బాంబే కాలనీలో కలుషిత నీటి కలకలం!
తాగునీటి పైప్‌లైన్‌లోకి డ్రైనేజీ నీరు.. అధికారుల తనిఖీల్లో గుర్తింపు
క్షేత్రస్థాయిలో పరిశీలించిన జలమండలి ఈడీ సంతోష్
సమస్యలను తక్షణమే పరిష్కరించాలని అధికారులకు ఆదేశాలు
రామచంద్రాపురం, వాసవీనగర్‌లోనూ సమస్యల పరిశీలన
రామచంద్రాపురం, అక్టోబర్ 26 (ప్రజావాణి):భారతీనగర్ డివిజన్ పరిధిలోని బాంబే కాలనీలో కలుషిత నీటి సరఫరా ప్రజలను ఆందోళనకు గురిచేస్తోంది. వారం రోజులుగా తాగునీటిలో డ్రైనేజీ నీరు కలుస్తోందని స్థానికులు ఫిర్యాదు చేయడంతో జలమండలి అధికారులు రంగంలోకి దిగారు. మాజీ కార్పొరేటర్ సింధు ఆదర్శ్ రెడ్డి విజ్ఞప్తి మేరకు సోమవారం జలమండలి ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ సంతోష్ కాలనీలో పర్యటించారు. ఆయన వెంట పటాన్‌చెరు నియోజకవర్గ బీఆర్‌ఎస్ పార్టీ ఇన్‌చార్జ్ వెన్నవరం ఆదర్శ్ రెడ్డి పాల్గొన్నారు. ఇంటింటికీ వెళ్లి నీటి సరఫరా పరిస్థితిని పరిశీలించి ప్రజల సమస్యలను అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా బీడీఎల్ అపార్ట్‌మెంట్ సమీపంలో డ్రైనేజీ నీరు తాగునీటి పైప్‌లైన్‌లో కలుస్తున్న ప్రాంతాన్ని జలమండలి అధికారులు గుర్తించారు. కలుషిత నీటి సరఫరాతో ప్రజల ఆరోగ్యానికి ముప్పు వాటిల్లే ప్రమాదం ఉందని, సమస్యను ఏమాత్రం నిర్లక్ష్యం చేయకుండా తక్షణమే పరిష్కరించాలని ఈడీ సంతోష్ అధికారులను ఆదేశించారు. పైప్‌లైన్‌లోని లోపాలను సరిచేసి కాలనీ ప్రజలకు స్వచ్ఛమైన తాగునీరు అందేలా చర్యలు చేపట్టాలని సూచించారు. అనంతరం రామచంద్రాపురం డివిజన్ పరిధిలోని పాత రామచంద్రాపురంలో కొనసాగుతున్న రెండు నీటి సరఫరా మరమ్మతు పనులను పరిశీలించారు. వాసవీనగర్ కాలనీలో భూగర్భ మురుగునీటి పారుదల సమస్యను సైతం పరిశీలించి పెండింగ్ పనులను త్వరితగతిన పూర్తి చేయాలని ఆదేశించారు. ప్రజలకు తాగునీరు, డ్రైనేజీ సమస్యలు తలెత్తకుండా అధికారులు ప్రత్యేక దృష్టి సారించాలని సూచించారు. ఈ సందర్భంగా ఆదర్శ్ రెడ్డి మాట్లాడుతూ ప్రజల ఆరోగ్యంతో ముడిపడిన తాగునీటి సమస్యల పరిష్కారంలో జాప్యం చేయరాదని, శాశ్వత పరిష్కారం చూపాలని కోరారు. ఈ కార్యక్రమంలో జలమండలి డీజీఎం శివకుమార్, ఏఈ ధనుంజయ్, నాయక్, బీఆర్‌ఎస్ సీనియర్ నాయకులు జగన్నాధ్ రెడ్డి, పరమేష్ యాదవ్ తదితరులు పాల్గొన్నారు.