prajavaani.net
Newspaper Banner
Date of Publish : 15 October 2026, 5:03 pm Digital Edition : PRAJA VANI

బీరంగూడ డివిజన్ బీజేపీ అధ్యక్షుడిగా ఈర్ల రాజు ముదిరాజ్ నియామకం

*బీరంగూడ డివిజన్ బీజేపీ అధ్యక్షుడిగా ఈర్ల రాజు ముదిరాజ్ నియామకం*

*పార్టీ బలోపేతమే లక్ష్యం.. ప్రజా సమస్యల పరిష్కారమే ధ్యేయం*

*నాపై ఉంచిన నమ్మకాన్ని నిలబెట్టుకుంటా: ఈర్ల రాజు ముదిరాజ్*

*నియామకానికి సహకరించిన పార్టీ నాయకులు, కార్యకర్తలు, కృతజ్ఞతలు*

అమీన్‌పూర్, అక్టోబర్ 15(ప్రజావాణి):బీరంగూడ డివిజన్‌లో భారతీయ జనతా పార్టీని క్షేత్రస్థాయిలో మరింత బలోపేతం చేయడంతో పాటు ప్రజా సమస్యల పరిష్కారానికి నిరంతరం కృషి చేస్తానని నూతనంగా నియమితులైన బీజేపీ బీరంగూడ డివిజన్ అధ్యక్షుడు ఈర్ల రాజు ముదిరాజ్ స్పష్టం చేశారు. సంగారెడ్డి జిల్లా బీజేపీ అధ్యక్షురాలు గోదావరి అంజిరెడ్డి ఆధ్వర్యంలో తనను బీరంగూడ డివిజన్ అధ్యక్షుడిగా నియమించడం పట్ల ఆయన హర్షం వ్యక్తం చేశారు. తనపై నమ్మకంతో కీలక బాధ్యతలు అప్పగించిన పార్టీ నాయకత్వానికి ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు.
ఈ సందర్భంగా ఈర్ల రాజు ముదిరాజ్ మాట్లాడుతూ.. తన నియామకానికి సహకరించిన మెదక్ పార్లమెంట్ సభ్యుడు మాధవనేని రఘునందన్‌రావు, ఎమ్మెల్సీ చినమైల్ అంజిరెడ్డి, సంగారెడ్డి జిల్లా బీజేపీ అధ్యక్షురాలు గోదావరి అంజిరెడ్డి, రాష్ట్ర నాయకులు ఆదెల్లి రవీందర్, ఎడ్ల రమేష్, జిల్లా ప్రధాన కార్యదర్శి కొలుకూరి రాజశేఖర్‌రెడ్డి, సహదేవ్‌తో పాటు రాష్ట్ర, జిల్లా నాయకులందరికీ ధన్యవాదాలు తెలిపారు.
పదవి అంటే అధికారం కాదని, ప్రజలకు సేవ చేసే బాధ్యతగా భావిస్తానని పేర్కొన్నారు. పార్టీ నాయకత్వం తనపై ఉంచిన విశ్వాసాన్ని నిలబెట్టుకుంటూ బీరంగూడ డివిజన్ పరిధిలో ప్రజలకు నిత్యం అందుబాటులో ఉంటానన్నారు. స్థానికంగా నెలకొన్న సమస్యలను గుర్తించి సంబంధిత అధికారుల దృష్టికి తీసుకెళ్లి వాటి పరిష్కారానికి కృషి చేస్తానని తెలిపారు.
బీజేపీ సిద్ధాంతాలను ప్రజల్లోకి తీసుకెళ్లడంతో పాటు కేంద్ర ప్రభుత్వ సంక్షేమ పథకాలపై విస్తృత అవగాహన కల్పిస్తానన్నారు. పార్టీ సీనియర్ నాయకులు, యువ నాయకులు, కార్యకర్తలను సమన్వయం చేసుకుంటూ ప్రతి స్థాయిలో పార్టీని బలోపేతం చేసేందుకు ప్రత్యేక కార్యాచరణతో ముందుకు సాగుతానని వివరించారు.
తన రాజకీయ ప్రయాణంలో అండగా నిలుస్తున్న పటాన్‌చెరు నియోజకవర్గ ప్రజలకు, ముఖ్యంగా బీరంగూడ డివిజన్, అమీన్‌పూర్ మండల ప్రజలకు, బీజేపీ నాయకులు, కార్యకర్తలు, అభిమానులకు ఆయన ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు. ప్రజల ప్రేమాభిమానాలు, కార్యకర్తల సహకారమే తనకు కొండంత బలమని పేర్కొన్నారు.
అదేవిధంగా పటాన్‌చెరు నియోజకవర్గంతో పాటు సంగారెడ్డి జిల్లాలోని పాత్రికేయ మిత్రులకు ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు. ప్రజా సమస్యలను వెలుగులోకి తీసుకురావడంలో మీడియా పాత్ర ఎంతో కీలకమని కొనియాడారు. ఇకపై వార్తా కథనాల్లో తనను బీరంగూడ డివిజన్ బీజేపీ అధ్యక్షుడిగా పేర్కొనాలని పాత్రికేయ మిత్రులను కోరారు.
పార్టీ నాయకులు, కార్యకర్తలు, ప్రజల సహకారంతో బీరంగూడ డివిజన్ అభివృద్ధికి, ప్రజా సమస్యల పరిష్కారానికి అంకితభావంతో పనిచేస్తానని ఈర్ల రాజు ముదిరాజ్ స్పష్టం చేశారు.