prajavaani.net
Newspaper Banner
Date of Publish : 12 October 2026, 2:57 pm Digital Edition : PRAJA VANI

ప్రజల సమస్యలపై శశిధర్ రెడ్డి ప్రత్యేక చొరవ

*ప్రజల సమస్యలపై శశిధర్ రెడ్డి ప్రత్యేక చొరవ!*

*సిఎంసి కమిషనర్ సృజన దృష్టికి బీహెచ్‌ఈఎల్ మెట్రో, సూర్యోదయ కాలనీల సమస్యలు*

*మౌలిక వసతుల కల్పనకు ప్రాధాన్యమివ్వాలని విజ్ఞప్తి*

అమీన్‌పూర్, అక్టోబర్ 12 (ప్రజావాణి): కాలనీల్లో పేరుకుపోయిన ప్రజా సమస్యలకు తక్షణమే పరిష్కారం చూపాలని, మౌలిక సదుపాయాల కల్పనలో జాప్యానికి తావులేకుండా అభివృద్ధి పనులను వేగవంతం చేయాలని అమీన్‌పూర్ పట్టణ కాంగ్రెస్ అధ్యక్షుడు శశిధర్ రెడ్డి కోరారు. ప్రజలు ఎదుర్కొంటున్న ఇబ్బందులను తొలగించేందుకు అధికారులు ప్రత్యేక దృష్టి సారించాలని విజ్ఞప్తి చేశారు. సోమవారం అమీన్‌పూర్ సర్కిల్(47) పరిధిలో పర్యటించిన సైబరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ కమిషనర్ జి. సృజనను మర్యాదపూర్వకంగా కలిసిన ఆయన, స్థానిక సమస్యలను ఆమె దృష్టికి తీసుకెళ్లారు.
ఈ సందర్భంగా బీరంగూడ డివిజన్ పరిధిలోని బీహెచ్‌ఈఎల్ మెట్రో కాలనీ, సూర్యోదయ కాలనీల్లో కొనసాగుతున్న అభివృద్ధి పనులతో పాటు కొత్తగా చేపట్టాల్సిన పనులను కమిషనర్ పరిశీలించారు. ఆయా కాలనీల్లో నెలకొన్న సమస్యలను శశిధర్ రెడ్డి వివరించారు. ప్రజలకు అవసరమైన మౌలిక సదుపాయాల కల్పనకు ప్రాధాన్యం ఇవ్వాలని, పెండింగ్‌లో ఉన్న అభివృద్ధి పనులను త్వరితగతిన పూర్తి చేయాలని కోరారు. కాలనీల సమగ్రాభివృద్ధికి అధికారులు ప్రత్యేక చర్యలు చేపట్టాలని విజ్ఞప్తి చేశారు.
ఈ సందర్భంగా శశిధర్ రెడ్డి మాట్లాడుతూ ప్రజా సమస్యలను అధికారుల దృష్టికి తీసుకెళ్లి, వాటి పరిష్కారానికి నిరంతరం కృషి చేయడమే తన లక్ష్యమని పేర్కొన్నారు. ప్రజల అవసరాలకు అనుగుణంగా అభివృద్ధి పనులు చేపట్టాల్సిన అవసరం ఉందన్నారు. ప్రజా సమస్యల పరిష్కారమే ధ్యేయంగా, ప్రాంత అభివృద్ధే లక్ష్యంగా ప్రజలకు ఎల్లప్పుడూ అందుబాటులో ఉంటూ సేవలను కొనసాగిస్తానని స్పష్టం చేశారు.