కడప జిల్లా పోరుమామిళ్ల సెప్టెంబర్ 27 ప్రజావాణి రాజకీయం ఒక్కసారిగా వేడెక్కింది. భారతీయ జనతా పార్టీ (బీజేపీ)లో సుదీర్ఘ కాలంగా పనిచేస్తున్న కీలక నేతలు తమ పదవులకు రాజీనామా చేయడం స్థానికంగా పెను సంచలనం సృష్టించింది. పోరుమామిళ్ల మండలం రంగసముద్రం పంచాయతీకి చెందిన బీజేపీ కిసాన్ మోర్చా జిల్లా కార్యదర్శి, మాజీ అసెంబ్లీ కో-కన్వీనర్ పల్లంశెట్టి పండరితో పాటు, బీజేపీ మండల కార్యదర్శి పల్లంశెట్టి అరుణ తమ పదవులను త్యజించారు. పార్టీ జిల్లా అధ్యక్షుడు జంగిటి వెంకటసుబ్బారెడ్డిపై వారు చేసిన తీవ్ర అవినీతి ఆరోపణలు ఇప్పుడు ఉమ్మడి జిల్లా రాజకీయాల్లో తీవ్ర చర్చనీయాంశంగా మారాయి.
రూ. 30 లక్షల టికెట్ బేరం: పల్లంశెట్టి పండరి ఆవేదన
గత 25 సంవత్సరాలుగా పార్టీ సిద్ధాంతాలను నమ్ముకుని, క్షేత్రస్థాయిలో బీజేపీ బలోపేతానికి అహర్నిశలు శ్రమించామని పల్లంశెట్టి పండరి, అరుణ ఈ సందర్భంగా గుర్తుచేశారు. రాబోయే ఎన్నికల్లో భాగంగా తాము ఆశించిన ఎంపీటీసీ టికెట్ కేటాయింపు విషయమై జిల్లా అధ్యక్షుడు జంగిటి వెంకటసుబ్బారెడ్డిని సంప్రదించినట్లు వారు తెలిపారు.అయితే,పార్టీ కోసం ఏళ్ల తరబడి కష్టపడిన తమ నిబద్ధతను పక్కనపెట్టి, టికెట్ కావాలంటే ఏకంగా రూ. 30 లక్షల రూపాయల నగదు ఇవ్వాలని జిల్లా అధ్యక్షుడు డిమాండ్ చేశారని పల్లంశెట్టి పండరి బహిరంగంగా ఆరోపించారు.
డబ్బులకే ప్రాధాన్యం.. కష్టపడిన వారికి గుర్తింపు లేదు!
పార్టీ శ్రేయస్సును విస్మరించి, కేవలం డబ్బులు ఎవరిస్తే వారికే టికెట్లు అమ్ముకునే సంస్కృతి జిల్లా నాయకత్వంలో పెరిగిపోయిందని పండరి తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. సిద్ధాంతాల పార్టీ అని చెప్పుకునే బీజేపీలో, ఇలాంటి వాణిజ్య ధోరణుల వల్ల నిజాయితీ గల కార్యకర్తలకు తీవ్ర అన్యాయం జరుగుతోందని, ఇది పార్టీ మనుగడకే తీవ్ర నష్టమని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. కష్టపడి పనిచేసే వారికి సరైన గుర్తింపు మరియు గౌరవం లేని చోట పదవుల్లో కొనసాగడం వృథా అని భావించే తాము ఈ నిర్ణయం తీసుకున్నట్లు స్పష్టం చేశారు.తమను ఇంతకాలం ఆదరించిన పార్టీ శ్రేణులకు, పెద్దలకు ధన్యవాదాలు తెలుపుతూనే, బాధ్యతాయుతమైన పార్టీ పదవుల నుంచి తప్పుకుంటున్నట్లు పల్లంశెట్టి పండరి, పల్లంశెట్టి అరుణ ప్రకటించారు. అయితే, పార్టీని వీడటం లేదని, కేవలం పదవులకు మాత్రమే రాజీనామా చేసి భవిష్యత్తులో సాధారణ కార్యకర్తలుగానే కొనసాగుతామని వారు స్పష్టం చేశారు.తమ ఉమ్మడి రాజీనామా లేఖను జిల్లా పార్టీ అధ్యక్షులు జంగిటి వెంకటసుబ్బారెడ్డితో పాటు, జిల్లా కిసాన్ మోర్చా అధ్యక్షులకు మరియు రాష్ట్ర పార్టీ అధ్యక్షులకు పంపినట్లు పండరి తెలిపారు. విలువలతో కూడిన రాజకీయం కోసం తాము సమర్పించిన ఈ రాజీనామాను ఆమోదించాలని వారు అధిష్ఠానాన్ని కోరారు. ఈ రాజీనామాల పర్వం పోరుమామిళ్ల మండల బీజేపీలో ఏ రకమైన కుదుపునకు దారితీస్తుందోనని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు.