ప్రజావాణి ఫిర్యాదుల పెండెన్సీ తగ్గించాలి అన్ని స్థాయిల్లో ఫిర్యాదులను త్వరితగతిన పరిష్కరించాలి: జిల్లా కలెక్టర్ బి. చంద్రశేఖర్.
నల్గొండ జిల్లా ప్రతినిధి ప్రజావాణి
నల్లగొండ ప్రజావాణి కార్యక్రమంలో అందుతున్న ఫిర్యాదుల పెండెన్సీని అన్ని స్థాయిల్లో తగ్గించి, ప్రజల సమస్యలను త్వరితగతిన పరిష్కరించేలా అధికారులు ప్రత్యేక దృష్టి సారించాలని జిల్లా కలెక్టర్ బి. చంద్రశేఖర్ ఆదేశించారు. సోమవారం కలెక్టరేట్ లోని సమావేశ మందిరంలో జిల్లా అధికారులతో కలిసి ప్రజల నుంచి ప్రజావాణి ఫిర్యాదులను జిల్లా కలెక్టర్ స్వీకరించారు. ఈ సందర్భంగా మండల, డివిజన్ స్థాయిల్లో స్థానిక సంస్థలు, రెవెన్యూ తదితర అంశాలకు సంబంధించిన ఫిర్యాదులు అధికంగా పెండింగ్‌లో ఉన్నాయని ఆయన పేర్కొన్నారు. పెండింగ్ ఫిర్యాదులపై ప్రత్యేక దృష్టి సారించి, వీలైనంత త్వరగా పరిష్కరించాలని జిల్లా రెవెన్యూ అధికారి దశరథ్, స్థానిక సంస్థల ఇన్‌చార్జి అదనపు కలెక్టర్ ప్రేమ్ కరణ్ రెడ్డిని ఆదేశించారు. జిల్లా అధికారులందరూ గతంలో ఇచ్చిన ఆదేశాల మేరకు హాస్టళ్లను తనిఖీ చేసి తప్పనిసరిగా నివేదికలు సమర్పించాలని సూచించారు.
ప్రజాపాలన ప్రగతి ప్రణాళికలో భాగంగా రాష్ట్ర ప్రభుత్వం నిర్వహించిన 11 అంశాల్లో సాధించిన లక్ష్యాలపై ఈ నెల 6 వ తేదీలోగా నివేదిక అందజేయాలని ఆదేశించారు. త్వరలో నిర్వహించనున్న ‘దిశ’ సమావేశానికి కూడా సంబంధిత శాఖల అధికారులు పూర్తి వివరాలతో నివేదికలు సమర్పించాలన్నారు. ప్రజా ప్రతినిధులు, ముఖ్యమంత్రి కార్యాలయం, వీఐపీలు, చీఫ్ సెక్రటరీ, ప్రజావాణి, సీపీఆర్ఓ తదితర మార్గాల ద్వారా వచ్చిన రిఫరెన్సులపై తీసుకున్న చర్యలను రాతపూర్వకంగా తెలియజేయాలని కలెక్టర్ సూచించారు. సెప్టెంబర్ నెలలో అధికారులు నిర్వహించిన పర్యటనల వివరాలను తక్షణమే సమర్పించాలని ఆదేశించారు. ప్రతిరోజూ వార్తాపత్రికల్లో ప్రచురితమయ్యే ప్రతికూల వార్తలపై సంబంధిత శాఖల అధికారులు వెంటనే స్పందించి, తీసుకున్న చర్యలు లేదా వివరణను సమర్పించాలని స్పష్టం చేశారు. ఈ నెల 5 నుంచి 12వ తేదీ వరకు సమాచార హక్కు చట్టంపై అవగాహన వారోత్సవాలు నిర్వహిస్తున్న నేపథ్యంలో, జిల్లా అధికారుల వద్ద పెండింగ్‌లో ఉన్న ఆర్టీఐ దరఖాస్తులు, అప్పీల్ దరఖాస్తులపై నిర్దేశిత ప్రొఫార్మాలో సమాచారాన్ని అందించాలని కలెక్టర్ ఆదేశించారు. సమాచార హక్కు చట్టం కింద అందుతున్న దరఖాస్తులను ఎప్పటికప్పుడు పారదర్శకంగా పరిష్కరించాలని సూచించారు. త్వరలో ప్రారంభం కానున్న పత్తి, ధాన్యం సేకరణకు అవసరమైన అన్ని ఏర్పాట్లు పూర్తి చేయడంతోపాటు, ప్రక్రియను నిరంతరం పర్యవేక్షించాలని సంబంధిత శాఖల అధికారులను ఆదేశించారు. సేకరణ సమయంలో ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా అధికారులు అప్రమత్తంగా ఉండాలని సూచించారు.
ఎల్‌నినో ప్రభావంతో భూగర్భ జలాలను పరిమితికి మించి వినియోగించే అవకాశం ఉన్న ప్రాంతాల సంఖ్య ప్రతి నెల పెరుగుతోందని కలెక్టర్ తెలిపారు. ఈ నేపథ్యంలో జిల్లావ్యాప్తంగా నీటిని పొదుపుగా, సద్వినియోగంగా వినియోగించేలా ప్రజలకు అవగాహన కల్పించాలని సూచించారు. జిల్లాలో ఎక్కడైనా తాగునీటి పైప్‌లైన్ లీకేజీలు ఉంటే వెంటనే అరికట్టాలని, వాల్టా నిబంధనలకు అనుగుణంగా నీటి సంరక్షణ చర్యలు చేపట్టాలని ఆదేశించారు. గ్రామాల్లో తాగునీటి కొరత ఏర్పడితే అవసరమైన చోట నీటి వనరులను అద్దెకు తీసుకునేలా చర్యలు చేపట్టాలని సూచించారు. వాల్టా అనుమతి లేకుండా కొత్త బోర్ల తవ్వకాలకు వ్యక్తులు, సంస్థలకు అనుమతులు మంజూరు చేయవద్దని స్పష్టం చేశారు. అలాగే, ఈ నెల 8 వ తేదీలోగా చేయూత పెన్షన్ దరఖాస్తులను పరిశీలించి పంపించాలని అధికారులను ఆదేశించారు. సోమవారం నిర్వహించిన ప్రజావాణి కార్యక్రమంలో రెవెన్యూ శాఖకు సంబంధించి 55 దరఖాస్తులు, ఇతర శాఖలకు సంబంధించి 86 దరఖాస్తులు కలిపి మొత్తం 141 దరఖాస్తులను ప్రజలు సమర్పించారు. ఈ సందర్భంగా సమాచార హక్కు చట్టంపై రూపొందించిన ప్రతిజ్ఞను జిబిల్లా కలెక్టర్ బి. చంద్రశేఖర్ అధికారులందరి చేత చేయించారు. ఈ కార్యక్రమంలో రెవెన్యూ అదనపు కలెక్టర్ జె. శ్రీనివాస్, శిక్షణ సహాయ కలెక్టర్ ఎన్. శ్రీకాంత్ రెడ్డి, డీఆర్డీఓ శేఖర్ రెడ్డి, డీఆర్వో దశరథ్, వివిధ శాఖల జిల్లా అధికారులు తదితరులు పాల్గొన్నారు.