ప్రియుడి బెయిల్ కోసం డ్రగ్స్ క్యారియర్‌గా మారిన యువతి విజయవాడలో అరెస్ట్.
విజయవాడ రైల్వే స్టేషన్లో డ్రగ్స్‌తో పట్టుబడ్డ నాగసౌమ్య
ప్రజావాణి దినపత్రిక ప్రతినిధి విజయవాడ అక్టోబర్ 15
జైల్లో ఉన్న ప్రియుడి బెయిల్ డబ్బుల కోసం కమీషన్‌కు ఒప్పుకున్నట్లు వెల్లడి
బెంగళూరు నుంచి 110 గ్రాముల ఎండీఎంఏ తీసుకొస్తుండగా అరెస్ట్
తప్పించుకున్న ప్రధాన నిందితుడు బషీర్‌ను కూడా పట్టుకున్న పోలీసులు
విజయవాడ పటమటకు చెందిన నాగసౌమ్యకు మాదక ద్రవ్యాల అలవాటు ఉంది. ఆమె ప్రియుడు కాశీవర్ధన్ మూడు నెలల క్రితం డ్రగ్స్ సరఫరా కేసులో చిత్తూరులో అరెస్టయి ప్రస్తుతం జైలులో ఉన్నాడు. అతడి బెయిల్ కోసం అవసరమైన నగదు లేకపోవడంతో, నాగసౌమ్య డ్రగ్స్ క్యారియర్‌గా మారాలని నిర్ణయించుకుంది.
విజయవాడ కృష్ణలంకకు చెందిన డ్రగ్స్ సరఫరాదారు బషీర్, బెంగళూరు నుంచి డ్రగ్స్ తీసుకొస్తే రూ. 50 వేల కమిషన్ ఇస్తానని నాగసౌమ్యను ప్రలోభపెట్టాడు. దీంతో ఈ నెల 13న ఆమె బెంగళూరులోని యలహంకకు వెళ్లి, అక్కడ ఓ గుర్తుతెలియని వ్యక్తి నుంచి రెండు ప్యాకెట్లలో ఉన్న 110 గ్రాముల ఎండీఎంఏను తీసుకుంది. అనంతరం బెంగళూరు-హౌరా ఎక్స్‌ప్రెస్ రైలులో విజయవాడకు బయలుదేరింది.
ముందస్తు సమాచారంతో ఈగల్ ఇన్స్పెక్టర్ రవీంద్ర, జీఆర్పీ ఇన్స్పెక్టర్ రమణ బృందాలు విజయవాడ రైల్వే స్టేషన్లో నిఘా ఉంచాయి. రైలులో పోలీసుల తనిఖీలను గమనించిన నాగసౌమ్య, ఈ విషయాన్ని బషీర్‌కు ఫోన్ ద్వారా సమాచారం అందించడంతో అతడు స్టేషన్ నుంచి పరారయ్యాడు. పోలీసులు నాగసౌమ్యను క్షుణ్ణంగా తనిఖీ చేయగా, ఆమె ప్యాంటు లోపల ప్రత్యేకంగా కుట్టించుకున్న జేబులో దాచిన డ్రగ్స్ ప్యాకెట్లను గుర్తించి స్వాధీనం చేసుకున్నారు. అనంతరం ఆమెను అరెస్ట్ చేశారు. పరారీలో ఉన్న బషీర్‌ను కూడా బుధవారం విజయవాడలో అదుపులోకి తీసుకున్నట్లు పోలీసులు వెల్లడించారు.