ఫోక్సో కేసుల్లో దోషులైతే జీవితాలు అంధకారం!
చిన్నారుల రక్షణకు అవగాహనే ఆయుధం: జిల్లా అదనపు న్యాయమూర్తి వెంకటేశ్వరరావు
కూకట్‌పల్లి: అక్టోబర్ 31(ప్రజావాణి)
చిన్నారులపై లైంగిక దాడులకు పాల్పడితే కఠినమైన చట్టపరమైన చర్యలు తప్పవని, ఫోక్సో కేసుల్లో దోషులుగా తేలితే జీవితాలు నాశనమవుతాయని జిల్లా అదనపు న్యాయమూర్తి, ఫోక్సో ప్రత్యేక కోర్టు ఇన్‌చార్జి జడ్జి ఎం. వెంకటేశ్వరరావు హెచ్చరించారు.
తెలంగాణ రాష్ట్ర న్యాయ సేవాధికార సంస్థ ఆదేశాల మేరకు కూకట్‌పల్లి మండల్ లీగల్ సర్వీసెస్ అథారిటీ ఆధ్వర్యంలో శనివారం పల్లవి పాఠశాలలో నిర్వహించిన ‘సురక్షిత్ బచ్పన్ అభియాన్’ అవగాహన కార్యక్రమానికి ఆయన ముఖ్య అతిథిగా హాజరయ్యారు.
ఈ సందర్భంగా మాట్లాడుతూ విద్యార్థులు సోషల్ మీడియా ప్రభావానికి లోనుకాకుండా తమ చదువు, లక్ష్యాలపై దృష్టి సారించి ఉన్నత స్థాయికి ఎదగాలని సూచించారు. చిన్నారులపై జరుగుతున్న లైంగిక వేధింపులను అరికట్టేందుకు ప్రతి ఒక్కరూ ఫోక్సో చట్టంపై అవగాహన పెంచుకోవాలని కోరారు. భయంతో మౌనంగా ఉండకుండా ధైర్యంగా తమకు జరిగిన విషయాన్ని పెద్దలకు తెలియజేయాలని సూచించారు.
ఫోక్సో ప్రత్యేక కోర్టు పబ్లిక్ ప్రాసిక్యూటర్ సంతోష్ కుమారి మాట్లాడుతూ మంచి స్పర్శ, చెడు స్పర్శపై విద్యార్థులకు అవగాహన ఉండాలని, ఎవరైనా అసౌకర్యానికి గురిచేసినా, భయపెట్టినా తల్లిదండ్రులు, ఉపాధ్యాయులకు వెంటనే తెలియజేయాలని సూచించారు. అవసరమైతే చైల్డ్ హెల్ప్‌లైన్ 1098ను సంప్రదించాలని తెలిపారు.
ఈ కార్యక్రమంలో కూకట్‌పల్లి సీఐ స్వామిగౌడ్, కోర్టు బార్ అసోసియేషన్ అధ్యక్షుడు గోవర్ధన్ రెడ్డి, కల్చరల్ సెక్రటరీ శ్రీలత, న్యాయవాదులు నిమ్మల శ్రీనివాస్, పల్లవి పాఠశాల ప్రిన్సిపాల్, ఉపాధ్యాయులు, విద్యార్థినీ విద్యార్థులు పాల్గొన్నారు.