prajavaani.net
Newspaper Banner
Date of Publish : 08 October 2026, 2:30 pm Digital Edition : PRAJA VANI

బీసీలకు రాజ్యాధికారం కల్పించడమే కూటమి ప్రభుత్వ లక్ష్యం

బీసీలకు రాజ్యాధికారం కల్పించడమే కూటమి ప్రభుత్వ లక్ష్యం.

న్యాయపరమైన అడ్డంకులు ఎదురైనా బీసీలకు న్యాయం చేస్తాం.

-మైలవరం ఎమ్మెల్యే వసంత కృష్ణప్రసాదు గారు

ప్రజావాణి ప్రతినిధి

ఎన్టీఆర్ జిల్లా, గొల్లపూడి, అక్టోబర్ 8:

బీసీలకు రాజకీయంగా సముచిత ప్రాతినిధ్యం కల్పించి, రాజ్యాధికారం అందించడమే తెలుగుదేశం పార్టీ, కూటమి ప్రభుత్వ లక్ష్యమని మైలవరం శాసనసభ్యులు, టీడీపీ రాష్ట్ర అధికార ప్రతినిధి వసంత వెంకట కృష్ణప్రసాదు గారు స్పష్టం చేశారు. చట్టపరంగా, న్యాయపరంగా ఎన్ని అడ్డంకులు ఎదురైనా బీసీలకు న్యాయం చేయాలనే దృఢ సంకల్పంతో ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు, మంత్రి నారా లోకేష్ గారి నాయకత్వంలోని కూటమి ప్రభుత్వం ముందుకు సాగుతోందని తెలిపారు.

విజయవాడ రూరల్ మండలం గొల్లపూడిలోని ఎమ్మెల్యే కార్యాలయంలో గురువారం మీడియాతో మాట్లాడుతూ బీసీ రిజర్వేషన్లు, వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ వైఖరి, రాష్ట్రంలో బీసీల రాజకీయ ప్రాతినిధ్యంపై ఆయన మాట్లాడారు.

గతంలో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు కూడా బీసీ రిజర్వేషన్లపై తీర్మానాలు చేసినప్పటికీ, హైకోర్టులో అవి నిలబడకపోవడంతో సుప్రీంకోర్టును ఆశ్రయించకుండా వదిలేశారని వసంత కృష్ణప్రసాదు గారు విమర్శించారు. అయితే ప్రస్తుత కూటమి ప్రభుత్వం బీసీలకు న్యాయం చేయాలనే ఉద్దేశంతో న్యాయపరమైన పోరాటాన్ని కొనసాగిస్తోందని చెప్పారు. బీసీలకు రిజర్వేషన్లు కల్పించే ప్రయత్నాలను అడ్డుకునేలా న్యాయస్థానాల్లో కేసులు వేయడం దురదృష్టకరమని పేర్కొన్నారు.

న్యాయపరమైన పోరాటంతో పాటు ప్రత్యామ్నాయ మార్గాలు.

బీసీలకు రాజకీయంగా న్యాయం జరిగేలా కూటమి ప్రభుత్వం అన్ని విధాలా కట్టుబడి ఉందని ఎమ్మెల్యే కృష్ణప్రసాదు గారు స్పష్టం చేశారు. ఒకవేళ సుప్రీంకోర్టు న్యాయ సమీక్షలో కూడా రిజర్వేషన్లకు అనుమతి లభించని పరిస్థితి ఏర్పడితే, పార్టీ పరంగా 34 శాతం ప్రాతినిధ్యం కల్పించి బీసీలకు న్యాయం చేసే ప్రయత్నం చేస్తామని వెల్లడించారు. రాష్ట్రంలోని బడుగు, బలహీన వర్గాల ప్రజలు ఈ అంశాన్ని గమనించాలని కోరారు.

తెలుగుదేశం పార్టీ ఆవిర్భావం నుంచి బీసీలకు రాజకీయ ప్రాధాన్యత కల్పించడంలో కీలక పాత్ర పోషించిందని ఆయన పేర్కొన్నారు. బీసీ వర్గాలకు చెందిన నాయకులు ఎమ్మెల్యేలుగా, మంత్రులుగా, స్పీకర్లుగా ఉన్నత పదవులు చేపట్టడానికి టీడీపీ ఎంతో దోహదపడిందని తెలిపారు. భవిష్యత్తులోనూ బీసీలకు అండగా నిలుస్తూ, వారికి రాజకీయ అవకాశాలు కల్పించేందుకు పార్టీ కృషి చేస్తుందని చెప్పారు.

కార్పొరేషన్ల పేరుతో బీసీలను మభ్యపెట్టారు.

గత వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వంలో గుప్పించిన బీసీలపై కపట ప్రేమను ప్రదర్శిస్తూ అనేక కార్పొరేషన్లు ఏర్పాటు చేసినట్లు ప్రకటించినప్పటికీ, వాటి ద్వారా కులాలవారీగా ఆశించిన స్థాయిలో అభివృద్ధి జరగలేదన్నారు. కార్పొరేషన్ల ఏర్పాటుతోనే బీసీల అభ్యున్నతి సాధ్యం కాదని, వారికి నిజమైన రాజకీయ ప్రాతినిధ్యం, అధికారంలో భాగస్వామ్యం కల్పించినప్పుడే సమగ్ర అభివృద్ధి సాధ్యమవుతుందన్నారు.

వైసీపీ పాలనలో ప్రజలకు ఒరిగిందేమిటి?

గత ఎన్నికలకు ముందు వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డి గారు ‘వై నాట్ 175’ అంటూ ధీమా వ్యక్తం చేశారని, కానీ ఎన్నికల్లో ఆ పార్టీకి కేవలం 11 స్థానాలే దక్కాయని ఎమ్మెల్యే కృష్ణప్రసాదు గారు గుర్తుచేశారు. ఇప్పుడు మళ్లీ ప్రజల్లోకి వెళ్లి ఏం చేశామని చెప్పుకుంటారని ప్రశ్నించారు.

2019లో వైసీపీకి ప్రజలు ఒక్క అవకాశం ఇచ్చినప్పటికీ, వారి సమస్యలను పరిష్కరించడంలో విఫలమై, ప్రజలను ఇబ్బందులకు గురిచేసి, సమాజంలో విద్వేషాలకు కారణమయ్యారన్నారు. ప్రజల సంక్షేమం, రాష్ట్ర అభివృద్ధి కోసం పనిచేయని పార్టీలకు ప్రజలు మరోసారి అవకాశం ఇవ్వకూడదన్నారు.

రాష్ట్రంలోని బీసీ వర్గాలతో పాటు ప్రజలందరూ వాస్తవాలను గమనించి, బీసీలకు రాజ్యాధికారం కల్పించేందుకు కృషి చేస్తున్న తెలుగుదేశం పార్టీ, కూటమి ప్రభుత్వానికి అండగా నిలవాలని వసంత వెంకట కృష్ణప్రసాదు గారు పిలుపునిచ్చారు. బీసీలకు న్యాయం చేయడంలో కూటమి ప్రభుత్వం వెనుకడుగు వేయదని ఆయన స్పష్టం చేశారు.