లో కొత్త కులాలను చేర్చడం వల్ల ఇప్పటికే జాబితాలో ఉన్న కులాలకు విద్య, ఉద్యోగ అవకాశాలు తగ్గే ప్రమాదం ఉందని ఆందోళన వ్యక్తం చేశారు. ఒక వర్గానికి ప్రయోజనం కల్పించే క్రమంలో మరో వెనుకబడిన వర్గానికి అన్యాయం జరగకూడదని స్పష్టం చేశారు. చేతివృత్తుల కులాల హక్కుల పరిరక్షణే ప్రభుత్వ బాధ్యత అని పేర్కొంటూ, బీసీ-ఏలో ముదిరాజ్‌ల చేరిక అంశంపై అన్ని కోణాల్లో సమగ్రంగా పరిశీలించాలని కోరారు. ఇప్పటికే రిజర్వేషన్లు పొందుతున్న 57 కులాల ప్రయోజనాలకు విఘాతం కలగకుండా చర్యలు తీసుకోవాలని, ముదిరాజ్‌లను బీసీ-ఏలో చేర్చే ప్రకటనను ఉపసంహరించుకోవాలని కొండూరు సతీష్ కుమార్ డిమాండ్ చేశారు.