ప్రమాణాలు రూపొందించడమే కాదు… క్షేత్రస్థాయిలో సురక్షిత రహదారుల నిర్మాణమే లక్ష్యం
నల్గొండ జిల్లా ప్రతినిధి ప్రజావాణి
గుజరాత్‌లోని ఏక్తానగర్‌లో జరుగుతున్న చింతన్ శివిర్–2026లో “Designing Safe Highways – From Standards to Implementation” అంశంపై నిర్వహించిన ప్యానెల్ డిస్కషన్‌కు రాష్ట్ర రోడ్లు, భవనాలు, సినిమాటోగ్రఫీ శాఖ మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి అధ్యక్షత వహించారు. ప్రమాణాలు రూపొందించడం మాత్రమే కాకుండా, వాటిని క్షేత్రస్థాయిలో సమర్థవంతంగా అమలు చేసి సురక్షితమైన రహదారులను నిర్మించడమే లక్ష్యంగా ఉండాలని మంత్రి స్పష్టం చేశారు. 2030 నాటికి రోడ్డు ప్రమాద మరణాలను 50 శాతం తగ్గించేందుకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు సమన్వయంతో పనిచేయాల్సిన అవసరం ఉందన్నారు. బ్లాక్ స్పాట్లను గుర్తించడంతో ఆగకుండా శాశ్వత ఇంజినీరింగ్ పరిష్కారాలు చూపాలని, డిజైన్ నుంచి నిర్మాణం, నిర్వహణ వరకు ప్రతి దశలో రహదారి భద్రతకు ప్రాధాన్యత ఇవ్వాలని సూచించారు. హైదరాబాద్–విజయవాడ NH-65 పై పెరుగుతున్న ప్రమాదాలు, ట్రాఫిక్ రద్దీపై ఆందోళన వ్యక్తం చేసిన మంత్రి, ప్రస్తుత 4 లేన్ రహదారిని 6+2 లేన్లుగా అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానంతో విస్తరించాల్సిన అవసరం ఉందన్నారు. ఈ అంశాన్ని కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీ దృష్టికి తీసుకెళ్లామని, త్వరలో పనులు ప్రారంభమయ్యేలా చర్యలు తీసుకుంటున్నట్లు తెలిపారు. రోడ్డు భద్రత ఆడిట్లను నిరంతర ప్రక్రియగా కొనసాగించాలని, అవసరమైతే స్వతంత్ర రోడ్డు భద్రత నిపుణుల వ్యవస్థ లేదా ‘Road Safety Ombudsman’ ఏర్పాటు చేసే అంశాన్ని పరిశీలించాలని సూచించారు. “ఎన్ని కిలోమీటర్ల రహదారి నిర్మించామన్నది కాదు.. ఎన్ని ప్రాణాలను కాపాడామన్నదే ముఖ్యం.” సురక్షితమైన రహదారుల కోసం కేంద్రం, రాష్ట్రాలు కలిసి పనిచేసి, ప్రతి ప్రయాణాన్ని మరింత సురక్షితంగా మార్చాలని మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి పిలుపునిచ్చారు.