ప్రజా ప్రభుత్వం పేదల ఇంటికే సంక్షేమాన్ని చేరవేస్తోంది…!
రాష్ట్ర మంత్రి పొంగులేటి శ్రీనివాస రెడ్డి
ఖమ్మం బ్యూరో ప్రతినిధి మన ప్రజావాణి
ప్రజా ప్రభుత్వం పేదల ఇంటికే సంక్షేమాన్ని చేరవేస్తోందని రాష్ట్ర రెవెన్యూ, హౌసింగ్, సమాచార పౌర సంబంధాల శాఖల మంత్రి పొంగులేటి శ్రీనివాస రెడ్డి అన్నారు.
శనివారం నేలకొండపల్లి మండలంలో జిల్లా కలెక్టర్ దివాకర టిఎస్.తో కలిసి మంత్రి పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలు చేశారు. కట్టుకాచారం గ్రామంలో పాలేరు వాగుపై రూ.6.65 కోట్ల వ్యయంతో నిర్మించిన చెక్‌డ్యామ్‌ను మంత్రి ప్రారంభించారు. అనంతరం కట్టుకాచారం పీపీవీ నుంచి బట్టుకుంటవాగు వరకు రూ.2.50 కోట్లతో నిర్మించనున్న బీటీ రోడ్డు పనులకు శంకుస్థాపన చేశారు.
ఈ సందర్భంగా మంత్రి పొంగులేటి శ్రీనివాస రెడ్డి మాట్లాడుతూ.రూ.6.65 కోట్లతో నిర్మించిన చెక్‌డ్యామ్‌ను ప్రారంభించడం ఎంతో సంతృప్తినిచ్చిందని అన్నారు. ఈ చెక్‌డ్యామ్‌తో కట్టుకాచారం, కొత్తగూడెం, పరిసర గ్రామాల్లో భూగర్భ జలాలు పెరిగి రైతులకు ఎంతో ప్రయోజనం కలుగుతుందని తెలిపారు. కట్టుకాచారం పీపీవీ నుంచి బట్టుకుంటవాగు వరకు రూ.2.50 కోట్లతో బీటీ రోడ్డు నిర్మాణ పనులకు శంకుస్థాపన చేసినట్లు మంత్రి తెలిపారు.
రాయగూడెం నుంచి తక్కెళ్లపాడు వరకు బీటీ రోడ్డు నిర్మాణానికి రూ.3 కోట్లు, కట్టుకాచారం గ్రామ అంతర్గత రోడ్లకు రూ.52 లక్షలు, విద్యుత్ లైన్ల మార్పిడికి రూ.7.50 లక్షలు, తాగునీటి వసతుల కోసం రూ.3.50 లక్షలు, అంగన్‌వాడీ భవనం నిర్మాణం, ఇతర అభివృద్ధి పనులకు నిధులు మంజూరు చేసినట్లు పేర్కొన్నారు. కట్టుకాచారం గ్రామంలో ప్రజా ప్రభుత్వం ఏర్పడిన 35 నెలల్లో సుమారు రూ.13.50 కోట్లతో వివిధ అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలు చేపట్టినట్లు మంత్రి తెలిపారు.
ప్రస్తుతం దేశవ్యాప్తంగా ఎల్‌నినో పరిస్థితులు నెలకొన్నాయని, దీంతో నీటి లభ్యతపై ప్రభావం పడుతోందని మంత్రి అన్నారు. ఇలాంటి పరిస్థితుల్లో కట్టుకాచారం వద్ద చెక్‌డ్యామ్ నిర్మాణం పూర్తవడం రైతులకు ఎంతో ప్రయోజనకరమని తెలిపారు. చెక్ డ్యామ్ వల్ల భూగర్భ జలాలు పెరగడంతో పాటు సాగునీటి లభ్యత మెరుగుపడు తుందని అన్నారు. చెక్‌డ్యామ్ నిర్మాణంతో రైతులు సంతోషంగా ఉన్నారని పేర్కొన్నారు.
దేశవ్యాప్తంగా తాగునీటి సమస్య కూడా ఏర్పడుతోందని, ఎల్‌నినో ప్రభావంతో అనేక గ్రామాల్లో తాగునీటి సమస్యలు ఎదురవు తున్నాయని మంత్రి తెలిపారు. విద్యుత్ ఉత్పత్తి కూడా సవాలుగా మారుతున్న నేపథ్యంలో తెలంగాణలో విద్యుత్ సరఫరాపై ప్రత్యేక శ్రద్ధ వహిస్తున్నామని చెప్పారు.
