డిజిటల్ రేషన్ కార్డుపై ప్రధాని మోదీ ఫొటో ఎందుకు లేదు?
ప్రజలను తప్పుదోవ పట్టించేలా రాష్ట్ర ప్రభుత్వం వ్యవహరించొద్దు
బీజేపీ మేడ్చల్ జిల్లా అధికార ప్రతినిధి బచ్చు కృష్ణప్రియ మల్లారెడ్డి
మేడ్చల్: రాష్ట్ర ప్రభుత్వం డిజిటల్ రేషన్ కార్డుల పంపిణీ చేపట్టడం సంతోషకరమైన విషయమేనని, అయితే రేషన్ కార్డులపై కేవలం రాష్ట్ర ముఖ్యమంత్రి, ఉత్తమ్ కుమార్ రెడ్డి ఫొటోలు మాత్రమే ముద్రించి ప్రధాని నరేంద్ర మోదీ ఫొటోను లేకుండా చేయడం సమంజసం కాదని బీజేపీ మేడ్చల్ జిల్లా అధికార ప్రతినిధి బచ్చు కృష్ణప్రియ మల్లారెడ్డి విమర్శించారు.
రేషన్ షాపుల ద్వారా ప్రతి కుటుంబానికి అందుతున్న ఉచిత బియ్యంలో కేంద్ర ప్రభుత్వ పాత్ర కీలకమని ఆమె పేర్కొన్నారు. కేంద్ర ప్రభుత్వం ఒక్కో వ్యక్తికి నెలకు 5 కిలోల చొప్పున ఉచిత బియ్యాన్ని అందిస్తుండగా, రాష్ట్ర ప్రభుత్వం అదనంగా కిలో బియ్యం అందిస్తోందని తెలిపారు.
కేంద్ర ప్రభుత్వం అందిస్తున్న సంక్షేమ పథకాలకు సంబంధించిన వాస్తవాలను ప్రజలకు తెలియకుండా చేసి, రేషన్ కార్డులపై రాష్ట్ర ప్రభుత్వ పెద్దల ఫొటోలను మాత్రమే ముద్రించడం ద్వారా ప్రజలను తప్పుదోవ పట్టించే ప్రయత్నం చేస్తున్నారా? అని ఆమె ప్రశ్నించారు.
ప్రజల కోసం ఎక్కువ మొత్తంలో బియ్యం అందిస్తున్న కేంద్ర ప్రభుత్వానికి, ప్రధాని నరేంద్ర మోదీకి తగిన గుర్తింపు ఇవ్వకుండా కేవలం రాష్ట్ర ప్రభుత్వ నాయకుల ఫొటోలను మాత్రమే ముద్రించడం వెనుక ఉన్న ఉద్దేశం ఏమిటో ప్రభుత్వం స్పష్టం చేయాలని డిమాండ్ చేశారు.
ప్రజలు అమాయకులు కాదని, కేంద్రం అందిస్తున్న సంక్షేమ పథకాలు, రాష్ట్ర ప్రభుత్వం అందిస్తున్న వాటి గురించి ప్రజలకు పూర్తిగా అవగాహన ఉందని అన్నారు. రాజకీయ ప్రచారం కోసం ప్రభుత్వ పథకాలను ఉపయోగించుకోవడం మానుకోవాలని సూచించారు.
ముఖ్యమంత్రి స్థాయిలో ఉన్న వ్యక్తులు ఇలాంటి విషయాల్లో మరింత బాధ్యతగా వ్యవహరించాలని, ప్రజలకు వాస్తవాలు స్పష్టంగా తెలియజేయాలని బచ్చు కృష్ణప్రియ మల్లారెడ్డి హితవు పలికారు.