prajavaani.net
Newspaper Banner
Date of Publish : 24 October 2026, 3:20 pm Digital Edition : PRAJA VANI

పోలీస్ అమరవీరుల స్ఫూర్తితో రక్తదాన కార్యక్రమం

*పోలీస్ అమరవీరుల స్ఫూర్తితో రక్తదాన కార్యక్రమం.. రక్తదానం మహాదానం – జిల్లా ఎస్పీ శరత్ చంద్ర పవార్ ఐపీఎస్..*

*నల్గొండ జిల్లా ప్రతినిధి ప్రజావాణి*

పోలీస్ అమరవీరుల సంస్మరణ వారోత్సవాల్లో భాగంగా నల్లగొండ జిల్లా పోలీస్ శాఖ ఆధ్వర్యంలో జిల్లా వ్యాప్తంగా రక్తదాన కార్యక్రమాలు నిర్వహించగా, జిల్లా పోలీస్ కార్యాలయంలో ఏర్పాటు చేసిన రక్తదాన శిబిరాన్ని జిల్లా ఎస్పీ శరత్ చంద్ర పవార్ ఐపీఎస్ ప్రారంభించారు. ఈ సందర్భంగా ఎస్పీ మాట్లాడుతూ రక్తదానం అనేది ప్రాణదానంతో సమానమని, అత్యవసర పరిస్థితుల్లో రక్తం అందక ప్రాణాపాయ స్థితిలో ఉన్న ఎంతోమందిని రక్తదానం ద్వారా ప్రాణాలను కాపాడే అవకాశం ఉంటుందని పేర్కొన్నారు. ప్రతి ఒక్కరూ సామాజిక బాధ్యతగా భావించి రక్తదానానికి ముందుకు రావాలని పిలుపునిచ్చారు. పోలీస్ అమరవీరుల సంస్మరణ వారోత్సవాల ప్రధాన ఉద్దేశం దేశం కోసం, ప్రజల రక్షణ కోసం తమ ప్రాణాలను సైతం లెక్కచేయకుండా విధులు నిర్వర్తించి అమరులైన వారి త్యాగాలు ప్రతి ఒక్కరికీ స్ఫూర్తిదాయకమని అన్నారు. వారి స్ఫూర్తితో నిర్వహిస్తున్న రక్తదాన కార్యక్రమం ద్వారా ఆపదలో ఉన్నవారికి ప్రాణదానం చేయడం ఎంతో గొప్ప విషయమని పేర్కొన్నారు. ఒకరు స్వచ్ఛందంగా ఇచ్చే రక్తం ప్రమాదాల్లో గాయపడిన వారికి, శస్త్రచికిత్సలు చేయించుకునే రోగులకు, ప్రసవ సమయంలో అధిక రక్తస్రావంతో బాధపడే మహిళలకు, ఇతర అత్యవసర వైద్య చికిత్సలు పొందుతున్న వారికి ఎంతో ఉపయోగపడుతుందని ఎస్పీ వివరించారు. రక్తానికి ప్రత్యామ్నాయం లేదని, అవసరమైన సమయంలో సకాలంలో రక్తం అందించడం ద్వారా విలువైన ప్రాణాలను కాపాడవచ్చని తెలిపారు. రక్తదానం చేయడం వల్ల సమాజానికి సేవ చేయడంతో పాటు మానవత్వాన్ని చాటుకునే అవకాశం లభిస్తుందని అన్నారు. యువత సామాజిక సేవా కార్యక్రమాల్లో చురుకుగా పాల్గొనాలని, రక్తదానంపై ప్రజల్లో ఉన్న అపోహలను తొలగించి మరింత అవగాహన కల్పించాలని ఎస్పీ సూచించారు. ఆరోగ్యంగా ఉన్న అర్హులైన వ్యక్తులు వైద్యుల సూచనల మేరకు స్వచ్ఛందంగా రక్తదానం చేసేందుకు ముందుకు రావాలని కోరారు. రక్తదానం చేయడం వల్ల మరొకరి కుటుంబంలో ఆనందాన్ని నింపడంతో పాటు, ఆ కుటుంబానికి కొత్త ఆశను అందించినవారమవుతామని తెలిపారు. పోలీస్ అమరవీరుల స్ఫూర్తితో నిర్వహించిన ఈ కార్యక్రమంలో అధిక సంఖ్యలో పాల్గొని రక్తదానం చేసేందుకు ముందుకు వచ్చిన అమ్మ ఫౌండేషన్ సభ్యులు, యువజన సంఘాల ప్రతినిధులు, ఇతర యువతను ఎస్పీ ప్రత్యేకంగా అభినందించారు. సమాజ సేవ పట్ల యువత చూపుతున్న ఆసక్తి అభినందనీయమని, ఇలాంటి సేవా కార్యక్రమాలను భవిష్యత్తులోనూ కొనసాగించాలని ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో అడిషనల్ ఎస్పీ రమేష్, ఎస్బీ డీఎస్పీ మల్లారెడ్డి, నల్లగొండ డీఎస్పీ కె. శివరాం రెడ్డి, సీఐలు ఆదిరెడ్డి, నాగరాజు, శ్రీను నాయక్, మంజుల, ఆర్‌ఐలు సంతోష్, సూరపు నాయుడు, ఎస్‌ఐలు, పోలీస్ సిబ్బంది, అమ్మ ఫౌండేషన్ సభ్యులు, యువజన సంఘాల ప్రతినిధులు, యువత తదితరులు పాల్గొన్నారు.