తెలంగాణను ప్రపంచంలోని అభివృద్ధి చెందిన ప్రాంతాలతో పోటీ పడేలా ముందుకు తీసుకెళ్లేందుకు విద్యుత్ ఎంతో అవసరమని మంత్రి అన్నారు. సౌర, తదితర ప్రత్యామ్నాయ వనరుల నుంచి విద్యుత్‌ను సమకూర్చుకునేందుకు రాష్ట్ర కేబినెట్ నిర్ణయం తీసుకుందని తెలిపారు.
ప్రజా ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తరువాత సన్నబియ్యం, కొత్త రేషన్ కార్డులు, 200 యూనిట్ల ఉచిత విద్యుత్, ఇందిరమ్మ ఇండ్లు, తదితర అనేక సంక్షేమ కార్యక్రమాలను అమలు చేస్తున్నామని మంత్రి తెలిపారు. ప్రజలకు అవసరమైన సంక్షేమ పథకాలను వారి ఇంటి వద్దకే అందించేలా ప్రభుత్వం చర్యలు తీసుకుంటోందన్నారు.
అర్హత ఉన్న ప్రతి పేద కుటుంబానికి కులం, మతం, రాజకీయాలకు అతీతంగా ఇందిరమ్మ ఇల్లు అందిస్తామని మంత్రి పొంగులేటి శ్రీనివాస రెడ్డి స్పష్టం చేశారు. ప్రతిపక్ష పార్టీలకు మద్దతు ఇచ్చే అర్హులైన కుటుంబాలకు కూడా ఇందిరమ్మ ఇళ్లు అందిస్తామని తెలిపారు.
మొదటి విడతలో 4.50 లక్షల ఇందిరమ్మ ఇళ్లు మంజూరు చేయగా, ఇప్పటికే 2.25 లక్షల ఇళ్ల నిర్మాణాలు పూర్తయ్యాయని మంత్రి తెలిపారు. మిగిలిన ఇళ్ల నిర్మాణ పనులు వేగంగా కొనసాగుతున్నాయని అన్నారు. రెండవ విడతలో సుమారు 2.50 లక్షల ఇళ్లు మంజూరు చేశామని, హైదరాబాద్‌లో మరో లక్ష ఇళ్ల నిర్మాణాలు చేపడుతున్నామని వివరించారు.
జిల్లా కలెక్టర్ దివాకర టిఎస్ మాట్లాడుతూ ఇటీవల సమీప గ్రామంలో పర్యటించిన సమయంలో చెక్‌డ్యామ్ వల్ల రైతులు ఎంతో సంతోషంగా ఉన్నట్లు గమనించామని తెలిపారు. కట్టుకాచారం వద్ద నిర్మించిన చెక్‌డ్యామ్ ద్వారా సుమారు 250 ఎకరాల ఆయకట్టుకు సాగునీటి ప్రయోజనం కలుగుతుందని అన్నారు.
ఈ చెక్‌డ్యామ్‌తో భూగర్భ జలాలు కూడా మెరుగుపడతాయని, గ్రామంలో నీటికి ఇబ్బంది లేకుండా నీటి లభ్యత పెరుగుతుందని కలెక్టర్ తెలిపారు. రూ.6.65 కోట్ల వ్యయంతో చేపట్టిన చెక్‌డ్యామ్ నిర్మాణ పనులను కేవలం ఆరు నెలల్లోనే పూర్తి చేసినట్లు చెప్పారు.
ప్రస్తుత సూపర్ ఎల్‌నినో పరిస్థితుల్లో ఈ చెక్‌డ్యామ్ రైతులకు, గ్రామీణ ప్రజలకు ఎంతో ఉపయోగకరంగా ఉంటుందని కలెక్టర్ పేర్కొన్నారు.
ఈ కార్యక్రమంలో నీటిపారుదల శాఖ చీఫ్ ఇంజనీర్ వాసంతి, ఎస్ఈ ఎం. వెంకటేశ్వర్లు, పీఆర్ ఎస్ఈ వెంకట్ రెడ్డి, ఆర్ అండ్ బి ఎస్ఈ యుగంధర్ రావు, హౌజింగ్ పిడి భూక్యా శ్రీనివాస్, ఖమ్మం ఆర్డీవో ఎన్. శ్రీనివాస్, స్థానిక సర్పంచ్ సైదులు, ప్రజాప్రతినిధులు, వివిధ శాఖల అధికారులు, రైతులు, గ్రామస్థులు, తదితరులు పాల్గొన్నారు.