prajavaani.net
Newspaper Banner
Date of Publish : 02 October 2026, 7:04 am Digital Edition : SUDHAKAR NALGONDA CHANDOOR

బాలలు నేరాల బాట పట్టకుండా అన్ని శాఖలు సమన్వయంతో పనిచేయాలి..

బాలలు నేరాల బాట పట్టకుండా అన్ని శాఖలు సమన్వయంతో పనిచేయాలి..

బాలల రక్షణ, చెడు వ్యసనాల నివారణ, బాల నేరాల నియంత్రణపై సమగ్ర కార్యాచరణ అవసరం.. జిల్లా కలెక్టర్, జిల్లా ఎస్పి

నల్గొండ జిల్లా ప్రతినిధి ప్రజావాణి

బాలలు నేరాల బాట పట్టకుండా, చెడు వ్యసనాలకు దూరంగా ఉంటూ, బాధ్యతాయుతమైన పౌరులుగా ఎదిగేందుకు అన్ని ప్రభుత్వ శాఖలు సమన్వయంతో పనిచేయాలని జిల్లా కలెక్టర్, చంద్రశేఖర్ ఐఏఎస్, జిల్లా ఎస్పీ శరత్ చంద్ర పవార్ ఐపీఎస్ పిలుపునిచ్చారు. బాలల రక్షణ, బాల నేరాల నియంత్రణ, మత్తు పదార్థాల వినియోగం నివారణ, బాలల హక్కుల పరిరక్షణ వంటి అంశాలపై సంబంధిత శాఖల అధికారులు సమగ్ర కార్యాచరణ రూపొందించి అమలు చేయాలని సూచించారు. నల్లగొండ జిల్లా పోలీస్ కార్యాలయంలో చైల్డ్ ప్రొటెక్షన్ వ్యవస్థ కి సంబందించిన వివిధ శాఖలతో నిర్వహించిన సమన్వయ సమావేశంలో బాలలు నేరాలకు పాల్పడటానికి గల కారణాలు, చెడు వ్యసనాలకు అలవాటు పడటానికి దారితీస్తున్న పరిస్థితులు, వాటిని అరికట్టేందుకు తీసుకోవాల్సిన చర్యలపై విస్తృతంగా చర్చించారు. జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు బాలల విద్య, ఆరోగ్యం, సంక్షేమం, రక్షణ కోసం అమలు చేస్తున్న పథకాలను అర్హులైన ప్రతి చిన్నారికి అందేలా సంబంధిత శాఖలు చర్యలు తీసుకోవాలని కలెక్టర్ సూచించారు. పాఠశాలల్లో చదువుపై ఆసక్తి పెంపొందించడం, బడి మానేసిన పిల్లలను తిరిగి పాఠశాలల్లో చేర్పించడం, కౌన్సెలింగ్ నిర్వహించడం, అవసరమైన వైద్య, మానసిక సహాయం అందించడం ద్వారా బాలలను నేరాల నుంచి దూరంగా ఉంచవచ్చని పేర్కొన్నారు. ఈ సందర్బంగా ఎస్పి మాట్లాడుతూ చిన్న వయస్సులోనే కొంతమంది పిల్లలు దొంగతనాలు, మద్యం, గంజాయి వంటి మత్తు పదార్థాలకు సంబంధించిన కార్యకలాపాలు సహా వివిధ నేరాల్లో పాల్గొంటున్నట్లు సమావేశంలో ప్రస్తావించారు. జిల్లాలో సుమారు 130 మంది బాలలు వివిధ నేరాలకు సంబంధించిన కేసుల్లో భాగమైన అంశాన్ని దృష్టిలో ఉంచుకుని, వారు నేరాల వైపు మళ్లడానికి గల సామాజిక, కుటుంబ, ఆర్థిక, మానసిక కారణాలను గుర్తించాల్సిన అవసరం ఉందని వివరించారు.
తల్లిదండ్రుల పర్యవేక్షణ లోపం, కుటుంబ సమస్యలు, పేదరికం, చెడు స్నేహాలు, సామాజిక మాధ్యమాల ప్రభావం, మత్తు పదార్థాల సులభ లభ్యత, పాఠశాలలకు దూరమవడం వంటి అంశాలు పిల్లలపై ఎలాంటి ప్రభావం చూపుతున్నాయో క్షేత్రస్థాయిలో పరిశీలించాలని సూచించారు. ముఖ్య అతిథి డాక్టర్. ఇసిడోర్ ఫిలిప్స్, (టెక్నికల్ అడ్వైసర్, చైల్డ్ ప్రొటెక్షన్ సిస్టమ్, యూనిసెఫ్ మాట్లాడుతూ ప్రధానంగా పిల్లలను హానికరమైన, ప్రమాదకరమైన పరిస్థితుల నుంచి రక్షించడం హింస, దోపిడీ, బాల కార్మికత్వం, చెడు వ్యసనాలు, నేర ప్రవృత్తులు మరియు ఇతర ప్రమాదాల నుంచి కాపాడేందుకు తల్లిదండ్రులు, ఉపాధ్యాయులు, పోలీసులు, అధికారులు మరియు సమాజం సమష్టిగా బాధ్యత తీసుకోవాలి. పిల్లలకు సురక్షితమైన వాతావరణాన్ని కల్పించి, వారి హక్కులను పరిరక్షించడంతో పాటు సరైన మార్గనిర్దేశం అందించాలని అన్నారు. పిల్లలు నేరాలకు పాల్పడినప్పుడు కేవలం శిక్షాత్మక చర్యలకే పరిమితం కాకుండా, వారి వయస్సు, కుటుంబ పరిస్థితులు, విద్య, మానసిక స్థితి, సామాజిక నేపథ్యాన్ని పరిగణనలోకి తీసుకుని చట్టబద్ధమైన బాల న్యాయ విధానాల ప్రకారం మార్గనిర్దేశం చేయాలని అన్నారు. బాలలు తిరిగి నేరాల బాట పట్టకుండా విద్య, నైపుణ్యాభివృద్ధి, కుటుంబ సహకారం, కౌన్సెలింగ్ ద్వారా సమాజంలో గౌరవప్రదమైన జీవితాన్ని గడిపేలా చేయడం అందరి బాధ్యతగా పేర్కొన్నారు. ఈ సమావేశంలో ముఖ్య అతిథిగా డాక్టర్. ఇసిడోర్ ఫిలిప్స్, (టెక్నికల్ అడ్వైసర్, చైల్డ్ ప్రొటెక్షన్ సిస్టమ్, యూనిసెఫ్), అడిషనల్ ఎస్పీ రమేష్, జడ్పీ సీఈఓ ప్రేమ్ కరుణ్ రెడ్డి, డిఎస్పీ లు శివరాం రెడ్డి, రవి, శ్రీనివాస్ రావు, విద్యాశాఖ, వైద్య ఆరోగ్య శాఖ, పోలీస్ శాఖ, యూత్ అండ్ స్పోర్ట్స్, పంచాయతీ రాజ్, చైల్డ్ ప్రొటెక్షన్ విభాగాలకు చెందిన సంబంధిత అధికారులు పాల్గొని బాలల రక్షణ, బాల నేరాల నివారణకు తీసుకోవాల్సిన చర్యలపై చర్చించారు.