*బీఆర్ఎస్లో చేరిన సీనియర్ నాయకుడు బాసుపల్లి రాంరెడ్డి
*
*మల్లారెడ్డి సమక్షంలో గులాబీ కండువా కప్పుకున్న రాంరెడ్డి*
మేడ్చల్, నేటి ప్రస్థానం:- మేడ్చల్ సర్కిల్ పరిధిలోని పూడూరు–కిష్టాపూర్ 298వ డివిజన్‌కు చెందిన సీనియర్ రాజకీయ నాయకుడు బాసుపల్లి రాంరెడ్డి గురువారం భారత రాష్ట్ర సమితి (బీఆర్ఎస్) పార్టీలో చేరారు. బోయిన్‌పల్లిలోని మేడ్చల్ ఎమ్మెల్యే చామకూర మల్లారెడ్డి నివాసంలో జరిగిన ఈ కార్యక్రమంలో రాంరెడ్డి తన అనుచరులతో కలిసి పార్టీలో చేరగా, ఎమ్మెల్యే మల్లారెడ్డి ఆయనకు గులాబీ కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు.
ఈ సందర్భంగా ఎమ్మెల్యే మల్లారెడ్డి రాబోయే సైబరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికలను దృష్టిలో ఉంచుకుని పార్టీ నాయకులు, కార్యకర్తలు సమష్టిగా పనిచేయాలని సూచించారు. పూడూరు–కిష్టాపూర్ డివిజన్లో బీఆర్ఎస్ పార్టీ విజయానికి కృషి చేయాలని, మేడ్చల్ సర్కిల్ పరిధిలో పార్టీని క్షేత్రస్థాయిలో మరింత బలోపేతం చేసేందుకు నాయకులు ముందుకు రావాలని పేర్కొన్నారు.
*మూడు డివిజన్లలో పార్టీ బలోపేతమే లక్ష్యం*
పార్టీలో చేరిన సందర్భంగా బాసుపల్లి రాంరెడ్డి మాట్లాడుతూ తనపై నమ్మకంతో పార్టీలోకి ఆహ్వానించిన ఎమ్మెల్యే మల్లారెడ్డికి కృతజ్ఞతలు తెలిపారు. మేడ్చల్ సర్కిల్ పరిధిలోని మూడు డివిజన్లలో బీఆర్ఎస్ పార్టీ బలోపేతానికి తనవంతు కృషి చేస్తానని వెల్లడించారు. పార్టీ నాయకులు, కార్యకర్తలతో కలిసి ప్రజలకు అందుబాటులో ఉంటూ పార్టీ అభివృద్ధికి కృషి చేస్తానని తెలిపారు.
*మర్రి రాజశేఖర్‌రెడ్డితో మర్యాదపూర్వక భేటీ*
బీఆర్ఎస్లో చేరిన అనంతరం బాసుపల్లి రాంరెడ్డి తన అనుచరులతో కలిసి మల్కాజిగిరి ఎమ్మెల్యే మర్రి రాజశేఖర్‌రెడ్డిని ఆయన నివాసంలో మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా తాజా రాజకీయ పరిణామాలు, పార్టీ బలోపేతానికి చేపట్టాల్సిన కార్యక్రమాలపై చర్చించినట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో పలువురు బీఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలు, బాసుపల్లి రాంరెడ్డి అనుచరులు పాల్గొన్నారు.