prajavaani.net
Newspaper Banner
Date of Publish : 05 October 2026, 8:26 pm Digital Edition : PRAJA VANI

ప్రమాణం యాప్‌ ద్వారానే హాజరు నమోదు చేయాలి

ప్రమాణం యాప్‌ ద్వారానే హాజరు నమోదు చేయాలి.

భూపాలపల్లి, మన ప్రజావాణి : జిల్లాలోని అన్ని ప్రభుత్వ శాఖల అధికారులు, సిబ్బంది ఇకపై మీ ప్రమాణం యాప్‌ ద్వారానే హాజరు నమోదు చేయాలని జిల్లా కలెక్టర్ రాహుల్ శర్మ ఆదేశించారు.
సోమవారం ఐడీఓసీ సమావేశపు హాలులో మీ ప్రమాణం హాజరు యాప్‌ వినియోగంపై జిల్లా అధికారులతో నిర్వహించిన సమీక్షలో కలెక్టర్ మాట్లాడుతూ
ఈ విధానాన్ని వచ్చే వారం నుండి తప్పనిసరిగా అమలు చేయనున్నట్లు స్పష్టం చేశారు.
ప్రభుత్వ సేవల్లో పారదర్శకత, సమయపాలన, జవాబుదారీతనం పెంచే లక్ష్యంతో ఈ హాజరు విధానాన్ని అమలు చేస్తున్నట్లు తెలిపారు. జిల్లా స్థాయి నుంచి క్షేత్రస్థాయి వరకు పనిచేస్తున్న ప్రతి అధికారి, ఉద్యోగి యాప్‌లో హాజరు నమోదు చేయాల్సి ఉంటుందని అన్నారు.
యాప్‌ వినియోగం, హాజరు నమోదు ప్రక్రియపై ఈడీఎం శ్రీకాంత్‌ అధికారులకు అవగాహన కల్పించారని, సాంకేతిక సమస్యలు, సందేహాలు ఉంటే ఈడీఎంను సంప్రదించాలని కలెక్టర్ సూచించారు.
ప్రభుత్వం ద్వారా వేతనాలు పొందుతున్న ప్రతి ఒక్క ఉద్యోగి తప్పని సరిగా యాప్ వినియోగించాలని తెలిపారు.
ఈ సమావేశంలో అదనపు కలెక్టర్ అశోక్ కుమార్ డీఆర్వో వసంతకుమారి, ఆర్డీఓ హరికృష్ణ, శిక్షణ డిప్యూటీ కలెక్టర్ నవీన్‌రెడ్డి, ఈడీఎం శ్రీకాంత్‌, వివిధ శాఖల జిల్లా అధికారులు తదితరులు పాల్గొన్నారు